భైరవ గీత మూవీ రివ్యూ
నటీనటులు: ధనంజయ, ఇర్రా మోర్, విజయ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: రవి శంకర్
ఎడిటింగ్: అన్వర్ అలీ
సినిమాటోగ్రఫీ: జగదీష్
ప్రొడ్యూసర్: భాస్కర్ రాశి
దర్శకత్వం: సిద్దార్థ తాతోలు
ఆఫీసర్ డిజాస్టర్ తర్వాత చాలా కామ్ గా ఉండి మధ్య మధ్యలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ హడావిడీ చేస్తూ.. ఉన్నట్టుండి.. తన శిష్యుడు సిద్దార్థతో భైరవ గీత అనే సినిమాని డైరెక్ట్ చేయించిన రామ్ గోపాల్ వర్మ... మధ్యలో తన సినిమా పబ్లిసిటీ కోసం 2.ఓ నే టార్గెట్ చేసి మరీ వార్తల్లో నిలిచాడు. ఎప్పుడూ పబ్లిసిటీ కోసం వెంపర్లాడే రామ్ గోపాల్ వర్మ భైరవ గీతకి మాత్రం ఫ్రీగానే పబ్లిసిటీ వచ్చేలా చేసాడు. 2.ఓ మీదకి వదులుదామనుకుంటే సెన్సార్ వారు భైరవ గీతకి చుక్కలు చూపించారు. దీంతో రిలీజ్ డేట్ మార్చుకుంటూ ఎట్టకేలకు ఈ శుక్రవారం భైరవ గీత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాని సిద్దార్థ తాతోలు కొత్తగా ఏమైనా ఆవిష్కరించాడా... లేదంటే రామ్ గోపాల్ వర్మ శిష్యుడు కదా... వర్మ లాగే పైత్యానికి పోయాడా అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
తరతరాలుగా భైరవ (ధనుంజయ) కుటుంబం ఒక గ్రామంలోని అగ్రవర్ణానికి చెందిన సుబ్బారెడ్డి (బాలరాజ్‌వాడీ) దగ్గర బానిసలుగా పనిచేస్తుంటారు. సుబ్బారెడ్డి అగ్రకులానికి చెందిన ఫ్యాక్షనిస్ట్. సుబ్బారెడ్డి తక్కువ కులానికి చెందిన వారిని బానిసలుగా మారుస్తుంటాడు. ఆ విధంగానే ధనుంజయ కుటుంబం కూడా సుబ్బారెడ్డి కింద పనిచేస్తుంది. అయితే ఫ్యాక్షన్ గొడవల్లో భైరవ తండ్రి మరణిస్తాడు. తండ్రి మరణాంతరం సుబ్బారెడ్డి ప్రాణాలను కాపాడటం కోసం కత్తి పట్టి సుబ్బారెడ్డి ప్రాణానికి తన ప్రాణం అడ్డువేస్తాడు భైరవ. అయితే సుబ్బారెడ్డి తన కూతురు గీత(ఇర్రా మోర్)ని అదే ఊరిలో ఉండే కేశవరెడ్డి కొడుకు కట్టారెడ్డి (విజయ్)కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అలా చేస్తే ఆ ఊరిలో తనకి ఎదురు నిలిచే మొగాడు ఉండడు అని అనుకుంటాడు. కానీ సుబ్బారెడ్డి కూతురు గీత మాత్రం భైరవ ని ప్రేమిస్తుంది. భైరవ మాత్రం గీతని ప్రేమించడు. అసలు గీత ప్రేమిస్తున్న విషయం భైరవకి తెలియదు. కానీ విషయం తెలిసిన సుబ్బారెడ్డి భైరవని చంపడానికి మనుషులను పంపిస్తాడు. మరి గీత ప్రేమ భైరవకి తెలుస్తుందా? అసలు భైరవ, గీత ప్రేమని ఒప్పుకుంటాడా? అగ్రకులం, తక్కువ కులం ప్రేమను సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడా? అసలు గీత, భైరవ ఊరొదిలేసి ఎందుకు పారిపోవాల్సి వస్తుంది? అనేది మిగతా కథ.
నటీనటులు:
ధనుంజయ్... భైరవ పాత్రకు తగ్గట్లు… లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా అనిపిస్తాడు. కానీ కొన్నిచోట్ల అవసరానికి మించిన ఎక్స్ ప్రెషన్స్ తో అయోమయానికి గురి చేశాడు. అసలు హీరోనా లేక సైడ్ ఆర్టిస్టా అనే అనుమానం కలుగుతూనే ఉంటుంది. కొన్నిచోట్ల అంటే హీరోయిన్ ఫాదర్ సుబ్బారెడ్డికి వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో, ప్రీ క్లైమాక్స్ సన్నివేశంలో ధనుంజయ్ నటన చాలా బాగుంది. ఇక హీరోయిన్ గా నటించిన ఇర్రా మోర్ కొన్ని బోల్డ్ సీన్స్ లో అవలీలగా నటించింది. దర్శకుడు ఆమె కోసం బలమైన సీన్లను అయితే రాసాడు కానీ నటనలో ఇర్రా ఇంకా పరిణితిని చూపించాలి. లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. హీరోయిన్ తండ్రిగా కనిపించిన బాలరాజ్‌వాడీ అత్యంత సహజమైన క్రూతరత్వంతో, కట్టారెడ్డి పాత్రధారి… శాడిజంతోనూ చెలరేగిపోయారు. మిగిలిన నటులంతా పరిధి మేర ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు:
రవి శంకర్ మ్యూజిక్ ఏవిధంగానూ ఆకట్టుకునేలా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఎలాంటి వైవిధ్యం లేదు. పాత మ్యూజిక్ మళ్లీ వాడేసాడనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీ. సహజమైన లొకేషన్లలోనే సినిమా చిత్రీకరణ జరపడం వల్ల.. సహజత్వం ప్రతీ ఫ్రేమ్ లో కనబడుతుంది. జగదీష్ చీకటి రాయలసీమ ఫ్యాక్షన్‌ను విజువల్‌గా ప్రతి ఫ్రేమ్‌లోనూ ఎంతో చక్కగా చూపించగలిగాడు. అన్వర్ అలీ ఎడిటింగ్ కథను సాగదీయకుండా.. 2.09 నిమిషాల నిడివితో చక్కగా ఎడిట్ చేశారానిపిస్తుంది కానీ ఎక్కడో బోర్ ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ సినిమాకి నిర్మాణ విలువలు కథానుసారంగా ఉన్నాయి.
విశ్లేషణ:
రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ సినిమా కథ ఏమిటనేది... ప్రేక్షకుడు మొదట్లోనే ఒక అంచనాకి వచ్చేస్తాడు. ఇక సినిమా చూస్తున్నంత సేపు.. గోపీచంద్ యజ్ఞం సినిమానే గుర్తుకు వస్తుంది. యజ్ఞం, భైరవ గీత సినిమాకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఆ సినిమా కథ, ఈ సినిమా కథ ఒకేలా అనిపిస్తుంది. భయంకరమైన హింస, రక్తపాతం, ఒళ్లు గగుర్పొడిచే భయానక సన్నివేశాలు, రొమాన్స్, లవ్, లిప్ లాక్, సెంటిమెంట్.. ఇలా అన్ని విషయాల్లోనూ యజ్ఞం సినిమానే భైరవ గీత సినిమా తలపిస్తుంది. సినిమా మొత్తంలో దర్శకుడు సిద్దార్థ్ తాతోలు రక్తాన్ని ఏరులై పారించాడు. దర్శకరచయితలు రాసుకున్న కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథలో ఫ్లో మిస్ అయింది. ముఖ్యంగా దర్శకుడు రాసుకున్న కథనం ఆకట్టుకునే విధంగా లేదు. ఏ సీన్ కి ఆ సీన్ బాగుంది అనిపించినా... ఓవరాల్ గా కథలో మిళితమై ఉండవు. దీనికి తోడు కథనం కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. టేకింగ్ అంటే డ్రోన్ షాట్లు ఎక్కువ వాడటం, మితిమీరిన వయిలెన్స్ ని భీతిగొలిపేలా చూపించడం, యాక్టర్స్ యాంగిల్స్ ని మోతాదు మించి క్లోజ్ అప్ లో కట్ చేయడం తదితర వర్మ గారి పైత్యాలన్నీ భైరవ గీత లో కనిపిస్తాయి. అసలు ఒకొనొక టైంలో ఈ సినిమా డైరెక్టర్ వర్మ అనే ఫీలింగ్ తెప్పిస్తుంది. ఇక కొన్ని సన్నివేశాలు నాటకీయతను తలపిస్తాయి. అందులో భైరవని ప్రేమించేయాలన్నంత సీన్.. గీతకు ఎప్పుడు.. ఎలా కలిగిందో తెలీదు. అలాగే గీతని భైరవ ఎందుకు ప్రేమిస్తాడో తెలీదు. అసలు గీత, భైరవల లవ్ ట్రాక్ కూడా ఏమంత కొత్తగా అనిపించదు.
రేటింగ్: 2.25/5