భరత్ అనే నేను రివ్యూ-2
టైటిల్: భరత్ అనే నేను
నటీనటులు: మహేష్‌బాబు, కైరా అద్వానీ, సత్యరాజ్, రావూ రమేష్, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, రవి శంకర్, పోసాని కృష్ణమురళీ తదితరులు
కూర్పు: శ్రీకర ప్రసాద్
కెమేరా: రవి.కె చంద్రన్, ఎస్.తిరుణావక్కరసు
పాటలు: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: డీవీవీ దానయ్య
దర్శకత్వం: కొరటాల శివ
సెన్సార్ నివేదిక: యూ / ఏ
సినిమా నిడివి: 173 నిమిషాలు
సినిమా అమ్మకాలు: రూ. 99 కోట్లు
విడుదల తేదీ: 20 ఏప్రిల్, 2018
ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘భరత్ అనే నేను’ సినిమా మేనియాలో మునిగి తేలుతోంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలకు ఇటీవల కేరాఫ్‌గా మారిపోయిన డీవీవీ దానయ్య నిర్మించారు. బాలీవుడ్ సినిమా ధోనీ ఫేం కైరా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా మహేష్ కెరీర్లోనే ఫస్ట్ పొలిటికల్ థ్రిల్లర్. మహేష్ ముఖ్యమంత్రిగా నటించాడు. భరత్‌ను రికార్డు స్థాయి థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియా ఓవర్సీస్లో కూడా భారీ ఎత్తున విడుదల చేశారు. శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మరోసారి టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు. టీజర్, ట్రైలర్లకు తిరుగులేని రెస్పాన్స్ రావడంతో భరత్‌పై అందరికి నమ్మకాలు డబుల్, ట్రిబుల్ అయ్యాయి. ఈ రోజు రిలీజ్ అయిన భరత్ సీఎంగా సక్సెస్ అయ్యాడా ? లేదా ? అన్నది తెలుగుపోస్ట్.కామ్ సమీక్షలో చూద్దాం.
సింగిల్ స్టోరీ లైన్ :
తండ్రి సీఎంగా ఉంటూ చనిపోతే ఆ ప్లేస్‌లోకి రాజకీయ అనుభవం లేకుండా వచ్చిన వారసుడు సీఎం అయ్యి ఏం చేశాడు ? వ్యవస్థను ఎలా మార్చడన్నదే మెయిన్ లైన్.
స్టోరీ :
ఆంధ్రప్రదేశ్‌లో నవోదయం పార్టీ అధికారంలో ఉంటుంది. ఈ పార్టీ సీఎం రాఘవరాజు (శరత్‌కుమార్), పార్టీ అధ్యక్షుడు వరదరాజు (ప్రకాష్‌రాజ్). రాఘవ హఠాన్మరణంతో పార్టీలో లుకలుకలు స్టార్ట్ అవుతాయి. సీఎం అయ్యేందుకు చాలా మంది పోటీపడుతుంటారు. ఈ టైంలో పార్టీలో చీలిక వస్తుందని భావించిన వరదరాజు చివరకు రాఘవ కుమారుడు భరత్‌రామ్ (మహేష్)నే సీఎం చేస్తాడు. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని భరత్, సీఎం గా ప్రజల ఇబ్బందులు, బ్రష్టు పడుతోన్న నాయకులు, కుళ్లిపోయిన వ్యవస్థలో మార్పుల కోసం అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ నిర్ణయాలతో భరత్ ప్రజల గుండెళ్లో కొలువైన సీఎంగా మారిపోతాడు. నాయకులు లేని సమాజాన్నినిర్మించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే భరత్‌కు ఇటు అధికార పార్టీ నాయకులు, మంత్రుల నుంచే కాకుండా విపక్ష పార్టీ నాయకుల నుంచి కూడా పెను సవాళ్లు ఎదురవుతాయి. ఇదే టైంలో వసుమతి (కైరా అద్వానీతో) ప్రేమలో పడతాడు. చివరకు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే తన తండ్రి చావు గురించి ఊహించని నిజం తెలుసుకుంటాడు ? చివరకు తనను టార్గెట్‌గా చేసుకున్న రాజకీయ కుట్రలను భరత్ ఎలా తిప్పికొట్టాడు ? భరత్ తిరిగి ఎలా సీఎం అయ్యాడు ? అన్నదే ఈ సినిమా స్టోరీ.
సినిమా ఎలా ఉంది....
పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కథ మరీ కొత్తగా లేకపోయినా దర్శకుడు కథనం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. హీరో సీఎం అయ్యేందుకు దారితీసిన పరిస్థితులు, అసెంబ్లీలో అనుభవం లేని వ్యక్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు ? అక్కడ విపక్షాల నుంచి వచ్చే విమర్శలకు ఇచ్చిన కౌంటర్లు బాగున్నాయి. భరత్ అసెంబ్లీలో ఇచ్చే కౌంటర్లు, ప్రసంగాలు, ఇటు తన పీఏ బ్రహ్మాజీతో పాటు వసుమతితో అతడి ప్రేమ సన్నివేశాలు కామెడీతో పాటు ఆహ్లాదంగా ఉంటాయి. అయితే హీరోయిన్‌కు, హీరో మధ్య సన్నివేశాలు మరీ తక్కువుగా ఉండడం మైనస్. ప్రతిపక్ష నేత సత్యరాజ్ మహేష్ తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకిస్తూ బాయ్‌కాట్ చేసేటప్పుడు చెప్పిన డైలాగులు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. బ్రహ్మాజీతో సీఎం భరత్ ఈ రోజు ఆ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకొస్తుంది అనే డైలాగ్‌తో పాటు సీఎం స్థాయిలో ఉండి హీరోయిన్‌తో ప్రేమలో పడే సీన్లు మంచి ఫీల్ ఇచ్చాయి. సమాజంలో బతకాలంటే భయం, బాధ్యత, జవాబుదారితనం ఉండాలి అనే సీఎం కాన్సెఫ్ట్ అమలు చేసిన తీరుకు కొరటాలను అభినందించాలి.
ఫస్టాఫ్ మొత్తం మహేష్ సీఎం అవ్వడం, హీరోయిన్‌తో ప్రేమలో పడడం, సంస్కరణలు అమలు చేయడం, వ్యవస్థలో మార్పులు, చివరకు ఇంటర్వెల్‌కు ముందు జరిగే ఉప ఎన్నికల్లో తన పార్టీ వాడికి కాకుండా ఇండిపెండెంట్‌కు సపోర్ట్ చేయడం ఇలా అన్ని సీన్లు సినిమాపై ఆసక్తి ఎక్కడా తగ్గకుండా ఉండేలా చేశాయి. సెకండాఫ్ కూడా ఆసక్తితోనే స్టార్ట్ అవుతుంది. సెకండాఫ్‌లో కథ పూర్తిగా పొలిటికల్ లైన్లోనే వెళుతుంది. హీరో, అధికారం, అధికార పక్షం, విపక్షం, ప్రజలు ఇలా వీరి మధ్యే తిరుగుతుంటుంది. సెకండాఫ్‌లో హీరోయిన్ పాత్రకు అస్సలు ప్రాధాన్యం లేదు. ఇక ప్రీ క్లైమాక్స్‌లో తన పదవికి రాజీనామా చేశాక జరిగిన ప్రెస్‌మీట్ అదిరిపోయింది. ఆ ప్రెస్మీట్లో మహేష్ తన రాసలీలలపై వచ్చిన వార్తలకు వివరణ ఇచ్చుకునే క్రమంలో మీడియాను టార్గెట్ చేసిన తీరు.. రాజకీయ నాయకులపై వేసిన పంచ్‌లు అదిరిపోయాయి. సెకండాఫ్‌లో వచ్చే సామి వచ్చాడయ్యా సాంగ్‌కు విజిల్స్ మార్మోగాయి. క్లైమాక్స్‌కు ముందు సినిమా స్పీడ్ మరీ స్లో అయ్యింది.
నటీనటులు ఏం చేశారు...
మహేష్‌బాబు కెరీర్లోనే సీఎంగా నటించిన ఈ సినిమా అతడికి ఎప్పటకీ గుర్తుండి పోతుంది. ఓ యంగ్ డైనమిక్ సీఎంగా అతడి పాత్ర చిత్రీకరణ, నటన విజృంభణ పర్వమే. మహేష్ సీఎం రోల్లో కొన్ని సార్లు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను గుర్తు చేశాడు. స్టైలీష్ సీఎంగానే కాదు.. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే క్రమంలోనూ, భావోద్వేగాలు పండించడంలోనూ, రొమాంటిక్ సీఎంగాను ఇలా అన్ని వేరియేషన్లలు మహేష్ నటన అతడిని మరో మెట్టు ఎక్కించడంతో పాటు ఈ సినిమా అతడి కెరీర్లో ప్రత్యేకమైందిగా మిగిలిపోయేలా చేసింది. హీరోయిన్ కైరా అద్వానీ లుక్స్ పరంగాను, అభినయంతోనూ ఆకట్టుకున్నా ఆమె పాత్రకు దర్శకుడు తీరని అన్యాయం చేశాడు. ఆమెకు వేళ్లమీద లెక్క పెట్టే సీన్లకే పరిమితం. సెకండాఫ్‌లో అయితే పాట వచ్చే ముందు ఆమె దర్శకుడికి గుర్తు వచ్చినట్లుంది. క్లైమాక్స్‌లో మళ్లీ ఆమెకు చిన్నపాటి కీ రోల్ ఇచ్చాడు. కానీ జంటగా మాత్రం మహేష్ పక్కన కైరా బాగా సెట్ అయ్యింది. వసుమతి సాంగ్‌లో వీరిద్దరి జంట బ్యూటిఫుల్‌గా ఉంది. మహేష్ తల్లిదండ్రులుగా శరత్‌కుమార్, సితార, కీలకమైన పార్టీ అధ్యక్షుడి రోల్లో వరదరాజులుగా ప్రకాష్‌రాజ్ నటించారు. ప్రకాష్‌రాజ్ క్యారెక్టర్‌ను చివరి వరకు ఎవ్వరూ ఊహించని విధంగా దర్శకుడు తీర్చిదిద్దాడు. సీఎం పీఎస్ భాస్కర్‌గా బ్రహ్మాజీ నవ్వులు పూయించాడు. ఇక రాజకీయ నాయకులుగా సత్యరాజ్, పోసాని, పృథ్వి, రవిశంకర్ ఇలా ఎవరికి వారు అసెంబ్లీలో యాక్ట్ చేశారు. మిగిలిన వారిలో రావూ రమేష్, సూర్య, అజయ్ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా ఎలా ఉందంటే....
సాంకేతికంగా అన్ని విభాగాలు అత్యున్నతంగా పనిచేశాయి. వీరిలో ముందు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌కు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. దేవిశ్రీ ఇటీవల పాటలు బాగా ఇస్తున్నా నేపథ్య సంగీతం విషయంలో తేలిపోతున్నాడు. కానీ భరత్ విషయంలో మాత్రం చాలా చాలా కేర్ తీసుకుని ప్రతి సీన్‌కు, సీన్‌కు తగినట్టుగా అదిరిపోయే ఆర్ ఆర్ ఇచ్చాడు. జనాలు దేవి నుంచి ఇలాంటి నేపథ్య సంగీతం కోరుకుంటున్నారు. భరత్ అనే నేను, వచ్చాడయ్యో సామి పాటలను దర్శకుడు చక్కగా హీరోయిజం ఎలివేట్ చేసే టైంలో వాడుకున్నాడు. రవి కె.చంద్రన్, తిరుణావక్కరుసు సినిమాటోగ్రఫీ సినిమాకు నిండుదనం తెచ్చింది. క్లోజఫ్ షాట్లే కావడంతో ప్రతి ఫ్రేమ్ నీట్‌గా, రిచ్‌గా ఉండేలా చూసుకున్నారు. ఆర్ట్ వర్క్ విషయంలో అసెంబ్లీ సెట్ ఇంకా బాగా డిజైన్ చేస్తే బాగుండేదనిపించింది. శ్రీకరప్రసాద్ ఎడిటింగ్ సినిమాను కరెక్ట్ ట్రాక్‌లో నడిపించింది. సినిమా సెకండాఫ్‌లో లాగ్ అయినట్టు ఉన్నా అది కొరటాల లెన్దీ సీన్లదే తప్పు తప్పా ఎడిటింగ్‌ను తప్పుపట్టలేం. రామ్-లక్ష్మణ్ యాక్షన్ సీన్లలో దుర్గామహాల్ థియేటర్లో వచ్చే ఫైట్ సినిమా మేజర్ హైలెట్స్‌లో ఒకటి. ఇక నిర్మాత దానయ్య బేనర్ విలువ పెంచే సినిమాల్లో భరత్ ఒకటిగా నిలుస్తుందని ఆయన పెట్టుకున్న నమ్మకం నిజం అయ్యింది. ఆయన నిర్మాణ విలువలు హై క్లాస్.
కొరటాల ఎలా తీశాడంటే...
ఇక కొరటాల కథ కాస్త పాత లైన్లోనే ఉన్నా కథకుడిగాను, దర్శకుడిగాను మరోసారి తాను ఎలా గ్రిప్పింగ్‌గా ప్రజెంట్ చేస్తానో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఓ పొలిటికల్ లైన్ తీసుకుని దానిని ఎక్కడా ట్రాక్ తప్పకుండా కమర్షియల్‌గా తెరకెక్కించిన తీరు అద్భుతమే. గతంలో చాలా మంది పొలిటికల్ జానర్లో సినిమాలు తీసినా కొరటాల చెప్పిన కమర్షియల్ రేంజ్లో మాత్రం వారు ఆ సినిమాలు తీయలేదనే చెప్పాలి. ఓ వైపు పొలిటికల్ డ్రామాను గ్రిప్పింగ్‌గా చెపుతూనే కమర్షియల్ వాల్యూస్ మిస్ కాకుండా తన సినిమాల్లో ఉండే సామాజిక సందేశాన్ని కూడా చక్కగా చెప్పాడు. సినిమాలో లోపాలూ లేకపోలేదు. ఫస్టాఫ్‌లో ప్రేక్షకుడు బాగా ఎంజాయ్ చేస్తాడు. సెకండాఫ్‌లో పూర్తిగా కథ పొలిటికల్ లైన్ మీదే నడవడం, కామెడీకి స్కోప్ లేకపోవడం, హీరోయిన్ సైడ్ అయిపోవడం, నరేషన్ మరీ ప్లాట్‌గా ఉండడం, క్లైమాక్స్ వేగం తగ్గిపోవడం లాంటి మైనస్‌లు ఉన్నా ప్రేక్షకుడికి అవేమి పట్టకుండానే భరత్ పక్కా పైసా వసూల్ అప్పటికే అయిపోతుంది. 8 నెలల 13 రోజులు పనిచేసిన సీఎం ట్రాఫిక్, విద్యావ్యవస్థ, గ్రామ పరిపాల లాంటి అంశాల్లో తీసుకున్న సంస్కరణలు బాగున్నాయి.
అనుకూలాంశాలు :
- సీఎంగా మహేష్‌బాబు పాత్ర, చిత్రీకరణ, నటన
- కొరటాల శివ కథనం
- యాక్షన్ ఎపిసోడ్స్
- డైలాగులు
- సినిమాటోగ్రఫీ
- దేవిశ్రీ నేపథ్య సంగీతం
- కమర్షియల్ ఫార్మాట్
- ప్రీ క్లైమాక్స్ ప్రెస్ మీట్
ప్రతికూలాంశాలు :
- సెకండాఫ్‌లో బిట్లు బిట్టుగా లాగ్ అవ్వడం
- నిడివి అవసరానికి మించి ఎక్కువ ఉండడం
- క్లైమాక్స్‌లో తగ్గిన వేగం
- హీరోయిన్ కైరా పాటలకే పరిమితం
తుది తీర్పు :
మహేష్ కెరీర్లో తొలిసారి సీఎంగా చేసిన భరత్ అనే నేను అతడికి కెరీర్లోనే మర్చిపోలేని సినిమాగా నిలుస్తుంది. అతడి పాత్ర చిత్రీకరణ, నటన సినిమాకే హైలెట్. ఓ యంగ్ డైనమిక్ సీఎం ఎలా ఉండాలో మహేష్ పాత్రే ఆదర్శం. దర్శకుడు కొరటాల శివ కాస్త పాత స్టోరీ లైనే అయినా వాణిజ్య విలువలు , సందేశం మిక్స్ చేసి కమర్షియల్‌గా సినిమాను నిలబెట్టడం గొప్ప విషయం.మహేష్ కెరీర్లోనే మరో హిట్ పడినట్టే. ఈ సినిమా అయితే హిట్... అయితే రికార్డులు ఎలా ఉంటాయి అన్నదే చూడాలి.
భరత్ అనే నేను తెలుగుపోస్ట్ రేటింగ్: 3.5/5.0