Mon Dec 23 2024 11:13:40 GMT+0000 (Coordinated Universal Time)
మూవీ రివ్యూ: ది ఘోస్ట్
కొత్త తరహా సినిమాలను చేసుకుంటూ వెళుతున్న కింగ్ అక్కినేని నాగార్జున నుండి వచ్చిన మరో సినిమా 'ది ఘోస్ట్'
సినిమా పేరు: ది ఘోస్ట్
విడుదల తేదీ : అక్టోబర్ 05, 2022
నటీనటులు: అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బిలాల్ హొస్సేన్
దర్శకుడు: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
సంగీత దర్శకుడు: మార్క్ రాబిన్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
కొత్త తరహా సినిమాలను చేసుకుంటూ వెళుతున్న కింగ్ అక్కినేని నాగార్జున నుండి వచ్చిన మరో సినిమా 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రోజు దసరా సందర్భంగా విడుదలైంది. టాలీవుడ్‌కి కొత్త తరహా చిత్రాలను తీసుకురావడానికి తాను ఎప్పుడూ ముందుంటానని నాగార్జున మరోసారి రుజువు చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా 'ది ఘోస్ట్' ను తెలుగు ప్రేక్షకుల కోసం స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారుతో చేతులు కలిపాడు. ఈ చిత్రం దసరా సందర్భంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ:
విక్రమ్ (నాగార్జున) ఒక ఇంటర్‌పోల్ అధికారి, తన ప్రియురాలు ప్రియ (సోనాల్ చౌహాన్)తో కలిసి దుబాయ్‌లో పని చేస్తూ ఉంటుంటాడు. అతడు వృత్తిలో ఉన్నప్పుడు.. ఒక సంఘటన విక్రమ్‌ని మానసికంగా కలవరపెడుతుంది. దీంతో ప్రియకు దూరంగా వచ్చేస్తాడు. అతను అను (గుల్ పనాగ్) నుండి ఒక ఫోన్ కాల్ అందుకుంటాడు. తన కుమార్తె అదితి జీవితం గురించి ఆందోళన చెందుతూ సహాయం కోరుతుంది. సమస్యను పరిష్కరించమని విక్రమ్‌ని కోరుతుంది. ఈ అను ఎవరు? ఆమె విక్రమ్ సహాయం ఎందుకు కోరింది? అను, అదితికి ముప్పు ఎవరు? సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే:
సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోస్తూ నాగార్జున తన పాత్ర లో బాగానే నటించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా మెప్పించాడు. సోనాల్ చౌహాన్ కూడా తన పాత్రలో మెప్పించింది. ఎప్పుడూ గ్లామర్ పాత్రల్లోనే కనిపించే సోనాల్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లో సత్తా చాటింది. కీలక పాత్రల్లో కనిపించిన గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తమ పాత్రలలో బాగా నటించారు. రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, జయ ప్రకాష్‌లతో సహా మిగిలిన తారాగణం పర్వాలేదనిపించారు.
విశ్లేషణ:
విభిన్నమైన పాత్రలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు నాగార్జున. ది ఘోస్ట్ సినిమాలో కూడా నాగార్జున మరోసారి తన సత్తాను చూపించాడు. విక్రమ్‌గా సినిమాను మొదటి నుండి చివరి వరకు తన భుజాలపై మోశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా బాగా కంపోజ్ చేశారు. స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది . సోనాల్ చౌహాన్ కేవలం గ్లామర్ ఎలిమెంట్కే పరిమితం కాకుండా ఆమె పాత్రకు మంచి స్కోప్ ఉంది. అనికా సురేంద్రన్, గుల్ పనాగ్, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి మిగతా నటీనటులు తమ వంతు పాత్రను చక్కగా చేసారు. యాక్షన్ పార్ట్బాగున్నా.. కావాల్సిన డ్రామా, కథ అంత గొప్పగా లేవు. ఎమోషనల్ యాంగిల్ కృత్రిమంగా కనిపిస్తుంది. ఘోస్ట్‌లో విలన్ పాత్ర చాలా బలహీనంగా ఉంది. సాలిడ్ విలన్ లేడని అనిపిస్తుంది.
సాంకేతిక అంశాలు:
మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ.. హాలీవుడ్ చిత్రాల తరహాలో ఉంది. సినిమాకు వీరిద్దరి పనితనం బాగా ప్లస్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఆఖరు అరగంట సినిమా బాగుంటుంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు విషయానికి వస్తే, అతను ది ఘోస్ట్‌తో కొంతవరకు విజయం సాధించాడు. పోరాట సన్నివేశాలను బాగా హ్యాండిల్ చేసినా.. ఎమోషన్ ను క్యారీ చేయలేకపోయాడు. అదే జరిగి ఉండి ఉంటే.. సినిమా ఇంకో స్థాయిలో ఉండేది.
ఫైనల్ గా: ఘోస్ట్ లో యాక్షన్ బాగుంది.. ఎమోషన్ తక్కువైంది
తెలుగు పోస్ట్ రేటింగ్: 2.5/5
Next Story