Sun Dec 22 2024 17:38:56 GMT+0000 (Coordinated Universal Time)
భోళా శంకర్ మూవీ రివ్యూ.. మెగా మెహర్ మిస్టేక్
తమిళంలో ఘనవిజయం సాధించిన వేదాళం చిత్రానికి 'భోళా శంకర్' రీమేక్ అనే విషయం తెలిసిందే
చిత్రం: భోళా శంకర్
తారాగణం: చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్, మురళీ శర్మ, హైపర్ ఆది, లోబో
దర్శకుడు: మెహర్ రమేష్
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
విడుదల తేదీ: 11 ఆగస్టు 2023
కథ: శంకర్ (చిరంజీవి) తన సోదరి మహాలక్ష్మి (కీర్తి సురేష్)తో కలకత్తాకు వస్తాడు. అక్కడ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తాడు. శంకర్ తన సోదరిని చదివించి ఆమె జీవితం బాగుండాలని అనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో లాయర్ లాస్య (తమన్నా)ని కలుస్తాడు. మహాలక్ష్మికి ఆమె సోదరుడు (సుశాంత్)తో నిశ్చితార్థం చేస్తాడు. తన చెల్లెలు సర్వస్వం అని అనుకునే శంకర్ మహిళల అక్రమ రవాణా కేసుతో సంబంధం ఉన్న కొంతమందిని హత్య చేస్తాడు. శంకర్ ఆ నేరస్తులను ఎందుకు చంపాడు? మాఫియా గ్యాంగ్‌తో శంకర్‌కి, అతని సోదరికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో తెలుస్తాయి.
విశ్లేషణ:
తమిళంలో ఘనవిజయం సాధించిన వేదాళం చిత్రానికి 'భోళా శంకర్' రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా ఓటీటీలలో లేదని చిత్ర బృందం చెప్పింది. అయితే యూట్యూబ్ లో లక్షణంగా అందుబాటులో ఉంది. హిందీ డబ్బింగ్ కూడా చూసేయొచ్చు. ఒక అన్న.. తన చెల్లెలే సర్వస్వం అని అనుకుంటూ ఉంటాడు.. తన చెల్లెలు కోసం ఏదైనా చేస్తాడు.. హీరో ఎంత సామాన్యుడైనా కూడా విలన్ ఎంత పవర్ ఫుల్ అయినా ఆఖరికి అంతం చేయడం గ్యారెంటీ. ఇది రొటీన్ రొట్ట స్టోరీనే.. కాదని చెప్పలేము. అయితే టేకింగ్, ఎంటర్టైన్మెంట్ తో సినిమాను ముందుకు తీసుకుని వెళ్లొచ్చని చాలా మంది దర్శకులు నిరూపించారు. కానీ ఈ సినిమాలో ఏది కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళకపోవడం దారుణం. ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేయడం మెగా ఫ్యాన్స్ కు కూడా చిరాకు తెప్పించిందని ట్విట్టర్ లో అంటున్నారు. ఆ విషయాలను పక్కన పెడితే.. ఈ చిత్రం వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది. కాబట్టి స్క్రిప్ట్ చాలా పాతది అయిపోతుంది. ఈ రీమేక్‌ని గొప్పగా మార్చడానికి, మంచి సంగీతం, ఆకర్షణీయమైన యాక్షన్ సన్నివేశాలు, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన గట్టి స్క్రీన్‌ప్లే అవసరం. భోళా శంకర్‌లో స్పష్టంగా కనిపించలేదు.
భోళా శంకర్‌ని పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించడంలో దర్శకుడు మెహర్ రమేష్ ఏ విధంగానూ సక్సెస్ కాలేదు. ఫస్ట్ హాఫ్ మామూలుగా మొదలై అదే ఫ్లోలో సాగుతుంది. వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ అస్సలు నవ్వు తెప్పించకపోగా.. చికాకు పెట్టిస్తుంది. తమన్నా, సుశాంత్‌లతో చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాలు పర్వాలేదు. ఇంటర్వెల్ ఎపిసోడ్ కొంతవరకు ప్రభావం చూపింది, అయితే ఇంటర్వెల్ తర్వాత సినిమా మరీ బోరింగ్ గా.. ఏ మాత్రం కొత్తగా అనిపించదు.
ఎవరెలా: చిరంజీవి తెరపై చాలా బాగా కనిపించారు. టైటిల్ రోల్లో అయన నటన బాగుంది. కీర్తి సురేష్ కూడా బాగానే చేసింది. తమన్నా భాటియా, సుశాంత్ ఇతర చాలా మంది ఆర్టిస్టులు పర్వాలేదనిపించారు. దర్శకుడు మెహర్ రమేష్ స్టైలిష్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఈసారి స్టైల్లో కూడా అతడు విఫలమయ్యాడు. తనకు ఇష్టమైన మెగా స్టార్‌కి కనీసం ఒక్క స్టైలిష్ సీన్ లో చూపించలేకపోయాడు. భోళా శంకర్ లో స్టైల్, కొత్తదనం రెండూ లేవు. సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తిగా నిరాశపరిచింది. ఇక సెకండాఫ్ కూడా అంతే..! విలన్లు, వారి సన్నివేశాలు ఎంగేజ్ చేయడంలో విఫలమయ్యాయి. విజువల్‌గా సినిమా రిచ్‌గా కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేయలేకపోయింది.
ప్లస్ పాయింట్లు:
చిరంజీవి
ఇంటర్వెల్
మైనస్ పాయింట్లు:
ఫస్ట్ హాఫ్
BGM
క్లైమాక్స్
కథ, స్క్రీన్ ప్లే
డైరెక్షన్
చిరంజీవి కెరీర్ లో మెగా మిస్టేక్ గా నిలిచిన సినిమా
రేటింగ్: 1.75/5
Next Story