Fri Dec 27 2024 00:02:00 GMT+0000 (Coordinated Universal Time)
సలార్ సినిమా రివ్యూ
ప్రశాంత్ నీల్ సినిమాను డీల్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుందని కేజీఎఫ్ ను
తెలుగు చిత్ర పరిశ్రమలో బాహుబలి.. కన్నడ చిత్రసీమ లో కేజీఎఫ్..! ఈ రెండు సినిమాలు ట్రేడ్ మార్క్ ని సృష్టించాయి. బాహుబలి సినిమాలోని హీరో.. కేజీఎఫ్ దర్శకుడు.. కలిసి ఒక సినిమా వస్తూ ఉందంటే సినీ అభిమానుల్లో ఏదో తెలియని ఆరాటం. అందుకు తగ్గట్టుగానే అంచనాలు. అందుకే 'సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్' ను ప్రకటించినప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడున్నర సంవత్సరాలు సినిమా కోసం ఎదురుచూశారు. సినీ అభిమానులు ఎదురుచూసినట్లుగానే అత్యంత గ్రాండ్ గా.. అద్భుతమైన ఎమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ:
ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి కర్త రాజ మన్నార్ (జగపతిబాబు). ఆ సామ్రాజ్యంలోఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరూ దొరగా వ్యవహరిస్తుంటారు. కర్త కుర్చీ కోసం కుతంత్రాలు మొదలవుతాయి. నేనుండగా నా కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)ని దొరగా చూడాలనేది తన కోరికగా చెబుతాడు రాజమన్నార్. కొన్నాళ్లు ఆయన తన సామ్రాజ్యాన్ని వదిలివెళ్తున్నానని చెబుతాడు.
దేవా(ప్రభాస్) టిన్సుకియాలో తన తల్లితో పాటు సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఆద్య (శృతి హాసన్) అనే అమ్మాయిని కొందరు చంపేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆద్య.. 'దేవా' సంరక్షణలో ఉంటుంది. ఆద్యను చంపడానికి వచ్చిన గ్యాంగ్ దేవాను చూసి ఎందుకు భయపడుతుంది. దేవాకు ఖాన్సార్ కు మధ్య సంబంధం ఏమిటి. రాజమన్నార్ దొర అయ్యాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!!
ఎలా ఉందంటే:
ప్రశాంత్ నీల్ సినిమాను డీల్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుందని కేజీఎఫ్ ను చూస్తే మనకు అర్థం అవుతుంది. చిన్న చిన్న సన్నివేశాలలో కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా చేయడం ప్రశాంత్ నీల్ స్పెషాలిటీ. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ ఈ సినిమా విషయంలో కూడా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా హీరోను తల్లి వెళ్ళమని చెప్పే సీన్.. స్నేహితుడి కోసం దేవా చేసే పనులలో కావాల్సిన హీరోయిజాన్ని ఇచ్చేస్తాడు. ఇక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ముందుకు వెళుతుంది. కొత్త ప్రపంచంలో మనం వెళ్లినట్లు అనిపిస్తుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి సాధారణ సన్నివేశాలను కూడా అద్భుతంగా ఉపయోగించాడు. సెకండాఫ్‌లో కథ, స్క్రీన్‌ప్లేపై మరింత దృష్టి పెట్టి ఉండాల్సింది. ముఖ్యంగా రవి బస్రూర్ కొన్ని సన్నివేశాలను అమాంతం పైకి ఎత్తేశాడు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ.. అన్బరివు స్టంట్స్ చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగా గొప్పగా ఉన్నాయి. అయితే ఎవరు ఏ గ్యాంగ్ లాంటి విషయాల్లో కొంచెం కన్ఫ్యూజన్ ప్రేక్షకుల్లో ఉంటుంది. హీరోయిజం, ఎలివేషన్ల కంటే ఈ సినిమాలో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ కథని నడిపించాడు. మంచి ఎలివేషన్లతో ప్రభాస్‌ని చాలా బాగా చూపించారు. ద్వితీయార్థంలో కాస్త గందరగోళంగా అనిపించినా, సగటు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా డ్రామా సాగుతుంది. అయితే చెప్పాల్సిన కథ ఇంకా మిగిలే ఉంది.. స్నేహితుడు బద్ధ శత్రువు ఎలా అయ్యాడు.. ఎందుకు అయ్యాడు లాంటి ఎన్నో విషయాలలో సస్పెన్స్ ప్రేక్షకుల మదిలో వెంటాడేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ఒక మంచి యాక్షన్ డ్రామా చూసినట్లు ఫీల్ అవుతారు. ప్రభాస్, పృథ్వీరాజ్ ల బాండింగ్ చాలా బాగా ఉంటుంది. హై-ఆక్టేన్ యాక్షన్-ప్యాక్డ్ సినిమాలను ఆస్వాదించే వాళ్లకు సినిమా నిజంగా ఫుల్ మీల్స్ లాంటిది. కాటమ్మ తల్లికి బలి ఇచ్చే సందర్భంలో వచ్చే పోరాట ఘట్టం సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ ఫైట్, ఇంటర్వెల్ సీన్స్ చాలా బాగున్నాయి.
అభిమానులు ప్రభాస్ ను పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో చూడాలని కోరుకున్నారు.. ప్రశాంత్ నీల్అభిమానులు కోరుకునే విధంగా ప్రభాస్‌ను చూపించాడు. అతని పాత్రకు మాటలు తక్కువ.. వయోలెన్స్ ఎక్కువ. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో, ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ను అందిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ మంచి నటనను ప్రదర్శించాడు. తెలుగులో డైలాగ్స్ కూడా పృథ్వీరాజ్ చాలా బాగా చెప్పారు. ఇక శృతి హాసన్ నిడివి తక్కువే అయినా మెప్పించింది. జగపతి బాబు, బాబీ సింహా, జాన్ విజయ్, శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ, ఝాన్సీ, ఈశ్వరీ రావు పర్వాలేదనిపించారు. మొదటి పార్ట్ లో శ్రియా రెడ్డి, ఈశ్వరీ రావుల క్యారెక్టర్లు ఎలివేట్ అయ్యాయి. రెండో పార్ట్ లో మిగిలిన వారి రోల్స్ కూడా బాగా పండే అవకాశం ఉంది.
ప్లస్ పాయింట్లు:
ప్రభాస్,
యాక్షన్ సన్నివేశాలు,
బ్యాగ్రౌండ్ మ్యూజిక్,
ఫస్ట్ హాఫ్
మైనస్:
సినిమా నిడివి
సెకండాఫ్ లో కన్ఫ్యూజన్
Next Story