Mon Dec 23 2024 00:53:50 GMT+0000 (Coordinated Universal Time)
ఖిలాడి రివ్యూ - హిట్టా ? ఫట్టా ?
క్రాక్ తర్వాత రవితేజ నటించిన ఖిలాడి సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. ఎన్నో ఆశలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ.
సినిమా - ఖిలాడి
నటీనటులు - రవితేజ, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి, అర్జున్, అనసూయ, మురళీ శర్మ, ఉన్ని ముకుందన్, ముఖేష్ రుషి, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
దర్శకుడు - రమేష్ వర్మ
నిర్మాత కోనేరు సత్యనారాయణ
విడుదల - 11.02.2022
ఈ ఏడాది సంక్రాంతి బరిలో గానీ.. సంక్రాంతి తర్వాత గానీ పెద్దగా సినిమాలు రాలేదు. బంగార్రాజు సినిమా ఒక్కటే సంక్రాంతి సినిమాగా నిలిచింది. తర్వాత చిన్న చిన్న సినిమాలు విడుదలైనా.. అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. క్రాక్ తర్వాత రవితేజ నటించిన ఖిలాడి సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. ఇక అగ్రతారల సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. గతేడాది కూడా రవితేజ క్రాక్.. తోనే పెద్ద సినిమాల విడుదల ఆరంభమయింది. ఇక ఖిలాడి విషయానికొస్తే.. ఎన్నో ఆశలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. రాక్షసుడు వంటి క్రైం థ్రిల్లర్ కు దర్శకత్వం వహించిన రమేష్ వర్మ.. ఖిలాడి సినిమాను తెరకెక్కించారు. ఇక కథలోకి వెళ్లిపోదాం..
కథేంటంటే
పూజా (మీనాక్షి చౌదరి) ఇంటెలిజెన్స్ ఐజీ జయరామ్ (సచిన్ ఖేడ్కర్) కుమార్తె. తెలివైన అమ్మాయి. క్రిమినల్ సైకాలజీ చదువుతుంటుంది. చదువులో భాగంగా ఓ థీసెస్ కోసం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మోహన్ గాంధీ (రవితేజ)ని కలుస్తుంది. జైలులో ఎందుకున్నారు ? అని అడగడంతో హోం మంత్రి గురుసింగం (ముఖేష్ రుషి) రూ.10 వేల కోట్లకు సంబంధించిన లావాదేవీల వల్ల తానెలా సమస్యల్లో చిక్కుకున్నాడు ? కుటుంబాన్ని పోగొట్టుకుని చేయని నేరానికి జైలుకు ఎందుకు రావాల్సి వచ్చింది ? అన్న అంశాలను క్రియేట్ చేసి, ఓ కట్టుకథ చెప్తాడు. మెహన్ గాంధీ చెప్పిందంతా నిజమని నమ్మిన పూజా అతనికి సహాయం చేయాలని భావిస్తుంది. తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ.. బెయిల్ ఇప్పిస్తుంది. మోహన్ జైలు నుంచి బయటికి వచ్చాక పూజాకు అసలు నిజం తెలుస్తుంది. అతనొక అంతర్జాతీయ క్రిమినల్ అని, హోంమంత్రి డబ్బు కొట్టేసేందుకే ఇటలీ నుంచి భారత్ కు వచ్చి.. తనను చాలా తెలివిగా వాడుకున్నాడని గ్రహిస్తుంది.
ఇంతకీ ఆ డబ్బు ఎవరిది ? దానిని ఎక్కడ దాచారు ? ఆ డబ్బుతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని ఆశపడిన గురుసింగం కోరిక తీరిందా ? మోహన్ గాంధీని డబ్బుతో పాటు పట్టుకోవాలన్న సీబీఐ అధికారి అర్జున్ భరద్వాజ్ (అర్జున్) లక్ష్యం నెరవేరిందా ? తదితర అంశాలన్నీ తెలియాలంటే.. తెరపై సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది ?
రూ.10 వేల కోట్ల చుట్టూ తిరిగే కథను.. విభన్నమైన యాక్షన్ థ్రిల్లర్ గా తెరపై చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు రమేష్ వర్మ. రూ.10 వేల కోట్ల, తెలివైన దొంగ, ఆ డబ్బుకోసమే కాచుకుని కూర్చున్న రెండు ముఠాలు. డబ్బుతోపాటు దొంగను పట్టుకోవాలని చూస్తున్న సీబీఐ అధికారి.. ఈ అంశాలన్నీ ఓ థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన అంశాలే. కానీ.. దర్శకుడు కథను మలుపు తిప్పడంలో తడబడ్డాడని తెలుస్తుంది. పూజాకు మోహన్ గాంధీ కథ చెప్పడం ప్రారంభించినపుడు ఉన్న థ్రిల్లర్ సినిమా కాస్తా.. రొటీన్ ఫ్యామిలీ డ్రామాలా మారిపోతుంది. విరామానికి ముందు మోహన్ గాంధీ పాత్ర అసలు కథను రివీల్ చేయడం, ఈ సందర్భంగా అర్జున్ - గాంధీ పాత్రల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. ఇక సెకండాఫ్ కాస్త పేలవంగా అనిపిస్తుంది. కథ చాలా వరకూ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా ఉండటంతో క్లైమాక్స్ విసుగు పుట్టిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
మోహన్ గాంధీ పాత్రలో రవితేజ రెండు షేడ్స్ ను అద్భుతంగా కనబరిచారు. సెకండాఫ్ లో ఆయన నటన తారా స్థాయిలో ఉంటుంది. ఇక డింపుల్ హయతి.. అభినయంతో కంటే తన అందచందాలతో ప్రేక్షకుల్ని.. ముఖ్యంగా కుర్రకారుని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. మీనాక్షి చౌదరి కూడా పాటల్లో తన అందాలను చూపించింది. అనసూయ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ పాత్రల్లోనూ రెండు షేడ్స్ కనిపిస్తాయి. ఏదేమైనా ఖిలాడి స్క్రిప్ట్ విషయంలో రమేష్ వర్మ మరికాస్త కసరత్తు చేస్తే.. ఖిలాడి మంచి యాక్షన్ థ్రిల్లర్ గా నిలిచేది.
ప్లస్ పాయింట్స్
రవితేజ నటన
డింపుల్, మీనాక్షిల అందచందాలు
యాక్షన్ సీక్వెన్స్
దేవిశ్రీ పాటలు
నెగిటివ్ పాయింట్స్
ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగే సినిమా
ల్యాగ్ సన్నివేశాలు
నిరాశపరిచే క్లైమాక్స్
చివరిగా.. అక్కడక్కడా యాక్షన్ సీన్లతో, పాటలతో ఫర్వాలేదనిపించిన "ఖిలాడి".
News Summary - Ravi Teja's Khiladi Movie Review
Next Story