Mon Dec 23 2024 19:08:08 GMT+0000 (Coordinated Universal Time)
విజువల్ వండర్.. ఎమోషనల్ క్లాసిక్..RRR రివ్యూ
అప్పట్లో నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలో.. ఓ గిరిజన ప్రాంతంలో కథ మొదలవుతుంది. నిజాంను కలిసేందుకు వచ్చిన..
RRR.. అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. నాలుగు సార్లు వాయిదా పడుతూ వచ్చిన RRR ఎట్టకేలకు ఈ రోజు విడుదలైంది. ప్రీమియర్ షో లు, బెనిఫిట్ షో లలో తెరమీద తమ అభిమాన హీరోలను చూసిన అభిమానులు పూనకంతో ఊగిపోతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి.. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో.. ఎన్నో ఆశలతో తెరకెక్కించిన సినిమా ఇది RRR. కల్పిత కథే అయినా.. ఈ సినిమా తన కలలకు ప్రతిరూపమని, కొమురం భీం- అల్లూరి సీతారామరాజు స్నేహితులైతే ఎలా ఉంటుందో చూడాలనే ఈ సినిమా తీసినట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు జక్కన్న. RRR కోసం తాకర్, చరణ్ లు ఎంత కష్టపడ్డారో.. సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో ప్రతీ సీన్ హైలెట్ అంటున్నారు అభిమానులు.
RRR థియేటర్ల వద్ద అభిమానుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. హీరోల కటౌట్లకు అభిషేకాలు, గజమాలలు, బాణసంచా పేల్చడం వంటి వాటితో పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇంతకు మించిన పెద్ద పండుగ తమకు ఇంకొకటి ఉండదంటున్నారు ఇరు హీరోల అభిమానులు. ఇంతకీ RRR సినిమా ఎలా ఉంది? జక్కన్న ప్రయత్నం ఫలించిందా ? ఇప్పుడు చూద్దాం.
కథలోకి వెళ్తే..
అప్పట్లో నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలో.. ఓ గిరిజన ప్రాంతంలో కథ మొదలవుతుంది. నిజాంను కలిసేందుకు వచ్చిన బ్రిటీష్ దొర.. గిరిజన ప్రాంతానికి చెందిన గోండు పిల్లను బలవంతంగా తీసుకెళ్తాడు. ఆ గోండు జాతికి కాపరి కొమురం భీం (ఎన్టీఆర్). తమ గూడెంకు చెందిన పిల్లను దొర ఎత్తుకెళ్లిన విషయం తెలుసుకున్న కొమురం భీం.. ఆ పిల్ల కోసం దొరల ఏలుబడిలో ఉన్న ఢిల్లీలో అడుగు పెడతాడు. అక్కడ తెల్లదొరలతో తలపడి విధ్వంసం సృష్టించి ఆ పిల్లను రక్షిస్తాడు. దాంతో కొమురం భీం ను పట్టుకోవాలని సీతారామరాజు (రామ్ చరణ్)ను ఆదేశిస్తుంది బ్రిటీష్ ప్రభుత్వం. కొమురం భీం ను పట్టుకునేందుకు వెళ్లిన సీతారామరాజు.. అతనిలోని నిజాయితీ, మంచితనాన్ని మెచ్చి.. భీమ్ కు సహాయం చేస్తాడు.
కొమురం భీం ను పట్టుకోకపోగా.. తమకు ఎదురు తిరిగినందుకు బ్రిటీష్ ప్రభుత్వం రామరాజుకు మరణ శిక్ష విధిస్తుంది. ఇవేవీ తెలియని భీమ్.. ఓ రోజు అనుకోకుండా సీత(అలియా భట్)ను కలుస్తాడు. ఆమె పెట్టిన సద్ది తిని ఆకలి తీర్చుకున్న భీమ్.. సీత కష్టాన్ని తెలుసుకుని కరిగిపోతాడు. మనువాడిన భర్త ఉరికంభం ఎక్కబోతున్నాడని తెలిసి సీత కంటతడి పెట్టుకుంటుంది. సీత ద్వారా రామరాజు గురించి తెలుసుకున్న భీమ్.. "నీ భర్త రాముడు లాంటి వాడు, రాముడికి కష్టం వస్తే వెళ్లాల్సింది సీతమ్మ కాదు. ఈ లక్ష్మణుడు" అంటూ కొమురం భీం మళ్లీ బ్రిటీష్ పై అటాక్ చేసి రామరాజును జైలు నుంచి తప్పిస్తాడు. అలా కలిసిన రామ్-భీమ్ ల స్నేహం చివరకు ఏ మలుపు తీసుకుంది ? బ్రిటీష్ ప్రభుత్వంపై భీమ్-రామరాజు కలిసి ఏ విధంగా పోరాడారు ? చూడాలంటే.. థియేటర్లకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
RRRలో నటీనటుల విషయానికొస్తే.. సినిమా మొత్తానికి తారక్-చరణ్ ల నటనే హైలెట్ గా నిలిచిందని చెప్పుకోవాలి. రామ్-భీమ్ లుగా వారిద్దరి నటన ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకుంటుంది. ఆ రెండు పాత్రల మధ్య వచ్చే ఎమోషన్స్ గుండె బరువెక్కేలా ఉంటాయి. వారిద్దరి ఆలోచనలు, దారులు వేరైనా.. ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని రాజమౌళి చాలా గొప్పగా చూపించారు. ఇంటర్వెల్ కి ముందు ఇద్దరి మధ్య భీకరమైన పోరు ఉంటుంది. ఒకరిపై ఒకరు సింహాల్లా దాడి చేసుకున్నా.. రెండు పాత్రల మధ్య ఎమోషన్ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఫైట్ వచ్చినపుడు ప్రేక్షకుడు కళ్లు చెమ్మగిల్లుతాయి.
ఇతర నటీనటుల విషయానికొస్తే.. సీత పాత్రలో అలియా భట్ నటించింది అనే కంటే.. జీవించింది అంటే బావుంటుంది. ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియా.. ఇతర కీలక నటులు తమ పాత్రలకు న్యాయం చేసేలా.. అద్భుత నటనను కనబరిచారు. ఫస్టాఫ్ లో తారక్-చరణ్ ల ఇంట్రడక్షన్, ఫైట్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వచ్చాయి. అలాగే రామ్-సీతల మధ్య కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరింది. సినిమా క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ ఇలా ఉండొచ్చు అని.. ఎవరి ఊహకు అందని రీతిలో డిజైన్ చేశాడు మన జక్కన్న.
చివరిగా.. RRR విజువల్ వండర్. ఆ వండర్ ను తెరపై చూస్తేనే అసలు సిసలైన కిక్ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ మాస్ హిట్ అని అనుకున్నా.. మున్ముందు ఒక ఎమోషనల్ క్లాసిక్ గా RRR చరిత్రలో నిలిచిపోతుంది.
Next Story