సమ్మోహనం మూవీ రివ్యూ
బ్యానర్: శ్రీదేవి మూవీస్ బ్యానర్
నటీనటులు: సుధీర్ బాబు, అదితి రావు, హరితేజ, నందు, రాహుల్ రామకృష్ణ, నరేష్, తనికెళ్ళ భరణి,
మ్యూజిక్ డైరెక్టర్: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: ఫై.జి. విందా
ప్రొడ్యూసర్: శివలెంక కృష్ణ ప్రసాద్
దర్శకత్వం: ఇంద్రగంటి మోహన కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ అండతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మహేష్ బాబు బావ సుధీర్ బాబు తనకంటూ ఒక ఇమేజ్ ని సృష్టించుకుంటున్నాడు. గతంలో ప్రేమ కథా చిత్రంతో సూపర్ హిట్ కొట్టినప్పటికీ.. ఆ విజయంలో సుధీర్ బాబు పేరు అంతగా వినిపించలేదు. ప్రేమ కథా చిత్రం హిట్ క్రెడిట్ మొత్తం దర్శకుడు మారుతీ తన ఖాతాలోకి వచ్చేలా చేసుకున్నాడు. ఇక భలే మంచి రోజు, శమంతకమణి సినిమాలతో సుధీర్ బాబు తన ఐడెంటినీ నిలబెట్టుకున్నాడు. బాలీవుడ్ లోనూ భాగీ సినిమాతో విలన్ గా సత్తా చాటిన సుధీర్ బాబు భారీ గ్యాప్ తో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో బాలీవుడ్ నటి అదితి రావు తో కలిసి సమ్మోహనం అనే ప్రేమ కథా చిత్రంలో నటించాడు. మంచి పబ్లిసిటీ హంగులతో సమ్మోహనం చిత్రం ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు ఇంద్రగంటి కి ప్రేమ కథా చిత్రాలకు, క్లాస్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా.. మంచి కథ, కథనంతో... చిత్రాలను తెరక్కేకించే దర్శకుడిగా పేరుంది. సమ్మోహనం... అనే అచ్చతెలుగు టైటిల్ తో... ఈ చిత్రాన్ని కూడా అదితి రావు - సుధీర్ బాబు ల ప్రేమ కథగానే మలిచినట్లుగా సమ్మోహనం ట్రైలర్ లో చూస్తుంటేనే తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో అదితి అందాలు అదనపు ఆకర్షణలుగా ట్రైలర్, ప్రోమోస్ చూస్తుంటే తెలుస్తుంది. మరి సుధీర్ బాబు.. ఇంద్రగంటి మోహనకృష్ణ, అదితి రావు తో కలిసి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకున్నాడో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలిలో సినిమాలంటే అస్సలు ఇష్టం ఉండని ఒక కుర్రాడు... సినిమాలంటే పడి చచ్చిపోయే ఆ కుర్రాడి తండ్రి... వెరసి ఆఖరికి ఆ కుర్రాడి లైఫ్ లో ఒక స్టార్ హీరోయిన్ రావడం అనే సింపుల్ కథతో తెరకెక్కిందే సమ్మోహనం కథ. కథలోకి వెళితే... సినిమాలంటే అస్సలు ఇష్టం ఉండదు విజయ్ కుమార్ (సుధీర్ బాబు)కి. సినిమావాళ్ళంటే సినిమాల్లోనే కాదు.. బయట కూడా నటిస్తారనే ఊహల్లో ఉంటాడు విజయ్. కానీ విజయ్ తండ్రి శర్వాకి (నరేష్) మాత్రం సినిమాలంటే పిచ్చ ఇష్టం. కానీ చేస్తున్న ఉద్యోగం వదిలి సినిమాల్లోకి వెళ్లలేని పరిస్థితి. అందుకే ఉద్యోగానికి రిటైర్ అయ్యాక సినిమాల్లోకి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. తన ఇంట్లో ఒక పోర్షన్ ని సినిమా వాళ్ళకి అద్దెకివ్వవడమే కాదు.... వారు తెరకెక్కించే సినిమాలో ఒక పాత్ర ఇవ్వాలనే కండిషన్ కూడా పెడతాడు. ఇక ఆ సినిమాలో నటించే హీరోయిన్ సమీరా(అదితి రావు) కి తెలుగు రాకపోవడంతో.. శర్వా కొడుకు విజయ్ ని తెలుగు నేర్పించమని అడుగుతుంది.. అయితే విజయ్.. సమీరాకి తెలుగు నేర్పిస్తూ ఆమెతో ప్రేమలో పడతాడు. ఇక సమీరా కి విజయ్ అంటే ఇష్టమే. కానీ ఆమె తన ప్రేమని బయటపెట్టే లోపలే విజయ్, సమీరా ని ప్రేమిస్తున్నాని చెప్పడంతో... అనుకోకుండా సమీరా, విజయ్ ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. అసలు సమీరా కూడా విజయ్ ని ప్రేమిస్తుంది కదా. అలాంటప్పుడు విజయ్ ప్రేమను రిజెక్ట్ ఎందుకు చేస్తుంది? ప్రేమలో విఫలమైన విజయ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అసలు సమీరా, విజయ్ ని పెళ్లి చేసుకుంటుందా? అనేది సమ్మోహనం మిగతా కథ.
నటీనటుల నటన:
సుధీర్ బాబు క్లాసీ లుక్ తో అప్పర్ మిడిల్ క్లాస్ కుర్రాడిలా విజయ్ కుమార్ పాత్రలో అదరగొట్టాడు. సుధీర్ బాబు లుక్స్ పరం గానూ మెరుగ్గా కనిపించాడు. సినిమాలంటే ఇష్టం లేని కుర్రాడి పాత్రలో సుధీర్ చాలా బాగా నటించాడు. హీరోయిన్ కి తెలుగు నేర్పిస్తూ ప్రేమలో పడడం... తన ప్రేమను తెలియజేస్తే.. ఆమె రిజెక్ట్ చేసినప్పుడు అతను పడే బాధ ఇలా మంచి ఎక్స్ ప్రెషన్స్ తో సుధీర్ బాబు ఆకట్టుకున్నాడు. సినెమాలంటే నటన... అందులో నటించేవారు కూడా నిజ జీవితంలోను నటిస్తారే అపోహలో కొట్టుకుపోయే విజయ్ కుమార్ పాత్రలో సుధీర్ నటన అద్భుతం. సుధీర్ బాబు గత సినిమాల్లో నటన కన్నా.. ఈ సినిమా లో నటన పరంగా బాగా చేసాడు. ఇక అదితి రావు రియల్ లైఫ్ కేరెక్టర్ నే ఈ సినిమా లో చేసింది. అదితి సమ్మోహనంలో హీరోయిన్ పాత్రలో అద్భుతంగా అనిపించింది. గ్లామర్ కి గ్లామర్, నటనకు నటన అన్నిటిలో అదితి ఆకట్టుకుంది. ఇక ముఖ్యంగా అదితి మరో విధంగానూ మెప్పించింది. అదితి ఈ సినిమాలో తన డబ్బింగ్ తానే చెప్పుకుంది. ఇక సినిమాలో అదితి వాయిస్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ తో పాటు ప్రాముఖ్యత కలిగిన పాత్ర సీనియర్ నరేష్ ది. ఆర్టిస్ట్ కావాలనుకుని కాలేకపోయి.. చివరకు ఉద్యోగం నుండి రిటైర్డ్ అయిన తర్వాత నటుడిగా రాణించాలని కలలు కనే వ్యక్తి. అవకాశాల కోసం ఎదురుచూడటం.. దాని వల్ల సందర్భానుసారం వచ్చే కామెడీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక బిగ్ బాస్ ఫెమ్ హరితేజ కూడా హీరోయిన్ ఫ్రెండ్ గా ఆకట్టుకుంది. నందు నటన కూడా బాగుంది. అలాగే తనికెళ్ళ భరణి, రాహుల్ రామకృష్ణ మిగతా నటీనటులు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
సింగిల్ లైన్ స్టోరీ తో కథ, కథనాన్ని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అందరికి అర్ధమయ్యేలా సమ్మోహనంగా అద్భుతంగా తీర్చిదిద్దాడు. సినిమాలలో నటించే నటీనటుల మీద ప్రేక్షకులు ఎలాంటి అభిప్రాయాలతో ఉంటారో... అసలు నటీనటులను వారు ఏ విధంగా చూస్తారో అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఇంద్రగంటి ఈ సినిమాలో చూపించాడు. తాను రాసుకున్న పాత్రలతో సినిమాలో డైలాగ్స్ ని అద్భుతంగా పండించాడు. అలాగే నటీనటులను కథకు తగ్గట్టుగా మలుచుకుని వారి నుండి నటనను రాబట్టాడు ఇంద్రగంటి. సినిమాలంటే ఇంట్రెస్ట్ లేని మామూలు సగటు కుర్రాడి జీవితంలోకి సినిమాలే ప్రాణంగా ఉండే స్టార్ హీరోయిన్ అడుగుపెడితే.... వారిమధ్య కెమిస్ట్రీ, ఫ్రెండ్షిప్ లాంటివి ఎలా వుంటాయో.. అనేది క్లిన్ గా, నీట్ గా చూపెట్టాడు. డైలాగ్ అన్ని సూపర్ గా వున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కామెడీని, ప్రేమను చూపించిన ఇంద్రగంటి సెకండ్ హాఫ్ ని ఎమోషనల్ గా కాస్త సాగదీతగా.. అంటే సరదా సన్నివేశాలు, ఆకట్టుకునే కథనంతో ఫస్టాఫ్ ఎలా అయిపోయిందో కూడా ప్రేక్షకుడికి తెలీదు. సుధీర్‌బాబు, అదితి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం చాలా బాగుంది. ముఖ్యంగా సినిమా తొలి భాగంలో వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఫస్టాఫ్‌ను చాలా కామెడీగా తీర్చిదిద్దిన దర్శకుడు... సెకండ్ హాఫ్ ని మాత్రం కాస్త సాగదీశాడనిపిస్తుంది. కానీ సెంకడాఫ్‌లో కూడా సున్నితమైన భావోద్వేగాలు ప్రేక్షకుడి చేత కంటతడి పెట్టిస్తాయి. ఇక సినిమాలో మెయిన్ హైలెట్ నరేష్ పాత్ర. సీనియర్ నరేష్ పాత్రని కామెడీతో ముడిపెట్టి ఇంద్రగంటి సక్సెస్ అయ్యాడు. అలాగే ఇంద్రగంటి డైలాగ్స్ కూడా మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.
సాంకేతిక వర్గం పనితీరు:
సమ్మోహనం సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్. వివేక్ సాగర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎమోషనల్ గా, రొమాంటిక్ గా బాగా ఆకట్టుకుంది. ఇక పాటలు కూడా తీసేటట్టుగా లేవు. మ్యూజిక్ కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇంకా టెక్నికల్ టీంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ పి.జి.విందా పనితనం గురించి. ప్రతి ఫ్రేమ్‌ను చాలా బాగా రిచ్ గా చూపించారు. ముఖ్యంగా సుధీర్‌బాబు, అదితిరావు మధ్య సన్నివేశాలు అద్భుతం. పాటల లొకేషన్స్ ని అన్నింటినిలో కెమెరా పనితాం అద్భుతః అన్నట్టుగా ఉంది. అలాగే మరో హైలెట్ ఆర్ట్ వర్క్. సినిమాలో ఆర్ట్ పనితనం చాలా బాగుంది. ఇక మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్, ఇంద్రగంటి మోహనకృష్ణ డైలాగుల తో పాటుగా నిర్మాణ విలువలు కూడా కథానుసారంగా రిచ్ గా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్: సుధీర్ బాబు, కథ, అదితి రావు, నరేష్, కామెడీ, దర్శకత్వం, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ స్లో నేరేషన్, కథనం, బిసి సెంటర్స్ కి ఎక్కదు
రేటింగ్: 3.0/5