Fri Nov 22 2024 23:56:29 GMT+0000 (Coordinated Universal Time)
సర్కారు వారి పాట రివ్యూ: మళ్లీ మెసేజీనా మహేషా..!
వింటేజ్ మహేష్ బాబును చూడాలని థియేటర్ కు వచ్చిన వారిని.. ఫస్ట్ హాఫ్ లో ఓ మోస్తరు ఎంటర్టైన్ చేస్తాడు దర్శకుడు పరశురామ్.
సినిమా - సర్కారు వారి పాట
నటీనటులు - మహేష్ బాబు, కీర్తి సురేష్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, వెన్నెల కిషోర్, నదియా, నాగబాబు తదితరులు
కథ : పరుశరామ్
నిర్మాతలు : నవీన్ ఎర్నేనీ, వై రవి శంకర్, రామ్ అచంట, గోపిచంద్ అచంట
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేశ్
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్ తమన్
బడ్జెట్ : రూ.60 కోట్లు
రన్నింగ్ టైమ్ : 160 నిమిషాలు
ప్రొడక్షన్ హౌసెస్ : మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్, జీ మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్
రిలీజ్ డేట్ : 12 మే 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు- కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మహేష్ తీసిన గత సినిమాలలో ఎక్కువగా మెసేజీలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాలో మాత్రం మెసేజీలు అవసరం లేదు.. వింటేజ్ మహేష్ బాబు కావాలని అభిమానులు కోరుకున్నారు. యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం అనగానే అభిమానుల్లో ఊపు వచ్చింది.. ఇక ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించడం.. డైలాగ్స్ కూడా మాంచి కిక్ ఇవ్వడంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
కథ:
మహేష్(హీరో) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ఉంటాడు. బ్యాంకుల వాళ్ల ఒత్తిడులను భరించలేక మహేష్ తల్లిదండ్రులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటారు. అనాధ అయిన మహేష్ ను లెక్కల మాస్టర్(తనికెళ్ళ భరణి) ఒక హాస్టల్ లో చేర్పిస్తాడు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత మహేష్ అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఎగ్గొడితే తాట తీస్తుంటాడు. ఇలాంటి సమయంలో కళావతి(కీర్తి సురేష్) మహేష్ జీవితంలోకి వస్తుంది. అలా వచ్చిన ఆమె మహేష్ జీవితాన్ని ఏమి చేసింది.. మహేష్ అమెరికాను వదిలి ఇండియాకు రావడానికి కారణమేమిటన్నది.. వెండితెర మీద చూడాలి.
ఎలా ఉంది:
వింటేజ్ మహేష్ బాబును చూడాలని థియేటర్ కు వచ్చిన వారిని.. ఫస్ట్ హాఫ్ లో ఓ మోస్తరు ఎంటర్టైన్ చేస్తాడు దర్శకుడు పరశురామ్. హీరో-హీరోయిన్ ట్రాక్ చాలా బాగుంటుంది. వెన్నెల కిశోర్ చెబుతున్నా నమ్మకుండా ఉండే మహేష్ బాబును చూసి మనం నవ్వుకోవడం పక్కా..! అయితే మెసేజీ ఇవ్వట్లేదు అని చెప్పిన చిత్ర యూనిట్ సెకండ్ హాఫ్ మొత్తం ఓ పెద్ద మెసేజీని చూపించడం మొదలుపెడుతుంది. ఇక విలన్ ను మార్చాలని హీరో చేసే ప్రయత్నాలు కూడా ఎక్కడో చూసినట్లే అనిపిస్తాయి. పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వకపోవచ్చు. కొన్ని కొన్ని సన్నివేశాలు అభిమానులను కూడా నిరాశకు గురిచేస్తాయి. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అనిపించినా.. కొన్ని చోట్ల అవసరమా అనేలా కూడా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, రిచ్ నెస్ విషయంలో నిర్మాతలు ఏ మాత్రం తగ్గలేదు. కానీ మళ్లీ బ్యాంకులకు బడా బాబులు డబ్బులు ఎగ్గొట్టడాలు.. మనుషుల్లో చైతన్యం తెప్పించడాలు వంటివి స్క్రీన్ పై జరుగుతూ ఉంటే మాత్రం మళ్లీ మెసేజీనా మహేషా అని మనకు అనిపిస్తుంది.
ఎవరెలా చేశారు:
మహేష్ బాబు స్క్రీన్ మీద ఉన్నాడంటే అలా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అమెరికాలో హీరో హీరోయిన్స్ మధ్యన జరిగే సీన్స్, విలన్ తో ఫేస్-ఫేస్ లో కొన్ని సార్లు పోకిరి మహేష్ బాబును మనం చూడవచ్చు. హీరోయిన్ కీర్తి సురేష్ యాక్టింగ్ కూడా బాగా చేసింది. వెన్నెల కిషోర్, నదియా, సుబ్బరాజు, సముద్రఖని.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. మ్యూజిక్ ఇప్పటికే హిట్ అవ్వడం.. విజువల్స్ కూడా బాగుండడం సినిమాకు ప్లస్ అయింది.
ప్లస్ పాయింట్స్
+ మహేష్ బాబు
+ ఫస్ట్ హాఫ్ లో హీరో-హీరోయిన్ సీన్స్
+ వెన్నెల కిశోర్
+ కళావతి, మ.. మ.. మహేష్ సాంగ్స్
+ ఫైట్స్
మైనస్ పాయింట్స్
- హై మూమెంట్స్, ఎలివేటేడ్ సీన్లు ఎక్కువగా లేకపోవడం
- సెకండ్ హాఫ్
- మళ్లీ మెసేజీ సినిమాలా అనిపించడం
- సినిమా నిడివి
చివరిగా- సగం వింటేజ్ మహేష్ బాబు.. మరో సగం మెసేజీ
Next Story