టాక్సీవాలా మూవీ రివ్యూ
బ్యానర్: గీత ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్
నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్, రవి ప్రకాష్, ఉత్తేజ్, చమ్మక్ చంద్ర, యమునా, మధునందన్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
మ్యూజిక్ డైరెక్టర్: జాక్స్ బెజోయ్
ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్
ప్రొడ్యూసర్స్: ఎస్.కే.ఎన్
దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యాన్
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' లో ఏ క్లాస్ కుర్రాడిగా.. కాస్త పొగరుగా నటించిన విజయ్ దేవరకొండ తర్వాత 'పెళ్లి చూపులు' సినిమాలో సోలో హీరోగా ఇన్నోసెంట్ గా పక్కింటి కుర్రాడిలా నటించాడు. విజయ్ దేవరకొండ భాష, యాస, స్టయిల్ అన్ని యూత్ కి తొందరగా కనెక్ట్ అయ్యే విధంగా ఉండడమే అతనికున్న మెయిన్ ప్లస్ పాయింట్. ఇక తర్వాత ఒక సినిమా ఫ్లాప్ తర్వాత 'అర్జున్ రెడ్డి' అనే బోల్డ్ సినిమాతో నేరుగా టాప్ చైర్ ఎక్కేసాడు. ఆ దెబ్బతో విజయ్ దేవరకొండకి స్టార్ హీరో తో సమానమైన అభిమానం గణం రౌడీస్ బయలు దేరారు. ఇక ఆ తర్వాత 'మహానటి' లో ప్రొటోగ్రాఫర్ కేరెక్టర్.. ఆ తర్వాత 'గీత గోవిందం' తో మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ దెబ్బతో విజయ్ దేవరకొండ మీదున్న అంచనాలు స్టార్ హీరో రేంజ్ అంతగా మరింత పెరిగాయి. ఒక జాబ్ చేసుకునే కుర్రాడు భార్య అంటే ఇలానే ఉండాలని... అన్ని మంచి లక్షణాలతో అమ్మాయిని వెతుకుతూ.. అనుకోకుండా తనకు కావాల్సిన అమ్మాయి చేతికి చిక్కి పడిన కష్టాలు... విజయ్ కామెడీ టైమింగ్, ఇన్నోసెంట్ ఇలా అన్ని 'గీత గోవిందం' లో అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ తర్వాత తమిళ డెబ్యూ 'నోటా' తో పొలిటికల్ బ్యాగ్డ్రాప్ సినిమాతో వచ్చిన విజయ్ ని ప్రేక్షకులు మెచ్చలేదు. విజయ్ ని ఎక్కువగా రఫ్ స్టూడెంట్ గా, లవర్ బాయ్ గానే చూడాలనుకుంటున్నారు. అయితే 'గీత గోవిందం 'సినిమా కన్నా ముందే విజయ్ దేవరకొండ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టు 'టాక్సీవాలా' లో నటించాడు. అయితే ఆ సినిమాకు కొన్ని సమస్యలు తలెత్తడంతో.. వాటిని అధిగమించి సినిమా విడుదల చేద్దామనుకున్న టైంలో ఆ సినిమా పైరసీ అవడం.. తర్వాత ఆ లింక్స్ తొలిగించడం వెంటవెంటనే జరిగాయి. అయితే ఈ సినిమాని ఎలాగైనా థియేటర్స్ లోకి తెచ్చి ప్రేక్షకులను మెప్పించాలని చేసిన ప్రమోషన్స్ కానివ్వండి... విజయ్ దేవరకొండ మీదున్న అంచనాలు కానివ్వండి... ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. సైన్స్ ఫిక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా విజయ్ దేవరకొండ కెరియర్లో తొలిసారి ఓ డిఫరెంట్ జానర్ మూవీ చేసాడు. మరి మొదటిసారిగా ట్రై చేసిన ఈ థ్రిల్లర్ 'టాక్సీవాలా' ఈ రోజు శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి కెరీర్ లో మంచి హిట్స్ కొట్టి ఉన్న విజయ్ దేవరకొండ... ఈ 'టాక్సీవాలా'తో ఆ హిట్ పరంపర నిలబెట్టుకుంటాడో లేదో అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
మంచి జాబ్ కోసం వెతికి అలసిపోయిన శివ (విజయ్) చివరికి ఒక కారు కొనుక్కొని క్యాబ్ డ్రైవర్ కావాలనుకుంటాడు. అందుకోసం సజ్జు దగ్గర కారును కొనుగోలు చేస్తాడు. కారును కొని క్యాబ్ డ్రైవర్ అవుతాడు. తొలి పరిచయంలో డాక్టర్ అనూష (ప్రియాంక జువర్కర్), శివలు ప్రేమలో పడతారు. ఇక క్యాబ్ డ్రైవర్ గా మారిన శివ తాను కొన్న కారులో దెయ్యం ఉందని గమనిస్తాడు. ఇక ఆ దెయ్యం ఆ కారులో ప్రయాణించే ప్రయాణికులపై రివేంజ్ తీసుకుంటుంది. దెయ్యానికి భయపడిన శివ ఆ కారుని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటాడు. కానీ ఆ కారు శివాని వదిలి పోదు. ఆ క్రమంలోనే శివ స్నేహితుల సహాయంతో కారులో ఉన్న దెయ్యాన్ని కనిపెట్టడానికి రెడీ అవుతారు. మరి నిజంగానే కారులో దెయ్యం ఉందా? అసలు ఆ దెయ్యం ఎవరు ? ఎందుకు శివ కొన్న ఆ కారు లో ఉంటుంది ? కారుకి దెయ్యానికి ఉన్న కనెక్షన్ ఏమిటి? ఆ దెయ్యం ఎవరిఫై రివేంజ్ తీసుకోవాలనుకుంటుంది ? మరి ఆ దెయ్యానికి శివ అండ్ ఫ్రెండ్స్ సహాయం చేస్తారా? అనేది టాక్సీవాలా సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.
నటీనటుల నటన:
అర్జున్ రెడ్డి లో స్టూడెంట్ గా, లవర్ గా, బాధ్యతలేని డాక్టర్ గా మేనరిజమ్, స్టయిల్ తోనే అదరగొట్టిన విజయ్ దేవరకొండ గీత గోవిందం తో నటుడిగా తనని తాను నిరూపించుకొన్నాడు. గీత గోవిందంలో బాధ్యతాయుతమైన ఉద్యోగిగా.. సగటు అబ్బాయిలా పెళ్లి గురించి కలలు కనే కుర్రాడిలా, అనుకోకుండా ప్రేమించిన మ్మాయి చేతిలో అబద్దాల కోరుగా తప్పుచేసిన వాడిలా మిగలడం, ఆ సినిమా లో విజయ్ కామెడీ టైం అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేశాయి. అర్జున్ రెడ్డితో యూత్ కి దగ్గరైన విజయ్ గీత గోవిందం తో ఫామిలీస్ కి దగ్గరయ్యాడు. మరి తాజా చిత్రం టాక్సీవాలా లో కూడా మంచి నటనను కనబర్చాడు. శివ అనే పాత్రను విజయ్ దేవరకొండ ఈజీగా చేసుకుంటూ వెళ్ళాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో విజయ్ నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇక హీరోయిన్ ప్రియాంక జవల్కర్ ఫ్రెమ్ లో ఉన్నది తక్కువ సేపయినా అటు లుక్స్ పరంగా ఆకట్టుకుంటూ నటన తో మెప్పించింది. గ్లామరస్ గాను ప్రియాంక చాలా బాగుంది. ఎమోషన్స్ సీన్స్ బాగా పండించింది. ఈ చిత్రంలో విజయ్‌కి వదినగా నటించిన కళ్యాణి, మాళవిక తల్లిగా నటించిన యమునలు తమ సీనియారిటీ మరోసారి తెరపై చూపించారు. ఇక ఒక ముఖ్యమైన కీలక పాత్రలో మాళవిక నాయర్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇక ఈ సినిమాలో మరో కీలక హాలీవుడ్ పాత్రలో విజయ్ స్నేహితుడిగా విష్ణు సినిమాకి మేజర్ హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ , హావభావాలతో చాలా వరకు ఎంటర్టైన్ చేశాడు. ఇక మిగతా నటీనటులు పరిధిమేర నటించి మెప్పించారు.
విశ్లేషణ:
ఈ సినిమా తో ముగ్గురు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమా దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్, నిర్మాత ఎస్ కె ఎన్, హీరోయిన్ ప్రియాంక జవల్కర్ ముగ్గురూ మొదటిసారిగా ఈ టాక్సీవాలా సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ మొదటి సినిమానే థ్రిల్లింగ్ సస్పెన్స్ ఉన్న సబ్జెక్టుని తీసుకున్నాడు. ఆ థ్రిల్లర్ కథని కామెడీ టచ్ చేసి సినిమా చేసాడు. అయితే రాహుల్ సంక్రిత్యాన్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నప్పటికి... ఆ లైన్ ను పూర్తిగా కన్విన్స్ చేసిన విధానంలో కొన్ని చోట్ల సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక థ్రిల్లింగ్ ఉన్న కామెడీతో కథను నడిపించిన దర్శకుడు లవ్ ట్రాక్ ని సరిగ్గా నేరేట్ చెయ్యలేకపోయాడు. విజయ్, ప్రియాంక మధ్య లవ్ సీన్స్ లో దర్శకుడు మరికాస్త శ్రద్ద పెట్టాల్సింది. ఇక విలన్ తాలూకు సన్నివేశాలను కూడా ఇంకా కొంచెం క్లారిటీగా చూపించే ఉంటే బాగుండేది. అలాగే కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువుగా కనిపిస్తోంది. ముఖ్యంగా రవివర్మ పాత్రను దాచి ఉంచడం సినిమాకి అనుగుణంగా ఎదో కావాలని చేసినట్లు ఉంటుంది. ఇలాంటి కథను డీల్ చేయాలంటే స్క్రీన్ ప్లే చాలా కీలకం. టాక్సీవాలా కథలో ఎక్కడా స్క్రీన్ ప్లే పై గ్రిప్పింగ్ కోల్పోకుండా.. ఫస్టాఫ్ మొత్తం థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా మలిచి సెకండాఫ్‌లో అసలు కథకి తీసుకువెళ్లాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ ను డీసెంట్ గా కామెడీగా మలిచి సెకండ్ హాఫ్ ఫై ఆసక్తి క్రియేట్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో పట్టు తప్పాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ సన్నివేశాలతో బాగా బోర్ కొట్టించాడు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం ఈ సినిమాని తన భుజ స్కందాల మీదనే నడిపించాడు. విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే తన నటనతో లుక్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తో సినిమాకి వెన్నెముకలా కనిపంచినా దర్శకుడు చేసిన తప్పిదాలతో ఈ సినిమా విజయ్ కి యావరేజ్ అందిస్తుంది కానీ.. హిట్ ఇవ్వలేదు.
సాంకేతిక వర్గం పనితీరు:
తమిళ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన మ్యూజిక్ సోసోగానే ఉంది కానీ.... 'మాటే వినదుగా' అనే సాంగ్ మాత్రం సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ ఫర్వాలేదనిపించినా... బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. థ్రిల్లర్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం హైలెట్ అనేలా ఉంది. రొమాంటిక్, యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాలకు వేరియేషన్స్ చూపిస్తూ మంచి నేపధ్య సంగీతాన్ని ఇచ్చాడు. సుజిత్ సారంగ్ విజువల్స్ సినిమాకి మరో హైలెట్, సుజిత్ సారంగ్ ఫోటోగ్రఫి సినిమా స్థాయిని పెంచేలా ఉంది. చాలా సందర్భాల్లో సుజిత్ కెమెరా పనితనం గొప్పగా కనబడుతుంది. ఎడిటింగ్ మాత్రం మరికాస్త షార్ప్ గా ఉండాల్సింది. ఇక ఎస్. కే .ఎన్ మొదటిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినా... నిర్మాతగా ఎక్కడా కంప్రమైజ్ కాకుండా ఈ సినిమాకి ఖర్చు పెట్టాడు. నిర్మాణ విలువలు కథానుసారం గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్: కాన్సెప్ట్, విజయ్ నటన, కామెడీ, సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్స్: స్లో నరేషన్, సెకండ్ హాఫ్, మ్యూజిక్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ , కొన్ని సీన్స్ కన్విన్సింగ్ గా లేకపోవడం
రేటింగ్: 2.75/5