వినయ విధేయ రామ మూవీ ఫుల్ రివ్యూ
బ్యానర్: డి.వి.వి ఎంటర్టైన్మెంట్ నటీనటులు: రామ్ చరణ్, కైరా అద్వానీ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ, ఈష గుప్త(ఐటెం గర్ల్), మధుమిత, హిమజ, రవివర్మ, [more]
బ్యానర్: డి.వి.వి ఎంటర్టైన్మెంట్ నటీనటులు: రామ్ చరణ్, కైరా అద్వానీ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ, ఈష గుప్త(ఐటెం గర్ల్), మధుమిత, హిమజ, రవివర్మ, [more]
బ్యానర్: డి.వి.వి ఎంటర్టైన్మెంట్
నటీనటులు: రామ్ చరణ్, కైరా అద్వానీ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ, ఈష గుప్త(ఐటెం గర్ల్), మధుమిత, హిమజ, రవివర్మ, ముఖేష్ ఋషి, మధునందన్ హేమ, పృథ్వి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, ఆర్థర్ ఏ. విల్సన్
ఎడిటింగ్: కోటగిరి
నిర్మాత: డి.వి.వి దానయ్య
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: బోయపాటి శ్రీను
‘ధ్రువ’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా విలన్ అరవింద్ స్వామితో మైండ్ గేమ్ ఆడిన రామ్ చరణ్… ఆ సినిమాతో పరిణితి చెందిన నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. మెగా హీరో బ్రాండ్ ఎంతగా ఉన్నప్పటికీ… నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ అనే పిరియాడికల్ కథతో అదిరిపోయే నటనతో రామ్ చరణ్ అడుగడుగునా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘రంగస్థలం’ విడుదల కాకముందే బోయపాటితో సినిమా మొదలు పెట్టాడు. ఇక బోయపాటి మార్క్ యాక్షన్ ని ఆయన తొలి చిత్రం ‘భద్ర’ దగ్గర నుండి… ‘జయ జానకి నాయక’ వరకు చూస్తూనే ఉన్నాం. బోయపాటి శ్రీను సినిమాల్లో హీరోని ప్రెజెంట్ చేసే విధానం పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉండటం అన్ని సినిమాల్లోనూ మనం చూడొచ్చు. హీరోని స్టైలిష్ గా ఫ్యామిలీ పర్సన్ గా చూపిస్తూనే విలన్స్ ని ఊచకొత కోసేటట్టుగా హీరోల కేరెక్టర్ ని డిజైన్ చేస్తాడు బోయపాటి. అసలు బోయపాటి అంటే యాక్షన్… యాక్షన్ అంటే బోయపాటి అన్న మాదిరిగా బోయపాటి సినిమాలు ఉంటాయి. అలాంటి బోయపాటితో కండలు తిరిగిన రామ్ చరణ్ మాస్ సినిమా చేస్తే మెగా ఫాన్స్ కి పూనకాలే. మరి బోయపాటి – చరణ్ కాంబోలో సాఫ్ట్ టైటిల్ తో యాక్షన్ మూవీ గా ‘వినయ విధేయ రామ’ తెరకెక్కింది. ఇక మొదటి నుండి యాక్షన్ సినిమాగానే ఫోకస్ అయినా ‘వినయ విధేయ రామ’లో ఆ యాక్షన్ సీన్స్ నే బోయపాటి బాగా హైలెట్ చేసాడని ట్రైలర్స్ లో, టీజర్ లో, ‘వినయ విధేయ రామ’ పోస్టర్స్ లో చూశాం. ఇప్పటివరకు ‘ధ్రువ, రంగస్థలం’తో బ్లాక్ బస్టర్స్ అందుకున్న రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’తో కూడా హిట్ అందుకుని హ్యాట్రిక్ కొట్టాడో లేదో అనేది సమీక్షలో చూద్దాం.
కథ:
నలుగురు అనాధ కుర్రాళ్ళకి (ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, మధునందన్, రవివర్మ) అప్పుడే పుట్టిన చిన్న బాబు(రామ్ చరణ్) రైల్ ట్రాక్ వద్ద దొరుకుతాడు. అనాథలైన వాళ్లు ఆ చిన్నవాడిని చేరదీస్తారు. అప్పటి నుండి అందరూ అన్నదమ్ముల్లా పెరుగుతారు. ఇక ఏడేళ్ల వయస్సు లోనే రామ్ కొణిదెల(రామ్ చరణ్) తన అన్నదమ్ముల కోసం రౌడీలతో పోరాడతాడు. అప్పటి నుండి వాళ్లకు రామ్ మరీ ప్రాణమైపోతాడు. అనాధలైనా మంచి చదువు చదివి రామ్ నలుగురు అన్నలు భువన్(ప్రశాంత్) ఆర్యన్(ఆర్యన్ రాజేష్) మిగతా వారు జాబ్స్ సంపాదించుకుంటారు. కానీ రామ్ మాత్రం జాబ్ ఏం చెయ్యకుండా కాలక్షేపం చేస్తుంటాడు. అన్నావదినలు రామ్ ని గారాబం చేస్తూ రామ్ ఏది చెబితే అది జరిగేలా చూసుకుంటారు. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో ఆ ఫ్యామిలీకి అనుకోని అవాంతరం రాజా భాయ్ మున్నా నుండి ఎదురవుతుంది. రామ్ పెద్ద అన్నయ్య భువన్ చాలా స్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. విశాఖలో జరిగే ఉప ఎన్నికల్లో పందెం పరశురాం(ముఖేష్ రుషి) అరాచకాలను భువన్ బయట పెడతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అది నచ్చని పరశురాం.. రామ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అందుకు బిహార్‌లో ఉన్న రాజా మున్నాభాయ్ (వివేక్ ఒబెరాయ్)ని రంగంలోకి దింపుతాడు. అయితే బీహార్ లో రాజా భాయ్ మున్నా (వివేక్ ఒబరాయ్) ఓ నియంతలా రాజ్యం ఏలుతూంటాడు. అయితే పందెం పరశురాం గొడవ జరిగాక భువన్ కనిపించకుండా పోతాడు. అసలు భువన్ మాయమవడానికి రాజా భాయ్ మున్నాకి గల సంబంధం ఏమిటి? భువన్ ని వెతకడానికి వచ్చిన రామ్… రాజా భాయ్ మున్నా గురించి ఎలా తెలుసుకుంటాడు? ఇంకా ఈ సినిమాలో సీత(కైరా అద్వానీ) పాత్ర ఏమిటి? అసలు భువన్ కుమార్ బ్రతికే ఉన్నాడా? రాజా భాయ్ మున్నాని రామ్ ఎలా ఎదుర్కొంటాడు? అనేదే వినయ విధేయ రామ కథ.
నటీనటుల నటన:
రంగస్థలంలో చిట్టిబాబుగా మాసివ్ కేరెక్టర్ లో చెలరిగిపోయిన… రామ్‌చరణ్ వినయ విధేయరామ లో ఒక ఎగ్రెసివ్ పాత్ర చేశాడు. రామ్ కొణిదెల పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. ఫ్యామిలీ అబ్బాయిగా, లవర్ గా, కమెడియన్ గా, మాస్ ని తలపించే కోపంతో ఇలా అనేక కోణాల్లో రామ్ కేరెక్టర్ సినిమాలో కనబడుతుంది. అయితే బోయపాటి సినిమా గనక… రామ్ చరణ్ సినిమా మొత్తం మీద కండలు తిరిగిన బాడీతో యాక్షన్ హీరోగానే ఎలివేట్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ చేసి రామ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు బాగా నచ్చుతాయి. టాటూస్, స్టిక్కర్లు అతికించుకున్నప్పుడు పడిన బాధను రామ్ చరణ్ చాలా ఇంటర్వూస్ లో చెప్పాడు. అయితే ఆ బాధను… టాటూ ఉన్న బాడీ తో.. చరణ్ కనబడినబడినప్పుడల్లా… ఫాన్స్ ఈలలు, కేకలతో థియేటర్స్ లో రెచ్చిపోవడం చూస్తే చరణ్ ఆ బాధను ఇట్టే మరిచిపోవచ్చు. అంతగా చరణ్ టాటూ బాడీ హైలెట్ అయ్యింది. ఎప్పటిలాగే రామ్ చరణ్ డాన్స్ ల విషయంలో దున్నేశాడు. చరణ్ యాక్షన్ గురించి ఎంతగా మాట్లాడుకుంటారో.. చరణ్ డాన్స్ లు గురించి మాట్లాడుకుంటారు. ఇక హీరోయిన్ కైరా అద్వానీ అందంగా, గ్లామర్ గా కనిపించింది. కానీ సీతగా కైరా పాత్రకు సినిమాలో అంతగా ప్రాధాన్యం లేదు. అందుకే కైరా అద్వానీ గ్లామర్ ప్రదర్శనకు, పాటలకే పరిమితమైంది అంటున్నది. చరణ్ కోసం ఒక భారీ హీరోయిన్ పెట్టినట్లుగా అనిపిస్తుంది కైరా పాత్ర చూసిన ప్రతిసారి. విలన్ పాత్రలో నటించిన వివేక్ ఒబెరాయ్ తనదైన శైలిలో స్టైలిష్ విలన్ గా అదరగొట్టేసాడు. రామ్ చరణ్ – వివేక్ ఒబెరాయ్ మధ్యన వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అనే రేంజ్ లో ఉంటాయని మొదటి నుండి చెప్పినట్టుగానే సినిమాలో కనిపించాయి. బాలీవుడ్ నుంచి వివేక్ ఒబెరాయ్ ని విలన్ గా తీసుకొచ్చినందుకు తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక చరణ్ కి అన్నదమ్ములుగా నటించిన ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, మధునందన్, రవివర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా చరణ్ పెద్దన్నగా భువన్ పాత్రలో నటించిన ప్రశాంత్‌కు ఎక్కువ మార్కులు పడతాయి. ఆర్యన్ రాజేష్ ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంటాడు. ప్రశాంత్ భార్యగా స్నేహ చాలా చక్కగా అందంగా కనిపించింది. ఇంకా మధుమిత, ముఖేష్ ఋషి ఉన్నంతలో పర్వాలేదనిపించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
గత ఏడాది రామ్ చరణ్ కి రంగస్థలం సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ ద బెస్ట్ ఆల్బమ్ నిచ్చాడు. కానీ ఈసారి వినయ విధేయరామ కి మాత్రం దేవిశ్రీ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకునేలా లేదు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో తస్సాదియ్యా…. రామ లవ్స్ సీత పాట మాస్ ప్రేక్షకులను అలరించేవిలా ఉన్నాయి. ఇక పాటల్లో సాహిత్యం, మ్యూజిక్ కన్నా రామ్‌చరణ్ స్టెప్లు అభిమానులను బాగా మెప్పిస్తాయి. అంటే పాటలు వినడం కన్నా చూడడానికి బావున్నాయనిపిస్తుంది. ఇక సినిమా మొత్తానికి రిషి పంజాబీ, ఆర్థర్ విల్సన్ ల సినిమాటోగ్రఫీ హైలెట్. యాక్షన్ సీన్స్ కానివ్వండి, పాటలు పిక్చరైజేషన్ కానివ్వండి… ఫ్యామిలీ సన్నివేశాలు కానివ్వండి.. అన్నింటిని అందంగా కెమెరాలో బంధించారు. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే.. అక్కడక్కడా కొన్ని లాగింగ్ సీన్స్ ఉన్నాయి.. వాటిని ఎడిటింగ్ లో లేపేస్తే బావుండేది. ఇక దానయ్య బోయపాటిని నమ్మి ఎక్కడా రాజి లేని ఖర్చు పెట్టాడు. దానయ్య పెట్టిన ప్రతి రూపాయి.. ఫ్రెమ్ లో కనిపిస్తూనే ఉంది.
విశ్లేషణ:
ధ్రువ, రంగస్థలం సినిమాల తర్వాత రామ్ చరణ్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోల్లా రెగ్యులర్ ఫార్మేట్ లో సినిమాలు చేయకుండా కొత్తగా ప్రయత్నిస్తాడని అనుకున్నారు. కానీ మాస్ డైరెక్టర్ బోయపాటికి ఓకె చెప్పి కాస్త షాకిచ్చాడు. అయితే బోయపాటి కూడా తన సినిమాల్లో హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేస్తాడు. అందుకే చరణ్, బోయపాటికి కమిట్ అయ్యాడు. ఇక రంగస్థలం లాంటి భారీ హిట్ అందుకున్న రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. మరి బోయపాటి, రామ్ చరణ్ హీరోయిజాన్ని ఎప్పటిలాగే యాక్షన్ సీక్వెన్సెస్ తో బాగానే హైలెట్ చేసాడు. ఇక ఈ వినయ విధేయ రామ సినిమా మొత్తం… ఫ్యామిలీ, యాక్షన్ మిళితంగానే అంటే.. బోయపాటి తన పాత ఫార్ములానే ఈ వినయ విధేయ లో కూడా చూపించాడు. బోయపాటి తన సినిమాల్లో ఫ్యామిలికిచ్చే ప్రాధాన్యతతో పాటుగా… తన మార్క్ యాక్షన్ ఎక్కడా తగ్గకుండా చూసుకుంటాడు. అలాగే ఈ సినిమాలో చేసాడు.. కానీ ఒకింత ఎక్కువగానే చేసాడు. కుటుంబంలో అన్నావదినలు, వారి పిల్లల మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందో అదంతా తెరపై చాలా అందంగా… ఇంకా చెప్పాలంటే రిచ్‌గా చూపించారు. ఎప్పటిలాగే యాక్షన్ ఎపిసోడ్లకు వచ్చేసరికి వాటిని మరో స్థాయిలో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు బోయపాటి. అయితే అడుగడుగునా ఫ్యామిలీ ఆడియన్స్ కు, ఇటు మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలన్నది బోయపాటి ప్రయత్నంగా కనిపిస్తుంది. హీరోయిన్ కైరాతో కొన్ని సన్నివేశాలు, అలాగే ఆఫీస్‌లో జరిగే ఎపిసోడ్లలో కాస్త కామెడీ ఆకట్టుకునేలా కనబడుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లోనే హీరోయిజం ఎలివేట్ చేసే సన్నివేశాలు ఓ రేంజ్ లో కనబడతాయి. యాక్షన్ సీక్వెన్స్ ముందు వచ్చే సన్నివేశాల్లో భావోద్వేగాలు బాగా పండించాడు. ఇంటర్వెల్ వరకూ ఈ సినిమాలో కథే ఉంటుంది. టీజర్లో చూపించిన రామ్ కో..ణి..దె..ల ఎపిసోడ్, ఇంటర్వెల్ ఎపిసోడ్ లు ఫస్టాఫ్ అంతటికి హైలైట్ గా నిలుస్తాయి. ఇక సెకండ్ హాఫ్ మొత్తం తన అన్నని చంపిన విలన్ వివేక్ ఒబెరాయ్ మీద పగ తీర్చుకోవడంతోనే సినిమా సెకండ్ హాఫ్ మొత్తం సరిపోతుంది. కాకపోతే చరణ్, వివేక్ ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు, పోస్టర్లలో చూపించిన రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ బాడీతో ఫైట్ ఎపిసోడ్, క్లైమాక్స్ సెకండాఫ్ కు హైలైట్ అని చెప్పొచ్చు. యాక్షన్ సన్నివేశాలు ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉండడంతో.. ప్రేక్షకుడికి విసుగొచ్చేస్తుంది. అసలు రామ్ చరణ్ కి, విలన్ వివేక్ ఒబెరాయ్ కి మధ్య డైలాగ్స్ కన్నా ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలున్నాయంటే… పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఫ్యామిలీ డ్రామాకి కనెక్ట్ అయిన ప్రేక్షకుడుకి.. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ స్టోరీ ఎక్కడా కనబడదు. కేవలం రామ్, వివేక్ యాక్షన్ తప్ప. ఈ యాక్షన్ ఎపిసోడ్ల మూలంగా కథ బాగా నలిగిపోయి యాక్షన్ సీక్వెన్స్ మధ్య కథను పేర్చుకుంటూ వెళ్లాడేమో అనిపిస్తుంది. మరి కేవలం మెగా అభిమానులకు, మాస్ ప్రేక్షకులకే ఈ వినయ విధేయ రామ అనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెప్పే మాట.
ప్లస్ పాయింట్స్: రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ బాడీ, డాన్స్ లు, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్, రామ్ కో..ణి..దె..ల డైలాగ్ ఎపిసోడ్, మాస్ ఎలిమెంట్స్
మైనస్ పాయింట్స్: దేవిశ్రీ మ్యూజిక్, కథ, మరీ ఎక్కువైన మాస్ ఫైట్స్, సెకండ్ హాఫ్
రేటింగ్: 2.5/5