Fri Nov 22 2024 20:07:51 GMT+0000 (Coordinated Universal Time)
Virupaksha Review : విరూపాక్ష రివ్యూ
రుద్రవనం అనే ఊరిలో క్షుద్రపూజలు చేస్తున్నారని ఒక కుటుంబాన్ని ఆ ఊరి ప్రజలు సజీవ దహనం చేస్తారు. మంటల్లో కాలిపోతూ..
సినిమా : విరూపాక్ష
విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2023
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, సునీల్, శ్యామల, రవికృష్ణ తదితరులు
దర్శకుడు : కార్తీక్ వర్మ దండు
నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్
సంగీత దర్శకులు: అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: శామ్‌దత్ సైనుద్దీన్
ఎడిటర్: నవీన్ నూలి
చాలాకాలం తర్వాత సాయిధరమ్ తేజ్ వెండితెరపై విరూపాక్షగా కనిపించాడు. సాయి ధరమ్ తేజ్ ఓ ప్రమాదానికి గురై.. దాని నుంచి కోలుకున్నాక చేసిన సినిమా ఇది. అగ్ర దర్శకుడు సుకుమార్ శిష్యుల్లో ఒకరైన కార్మీక్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పోస్టర్లు, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఆ అంచనాల మేరకు విరూపాక్ష ఉందా ? బాక్సాఫీస్ వద్ద సినిమా హిట్టో కాదో చూద్దాం.
కథలోకి వెళ్తే..
రుద్రవనం అనే ఊరిలో క్షుద్రపూజలు చేస్తున్నారని ఒక కుటుంబాన్ని ఆ ఊరి ప్రజలు సజీవ దహనం చేస్తారు. మంటల్లో కాలిపోతూ.. ఆ దంపతులు పుష్కరకాలం తర్వాత ఊరు వల్లకాడు అవుతుందని శపిస్తారు. వాళ్లు చెప్పినట్టుగానే పన్నెండేళ్ల తర్వాత ఊరిలో అసహజ రీతిలో మరణాలు చోటుచేసుకుంటాయి. కొన్నిరోజులు ఊరిని అష్టదిగ్బంధనం చేస్తారు. అదే సమయంలో సూర్య (సాయి ధరమ్ తేజ్) తన తల్లితో పాటు రుద్రవనం వస్తాడు. అక్కడ నందిని (సంయుక్త)తో ప్రేమలో పడతాడు. తిరిగి వెళ్లే అవకాశం ఉన్నా నందినీ కోసం మళ్లీ వస్తాడు. ఊరిలో జరుగుతున్న చావుల వెనుక ఉన్న కారణం తెలుసుకునేందుకు సూర్య సాయశక్తులా ప్రయత్నిస్తాడు. మరి సూర్య ఆ మిస్టరీని కనుగొన్నాడా ? అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? వరుస మరణాల వెనుక ఉన్నది ఎవరు ? తెలుసుకోవాలంటే తెరపై సినిమాను చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
1979-90 దశకం నేపథ్యంలో జరిగే కథ ఇది. మిస్టిక్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో.. తాంత్రిక శక్తులు, ఆత్మలు అంటూ చూపించిన సన్నివేశాలు కాస్త భయానికి గురిచేస్తూనే.. థ్రిల్ ను పంచుతాయి. గతంలో వచ్చిన మిస్టిక్ థ్రిల్లర్లకు భిన్నంగా దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే స్క్రీన్ ప్లే ఉండటంతో అడుగడుగునా సినిమా ఆసక్తిని రేకెత్తిస్తుంది. దంపతుల తాంత్రిక పూజలతో ఈ కథ మొదలవుతుంది. ఆ తర్వాత రుద్రవనంలోకి హీరో ఎంట్రీ, హీరో-హీరోయిన్ ల మధ్య ప్రేమకథ, ఊహించని రీతిలో మరణాలతో మలుపు తిరుగుతుంది.
ఫస్టాఫ్ వరకూ సినిమాలో నాలగు మరణాలు చోటుచేసుకుంటే.. కీలక పాత్ర చనిపోవడంతో ఇంటర్వెల్ బ్రేక్ ఇవ్వడం ఆసక్తి రేపుతుంది. సెకండాఫ్ లోనే అసలు కథంతా ఉంటుంది. మరణాల వెనుక మిస్టరీని ఛేదించే క్రమంలో హీరోకి అడుగడుగునా ఎదురయ్యే సవాళ్లు, వాటిని అతను అధిగమించే తీరు, ఒక్కో మరణం వెనుక ఉన్న రహస్యాలు బయటపెట్టడం ఆసక్తికరంగా సాగుతాయి. ఊరిజనం ప్రాణాలన్నీ ఒకరి గుప్పిట్లో ఉన్నాయని తెలియడం సినిమాకి కీలకంగా నిలిచింది. సినిమాలో అక్కడక్కడా సాగదీతగా అనిపించినా.. స్టోరీ థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
+ థ్రిల్ కు గురిచేసే కథ, కథనాలు
+ బలమైన పాత్రలు
+ కెమెరా, సంగీతం
మైనస్ పాయింట్స్
- సెకండ్ ఆఫ్ లో కొన్ని సన్నివేశాలు
- లాజిక్ పాయింట్స్ ని సింపుల్ గా చూపడం
చివరిగా.. విరూపాక్ష కాస్త ఇంట్రెస్ట్ గా సాగే మిస్టిక్ థ్రిల్లర్
Next Story