విశాల్ ' అభిమన్యుడు' షార్ట్ & స్వీట్ రివ్యూ
తెలుగు వాడు అయినా కోలీవుడ్‌లో అన్ని రంగాల్లో స్టార్‌గా దూసుకు వెళుతోన్న విశాల్ వరుసగా మంచి కథాబలం ఉన్న సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నాడు. డిటెక్టివ్‌తో హిట్ కొట్టిన విశాల్ తాజాగా ఇరుంబు తిరై సినిమాతో అక్కడ తిరుగులేని కమర్షియల్ హిట్ కొట్టాడు. సైబర్ క్రైం, టెక్నాలజీతో ప్రజలు ఎలా నష్టపోతున్నారన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ కాగా, సీనియర్ హీరో అర్జున్ విలన్‌గా నటించారు. పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ఈ రోజు అభిమన్యుడు పేరుతో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సెలబ్రిటీస్ ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమాకు ప్రీమియర్లతో ఎలాంటి టాక్ వచ్చిందో తెలుగుపోస్ట్.కామ్ షార్ట్ రివ్యూలో ఓ లుక్కేద్దాం.
సమాజంలో ప్రస్తుతం సోషల్‌మీడియా, టెక్నాలజీ వాడకం పెరిగిపోయింది. మన చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్ వచ్చాక ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతే నష్టాలు ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ సాయంతో ఎలా జనాలను బురిడి కొట్టిస్తున్నారో ? అనే కథాంశంతో మంచి మెసేజ్‌తో మిత్రన్ ఈ సినిమాను ప్రజెంట్ చేశాడు. కథ విషయానికి వస్తే కుటుంబానికి దూరమైన ఓ యువకుడు మిలట్రీలో చేరి తీవ్రమైన కోపిష్టిగా ఉంటాడు.
చివరకు అక్కడ కండీషన్ పెట్టడంతో సైక్రియార్టిస్ట్ అయిన సమంతను కలుస్తాడు. ఈ క్రమంలోనే చెల్లి పెళ్లి కోసం తాను తీసుకున్న లోన్ డబ్బులు అక్కౌంట్ నుంచే మాయం అవుతాయి. దీని వెనక విలన్ వైట్ డెవిల్ (అర్జున్) ఉన్నట్టు తెలుసుకుంటాడు. చివరకు డెవిల్ ఏం చేస్తున్నాడో ? విశాల్ ఎలా కనిపెట్టాడు ? చివరకు ఈ కథ ఎలా ఎండ్ అయ్యింది అన్న ఉత్కంఠ లైన్‌తో సినిమా నడుస్తుంది. ఈ సినిమా చూశాక మనం టెక్నాలజీ మాయలో ఎలా మోసపోతున్నామో? మన చుట్టూనే మనకు తెలియకుండానే ఏం జరుగుతుందో ? అన్నది తెలుస్తుంది.
టెక్నాలజీ మోసాలు, బ్యాంకుల్లో మోసాలు, మన డేటాను వేరే వాళ్ల చేతుల్లోకి వెళితే ఏమవుతుంది ? ఎలా మోసపోతున్నాం లాంటి అంశాలను బాగా డీల్ చేశారు. సినిమా కథ, కథనాలు ప్లస్ అయినా పాటలు, డైలాగులు, సాగదీత సన్నివేశాలు మైనస్. ఇక మంచి టెక్నాలజీ సందేశంతో వచ్చిన అభిమన్యుడు మనందరిని ఎలెర్ట్ చేసే మంచి చిత్రం. బీ, సీ సెంటర్లలో ఈ సినిమా ఎంత వరకు కనెక్ట్ అవుతుందో ? చూడాలి. పూర్తి రివ్యూతో కొద్దిసేపట్లోనే కలుద్దాం