అజ్ఞాతవాసి మూవీ రివ్యూ - 2
ప్రొడక్షన్ హౌస్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
నటీనటులు: పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్, ఖుష్బూ, ఇంద్రజ, బోమన్ ఇరానీ, ఆది పినిశెట్టి, మురళి శర్మ, రావు రమేష్, వెన్నల కిషోర్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవి చంద్రన్
సినిమాటోగ్రఫీ: వి. మణికందన్
నిర్మాత : చినబాబు(హారిక అండ్ హాసిని క్రియేషన్స్)
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
పవన్ కళ్యాణ్ అంటే వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టుగా ఉంటుంది. పవన్ గత సినిమా హిట్టా లేదా ఫట్టా అనేది లేకుండా... పవన్ కొత్త సినిమా మీద అంచనాలు ఉంటాయి. సినిమాల విషయంలో తొందరపడకుండా ఆచి తూచి అడుగులు వేస్తాడు పవన్ కళ్యాణ్. అందుకేనేమో కెరీర్ లో 25 వ సినిమా చెయ్యడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు తన కెరీర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే సినిమాగా పవన్ అజ్ఞాతవాసి సినిమాని ఎంచుకోవడం... దానికి దర్శకుడిలా త్రివిక్రమ్ కి బాధ్యలు అప్పగించడంతోనే ఈ సినిమా మీద భారీ అంచానాలు మొదలయ్యాయి.ఎదుకంటే పవన్ - త్రివిక్రమ్ కలయికలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు హిట్స్ కదా. అందుకే ఇప్పుడు వీరి కలయికలో రాబోతున్న మూడో సినిమా అజ్ఞాతవాసి మీద అంత అంచనాలు ఉండడానికి కారణమయ్యాయి. అందులోను త్రివిక్రమ్ తన సినిమాల్లో అందమైన కామెడీ.. మనసుకు హత్తుకుపోయే డైలాగ్స్, కంటతడి పెట్టించే ఎమోషన్స్ తో కూడిన డైలాగ్స్ తో ఆకట్టుకుంటాడు. త్రివిక్రమ్ మార్క్ పంచ్ లు, దానికి తగ్గ యాక్షన్ సన్నివేశాలకు కొదవే ఉండదు. అందులోను త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కి మంచి స్నేహితుడు. అందుకే తన స్నేహితుడు కెరీర్ లో మైలు రాయిగా నిలిచి పోయే ఈ అజ్ఞాతవాసి సినిమాని ఒక ఏడాది కాలం పాటు చెక్కాడు. అలాగే అడిగిందల్లా కాదనకుండా ఇచ్చే నిర్మాతలు దొరకడం ఈ అజ్ఞాతవాసికి మరో ప్లస్సు. అజ్ఞాతవాసి సినిమాకి హారిక అండ్ హాసిని వారు భారీ నుండి అతి భారీ బడ్జెట్ పెట్టారు. వారు పవన్ కున్న క్రేజ్ మీద, త్రివిక్రమ్ దర్శకత్వం మీద ఉన్న నమ్మకంతోనే ఎడా పెడా ఖర్చు పెట్టేసారు. అజ్ఞాతవాసికి మొదటినుండి అన్ని అదనపు హంగులే. కేవలం పవన్ మాత్రమే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అనేది లేకుండా ఈ సినిమాకి కోలీవుడ్ నుండి ఒక కుర్ర సంగీత దర్శకుడు అనిరుధ్ ని తెలుగులో భారీగా ఎంట్రీ ఇప్పించడం, అందమైన హీరోయిన్స్ ని కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ ని ఎంపిక చెయ్యడం... అలాగే ఈ సినిమా కోసం కోలీవుడ్ నుండి ఖుష్బూ వంటి సీనియర్ యాక్టర్ ని తీసుకురావడం.. ఇలా అన్ని విషయాల్లోనూ అజ్ఞాతవాసి కి మొదటినుండి మంచి క్రేజ్ వచ్చేలా చేశాయి. పవన్ కళ్యాణ్ స్టైల్, అణుకువ, ధైర్యం, నటన, మొహమాటం, భయం, ఎమోషన్, కామెడీ, సిగ్గు ఇలా నవరసాలు పలికించిన అజ్ఞాతవాసి టీజర్ తో పాటు ట్రైలర్ కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు పెరగడానికి కారణం. మరి త్రివిక్రమ్ మార్క్ కామెడీ టచ్, పవన్ కళ్యాణ్ రొమాంటిక్, కామెడీ, యాక్షన్ వెరసి ఈ సినిమాని ఏ లెవల్లో కూర్చోబెట్టాయో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
గోవింద్ భార్గవ్ (బోమన్ ఇరాని) ఒక బడా పారిశ్రామికవేత్త. ఆయన కొడుకె అభిషిక్త్ భార్గవ్(పవన్ కల్యాణ్). అభిషిక్త్ చిన్నతనంలోనే తల్లి (ఇంద్రజ) కి దూరమవుతారు. అభిషిక్త్ తండ్రి గోవింద్ భార్గవ్ మరో పెళ్లి చేసుకుంటాడు. ఆమె ఇంద్రాణి (ఖుష్బు ). అయితే డబ్బు మీద ప్రేమలేకుండా ఉండేలా పెంచమని అభిషిక్త్ భార్గవ్ ని తన మేనమామ కి అప్పగిస్తారు. అభిషిక్త్ భార్గవ్ పేరు మార్చుకుని బాలసుబ్రహ్మణ్యం గా మారి అస్సాం లో మేనమామ ఇంట్లో పెరుగుతాడు. వ్యాపారగొడవల్లో అభిషిక్త్ తండ్రి గోవింద్ భార్గవ్ ని , తమ్ముడు మోహన్ భార్గవ్ ని (ఖుష్బు కొడుకు) చంపేస్తారు. అయితే బాలసుబ్రహ్మణ్యం గా పెరిగిన అభిషిక్త్, తన తండ్రి స్థాపించిన కంపెనీలోనే పర్సనల్ మ్యానేజర్ గా చేరి, తన తండ్రి హత్యకు కారకులని కనిపెట్టే క్రమంలో అభిషిక్త్ బల్గెరియా వెళతాడు. మరి అభిషిక్త్ తన మరణానికి కారకులైన వారిని ఎలా కనిపెట్టాడు? అసలు అభిషిక్త్ తన తండ్రికి దూరంగా ఎందుకు పెరుగుతాడు? అభిషిక్త్ కి తన పిన్ని ఇంద్రాణికి ఉన్న అనుబంధం ఎలాంటిది? తన శత్రువులనుండి చివరికి ఆస్తిని అభిషిక్త్ ఎలా దక్కించుకున్నాడు? ఈ క్రమంలో హీరోయిన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ ల పరిస్థితి ఏమిటి? అలాగే ఒక చైన్ కి, వాచ్ కి ఉన్న సంబంధం ఏమిటి? అనేది వెండితెర మీద అజ్ఞాతవిసిని వీక్షించి తెలుసుకుంటేనే బావుంటుంది.
నటుల పాత్ర:
పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాలి. ఎప్పుడు చెప్పేదే. కాకపోతే ఈ సినిమాలో అభిషిఖ్త్ భార్గవ్ గా, బాల సుబ్రహ్మణ్యం గా తనదయిన మ్యానరిజం, స్టయిల్ తో అదరగొట్టేసాడు పవన్. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో లా నడిపించాడు అంటే అస్సలు అతిశయోక్తిలేదు. జాబ్ హోల్డర్ గా డిగ్నిటీ, చురుకుదనం.. హీరోయిన్స్ తో రొమాంటిక్ సన్నివేశంలో పవన్ బిడియం.. ఇలా అన్నిటిలోను పవన్ 100 పెర్సెంట్ అదరగొట్టాడు. కుటుంబానికి ఇచ్చే విలువలు, ఎమోషన్ గా ఉండే డైలాగ్స్, యాక్షన్ సీన్స్ లోని పవన్ స్టైలింగ్ ఇలా అన్నిటితో పవన్ కళ్యాణ్ దుమ్ముదులిపేసాడు. అలాగే కొడకా కోటేశ్వరావు అంటూ గొంతు సవరించేయ్యడం కూడా అదరగొట్టేసింది. పవన్ లోని నవరసాలను వెలికి తీసాడా దర్శకుడు అన్న ఫీలింగ్ మాత్రం రాకమానదు. పవన్ కళ్యాణ్ ఆఫీసు లో చేసే చిలిపి అల్లరితో కూడిన కామెడీ ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్స్ విషయానికొస్తే త్రివిక్రమ్ ఇద్దరు అందమైన టాలెంట్ ఉన్న కీర్తి సురేష్ ని అను ఇమ్మాన్యువల్ ని పవన్ పక్కన నటించడానికి హీరోయిన్స్ గా ఎంపిక చేసాడు. కీర్తి సురేష్ అందమైన అమ్మాయిగా, అను ఇమ్మానువెల్ గ్లామర్ హీరోయిన్ గా బాగానే కనిపించినప్పటికీ వీరిద్దరికి ఈ సినిమాలో నటనకు అసలు ప్రాముఖ్యతే లేదు. పాటలకి, పవన్ కోసం తన్నుకోవడానికి తప్ప వీరి ప్రాధాన్యత అజ్ఞాతవాసికి ఏమాత్రం లేదు. అలాగే సీనియర్ హీరోయిన్స్ అయిన ఇంద్రజ, ఖుష్బూ లు కూడా తమ పరిధిమేర నటించినా ప్రాధాన్యంలేని పాత్రల్లో తేలిపోయారు. త్రివిక్రమ్ సినిమాలో నటీనటుల పాత్రలను ఎంత బలంగా చూపిస్తాడో... కానీ అజ్ఞాతవాసికి వచ్చేటప్పటికీ కేవలం సినిమాలో పవన్ కి మాత్రమే పాధాన్యత ఇచ్చి మిగతావారిని డమ్మీలు చేశాడా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మిగిలిన పాత్రలన్నీ అలాగే కనిపిస్తాయి. పెద్ద పెద్ద నటీనటులను సినిమాలో ఉన్నప్పుడు వారి పాత్రలను కావాల్సిన రీతిలో తీర్చిదిద్దాలి. కానీ తివిక్రమ్ మాత్రంఈసారి అలాంటి బలమైన కేరెక్టర్స్ కోసం ప్రయత్నం చెయ్యలేదేమో అనేది స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మురళి శర్మ, రావు రమేష్ , వెన్నల కిషోర్ చేసిన కామెడీ అక్కడక్కడా పేలినా కొన్ని చోట్ల చికాకు తెప్పితుంది. ఇక బొమ్మన్ ఇరానీ బడా వ్యాపారవేత్తగా.... ఆది పినిశెట్టి విలక్షణ విలన్ గా పర్వాలేదనిపించారు. మిగతావారు వారికిచ్చిన పరిధిలో ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు:
త్రివిక్రమ్ కి అనిరుధ్ మీద ఎప్పటినుండో గురి. తమిళంలో వచ్చిన 3 సినిమాలో అనిరుధ్ మ్యూజిక్ అందించి పాడిన వై దిస్ కొలవరి పాట దగ్గరనుండి త్రివిక్రమ్, అనిరుధ్ ని తెలుగులోకి ఎంట్రీ ఇప్పించాలని చూస్తున్నాడు. ఆ అవకాశం అ.. ఆ సినిమా అప్పుడు వచ్చినా అనిరుధ్ కి డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేయడమే కాదు... తాను మ్యూజిక్ అందించిన అజ్ఞాతవాసికి తనని తానే ప్రత్యేకంగా ప్రమోషన్ చేసుకున్నాడు ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్. అజ్ఞాతవాసికి అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ త్రివిక్రమ్ కి బాగా నచ్చేసిన... ప్రేక్షకులు మాత్రం తిప్పి కొడుతున్నారు. కేవలం గాలి వాలుగా, పవన్ కళ్యాణ్ పాడిన కొడకా కోటేశ్వరావు అనే పాటలు తప్పిస్తే ఏ పాటలు ఆకట్టుకునేలా లేవక్కడ. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓ అన్నంతగా ఏం లేకపోవడం ఈ సినిమాకి మైనస్. కొన్ని సీన్స్ లో ఇచ్చిన బ్యాగ్రౌండ్ నే ఇచ్చి చికాకు తెప్పించాడు. ఇక సినిమాటోగ్రఫీ మాత్రం అజ్ఞాతవాసికి ప్రధాన ఎస్సెట్. విజువల్ గా అజ్ఞాతవాసికి రిచ్ గా చూపించాడు... సినిమాటోగ్రాఫర్ వి. మణికందన్. పాటల పిక్చరైజేషన్ ని, యాక్షన్ సన్నివేశాల్లోని స్టైలింగ్ ని అన్నిటిని అందంగా చూపించాడు. నిర్మాతలు భారీగా పెట్టిన ఖర్చును అంతే భారీ అందంగా చూపించాడు వి. మణికందన్. ఎడిటింగ్ విషయానికొస్తే... ఈ సినిమాలో ఎడిట్ చెయ్యాల్సిన సీన్స్ లెక్కబెట్టలేనన్ని ఉన్నాయి. కోటగిరి ఇచ్చిన ఎడిటింగ్ లో చాలా లోపాలున్నాయి. లాగింగ్ సీన్స్ ని కత్తెర లేకుండా లాక్కొచ్చారు. మరి కోటగిరి ఈ ఎడిటింగ్ ని త్రివిక్రమ్ చెప్పాడని చేసాడో.. లేదో స్వయ్నకృతాపరాధమో అనేది తెలియదు గాని... అజ్ఞాతవాసికి ఎడిటింగ్ పెద్ద మైనస్. ఇక నిర్మాణ విలువల దగ్గరికి వస్తే... నిర్మాత రాధా కృష్ణ(చినబాబు) త్రివిక్రమ్ మీద ఉన్న నమ్మకంతో లేదనకుండా, కాదనకుండా ఈ సినిమాకి బడ్జెట్ ని ఎక్కించాడు. అయన పెట్టిన ఖర్చు ప్రతి సీన్ లోను ఎలివేట్ అవుతుంది. అంత భారీ తనాన్ని తెచ్చాయి నిర్మాణ విలువలు.
విశ్లేషణ:
దర్శకుడు త్రివిక్రమ్ తాను తెరకెక్కించిన ప్రతి సినిమాని ఏ హాలీవుడ్ సినిమా నుండో... లేకుంటే ఏ నవల నుండో ఇన్స్పైర్ అయ్యి తీసినవే. అయినా మనోడు ఎక్కడా ఆ విషయాన్ని స్వతహాగా ఒప్పుకోడు. ఎంత వేరే సినిమా నుండి ఇన్స్పైర్ అయినా తన మాటలతో సినిమాని ఒక లెవల్లో కూర్చోబెడతాడు త్రివిక్రమ్. అంత బలమైన డైలాగ్స్, మనసుకు హత్తుకుపోయే మాటలతో కట్టిపడేస్తాడు. అందుకే స్టార్ హీరోతో సమానంగా త్రివిక్రమ్ కి అభిమానులున్నారు. త్రివిక్రమ్ భావజాలం, ఆయన పెన్ను నుండి వెలువడిన ముత్యాల్లాంటి అక్షరాలూ వెరసి సినిమాని ఒక లెవల్ కి తీసుకెళతాయి. త్రివిక్రమ్ సినిమాలకు వెండితెరమీద క్రేజ్ కన్నా బుల్లితెర మీద భారీ డిమాండ్ వుంది. త్రివిక్రమ్ నుండి వచ్చే సినిమాలు ఖచ్చితంగా కుటుంబంతో కలిసి కూర్చుని ఆస్వాదించే సినిమాలుగా వుంటాయని నమ్మకం ప్రతి ఒక్క ప్రేక్షకుడిలోనూ ఉంది. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ అతి నమ్మకంతో ఫ్రెంచ్ సినిమాకి ఫ్రీ మేక్ గా ఈ అజ్ఞాతవాసి సినిమాని పవన్ కళ్యాణ్ ని హీరోగా పెట్టి తీసాడు. సినిమాలో కథకు ఏ మాత్రం బలం లేకుండా సింగిల్ లైన్ తో సినిమాని హ్యాండిల్ చేసాడు త్రివిక్రమ్. అభిషిఖ్త్ భార్గవ్ పాత్ర చుట్టూతానే కథని అల్లాడు. కానీ మిగతా వారిని డమ్మీలను చేసాడు. అభిషిఖ్త్ భార్గవ్ సినిమాని ఒంటి చేత్తో నడిపించేలా చేసిన త్రివిక్రమ్, హీరోయిన్స్ ని ఈ సినిమాలో ఎందుకు పెట్టాడా అనిపిస్తుంది. కీర్తి సురేష్ ని అస్సలు ప్రాధాన్యం లేని పాత్రకి తీసుకుంటే... అను ఇమ్మాన్యువల్ తో అనవసర గ్లామర్ షో చేయించాడు. త్రివిక్రమ్ కూడా హీరోయిన్స్ ని గ్లామర్ గా వాడతాడా అనే ప్రశ్నకు సన్నాఫ్ సత్యమూర్తితో సమంత అప్పుడే అర్ధమయ్యింది అందరికి. తాను పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమాని అటు ఇటుగా మార్చి మార్చి ఈ అజ్ఞాతవాసిని తెరకెక్కించాడా అని ప్రేక్షకులు తలలు పట్టుకునే పరిస్థితి. కొన్నిచోట్ల త్రివిక్రమ్ మార్క్ కనబడినా ఈ సినిమా ఫ్రెంచ్ సినిమాకి ఫ్రీ మేక్ అని ఎప్పుడైతే ప్రేక్షకుడు మైండ్ లో పడిందో అప్పుడే సినిమా మీద ఉన్న క్రేజ్ ఆవిరయ్యింది. విలన్ గా ఆదిపినిశెట్టి ని ముందుగా భారీగా చూపించినా చివరికి వచ్చేటప్పటికీ డమ్మీని చేసెయ్యడం ప్రేక్షకుడు అంత త్వరగా జీర్ణించుకోలేడు. ఇక సీనియర్ నటీనటులను తీసుకున్నా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అత్తారింటికి దారేదిలో పవన్ పాత్రకి ఈక్వెల్ గా నటి నదియా పాత్రని తీర్చి దిద్దిన త్రివిక్రమ్... ఇక్కడ అజ్ఞాతవాసిలో మొదటినుండి చెబుతున్నట్టుగా ఖుష్బూ ఈ సినిమాకి కీలకమని... ఎక్కడా అటువంటి ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఖుష్బూ ని త్రివిక్రమ్ సరిగా వాడుకోవడంలో ఫెయిల్ య్యాడు. మిగతా నటీనటుల విషయంలోనూ త్రివిక్రమ్ రాంగ్ స్టెప్ వేసాడని చెప్పాలి. అలాగే త్రివిక్రమ్ సినిమాల్లో కామెడీకి కొదవుండదు అని ఈ సినిమాకి వెళితే మాత్రం ప్రేక్షకుడు బాగా డిస్పాయింట్ అవుతాడు. ఎందుకంటే ఈ సినిమాలో కామెడీకి అస్సలు ప్రాధాన్యత లేదు. తన స్నేహితుడి పవన్ కెరీర్ లో 25 వ సినిమాని జీవితకాలం గుర్తుండిపోయేలా తీర్చిదిద్దలనుకుని ఒక డిజాస్టర్ ని చేతిలో పెట్టాడా అనిపిస్తుంది. ఇక అజ్ఞాతవాసి మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో తప్ప.. త్రివిక్రమ్ మార్క్ ఎక్కడా కనిపించని ఫిల్మ్ గా మిగిలిపోతుంది.
ప్లస్ పాయింట్స్: పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో, అను గ్లామర్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, రెండు పాటలు
మైనస్ పాయింట్స్: కథ, కథనం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, హీరోయిన్స్, విలన్, కామెడీ