కర్తవ్యం మూవీ రివ్యూ
నటీనటులు: నయనతార, వినోదిని, రామ చంద్రన్, సున లక్ష్మి తదితరులు
సంగీతం: జిబ్రాన్
నిర్మాత: కె.జె.ఆర్. స్టూడియోస్, నార్త్ స్టార్
దర్శకత్వం: గోపి నైనర్
తెలుగులో విజయశాంతి మెయిన్ లీడ్ లో వచ్చిన 'కర్తవ్యం' సినిమాతో విజయశాంతి లేడి సూపర్ స్టార్ అయ్యింది. ఆ సినిమాలో విజయశాంతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా తనకు ఎదురైన సవాళ్ళని ఎంతో కష్టపడి కాళ్ళు విరగ్గొట్టుకుని మరి ఎదుర్కొంది. ఈ సినిమాలో విజయశాంతి మెయిన్ లీడ్ అయితే వినోద్ కుమార్ సపోర్టింగ్ రోల్ లో నటించాడు. అయితే ఇప్పుడు ఇదే 'కర్తవ్యం' పేరుతొ ప్రస్తుతం లేడి సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమయ్యింది. తమిళంలో 'ఆరం' పేరుతొ తెరకెక్కి సూపర్ హిట్ అయినా ఈ సినిమాని తెలుగులో 'కర్తవ్యం' పేరుతొ విడుదల చేస్తున్నారు. నయనతారకి ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ ఎదురులేని క్రేజ్ ఉండడంతో 'ఆరం' సినిమాని తెలుగులోకి 'కర్తవ్యం' పేరుతొ డబ్ చేశారు. ఇక నయనతార గ్లామర్ కి గ్లామర్ నటనకు నటన..... ఇలా అన్ని విషయాల్లోనూ మంచి టాలెంట్ ఉంది. అందుకే హీరోల పక్కన హాట్ గాను, లేడి ఒరింటెడ్ పాత్రలకు సరిగ్గా సరిపోతుంది. నయనతారకు ఉన్నా డిమాండ్ ని క్యాష్ చేసుకోవాలని తెలుగు నిర్మాతలు ఈ 'కర్తవ్యం'ని తెలుగులోనూ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. మరి విజయశాంతికి 'కర్తవ్యం' సినిమా ఎంతటి విజయాన్ని తెచ్చిపెట్టిందో.. మరి ఈ 'కర్తవ్యం' నయనతారకి ఎలాంటి విజయాన్ని సొంతం చేసిందో సమీక్షలో తేలుకుందాం.
ఆంధ్రప్రదేశ్ ఎంతగా డెవలప్ అయినా ఇంకా ఇప్పటికి కొన్ని గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేక బాధపడుతున్న వారున్నారు.. ఆ గ్రామాల బాగు కోసం ఆ జిల్లా అధికారులు తమవంతు కృషి చేసినా ప్రభుత్వాలు వారికీ సరైన వసతులు కల్పించాలి. అలాగే.... నీళ్లా కోసం బోర్లు వెయ్యడం ఆ బోర్లా లో నీళ్లు రాకపోతే... వాటిని అలా వదిలెయ్యడం.. అంటే పూడ్చకుండా వదిలెయ్యడం... ఆ బోరు బావుల్లో చిన్న పిలల్లు ఆడుకుంటూ వెళ్లి పడిపోవడం... దానికోసం అధికారులు ఎంతో శ్రమటోడ్చి బోరు బావి నుండి పిల్లల్ని వెలికి తియ్యడానికి శాయశక్తులా కష్టపడడం, అలా ఎంతో శ్రమటోడ్చి బోరు బావి నుండి కొన్నిసార్లు ప్రాణమున్న పిల్లల్ని బయటికి తీస్తే... ఒక్కోసారి ప్రాణాలు లేకుండా ఉన్నా జీవచ్ఛవాలు లాంటి పిల్లల్ని బయటికి తీస్తుంటే ఆ తల్లి తండ్రులు పడే ఆవేదన లాంటివి నిత్యం కొకల్లులుగా మనం దేశం మొత్తం మీద వింటూనే వున్నాం. కేవలం వినడమే కాదు టెక్నాలజీ బాగా డెవెలెప్ అయిన ఈకాలంలొ మినిట్ మినిట్ అక్కడ జరిగే విషయాల్ని ఛానల్స్ లో లైవ్ లో ప్రసారం చేస్తున్నాయి టివి ఛానల్స్. అయితే ఇప్పుడు అచ్చంగా ఇలా నిత్య జీవితంలో జరిగిన కథనే కర్తవ్యం సినిమాగా మలిచాడు దర్శకుడు.
కథ:
ఇక కథలోకి వెళితే ఆంధ్రలోని నెల్లూరు జిల్లాల్లో ఒక పల్లెటూరిలో తాగడానికి కూడా నీళ్లు ఉండవు. అయితే ఆ జిల్లాకి కలెక్టర్ గా వచ్చిన మధువర్షిని (నయనతార) ఆ గ్రామానికి నీళ్లు తెప్పిస్తానని అక్కడ ప్రజలకు మాటిస్తుంది. రోజువారి కూలిపనులకు వెళ్లే వారిలో కొంతమంది తో పాటు బుల్లబ్బాయి(రామచంద్రన్), సుమతి(సున లక్ష్మీ) తమ పిల్లల్ని ఆడుకోవడానికి వదిలేస్తారు. అలా పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ పొలాల్లోకి వెళ్ళిపోతారు. అయితే సుమతి కూతురు ధన్సిక(మహాక్ష్మి) అక్కడ ఆడుకుంటూ నీళ్ల కోసం వేసిన బోరుబావిలో పడిపోతుంది. అయితే ఆ జిల్లా కలెక్టర్ మధువర్షిణి చిన్నారి ధన్సికను రక్షించడానికి శాయశక్తులా ప్రయతిస్తుంది. ఆమెను ఎలా అయినా కాపాడాలని తపన పడుతుంది. కానీ పాపను బయటకు తీసుకురావడానికి కావాల్సిన కనీస సదుపాయాలు, సాంకేతికత అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో తోచదు. ఈ క్రమంలో మధువర్షిణి చేసిన పని ఏమిటి? ఆ బోరు వేయించి మూయకుండా వదిలేసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంది? అసలు చివరికి ధన్సికని మధువర్షిణి ప్రాణాలతో బయటికి తీసుకురాగలిగిందా? అనేది మిగతా కథ.
నటీనటుల నటన:
ఇప్పటికే తన పెరఫార్మెన్సు తో టాప్ నటిగా మారిన నయనతార మరోమారు తన నట విశ్వరూపాన్ని చూపించింది. బాధ్యతగల కలెక్టర్ గా మధువర్షిణి పాత్రలో నయనతార మరో మెట్టు ఎక్కింది. ఒక చిన్నారి పాపను బోరు బావి నుండి కాపాడడానికి ఒక ప్రభుత్వ ఆఫీసర్ ఎంత చెయ్యాలో అంత చేసి ఎమోషనల్ గా ఆకట్టుకుంది. కర్తవ్యం సినిమా ని నయనతార ఒంటి చేత్తో క్యారీ చేసింది. కలెక్టర్ గా నయనతార సారీ లుక్ లో చాలా చక్కగా ఆకట్టుకుంది. కలెక్టర్ గా ఒక పక్క హుందా తనాన్ని ప్రదర్శిస్తూనే మరోపక్క ఒక సగటు మనిషిలా చిన్నారిని కాపాడే క్రమంలో తీసుకున్న నిర్ణయాలు, తెగువలాంటివి సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి. ఇక నయనతార నటన క్లైమాక్స్ లో పీక్స్ వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమాలో సుమతిగా నటించిన సున లక్ష్మి కూలిపనులు చేసుకుంటూ తన పిల్లల్ని ఎంతో ప్రేమించే అమ్మగా నటించింది. అలాగే బావిలోకి జారిపోయిన తన కూతుర్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున రోదిస్తూ అందరి మనసులని కలిచివేసేలా చేసిన నటన కూడా అద్భుతమని చెప్పాలి. ఇక ధన్సిక తండ్రిగా రామచంద్రన్ కూడా చాలా చక్కటి ప్రదర్శన చేసాడు. మిగతావారు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
సినిమా అంటే కేవలం నాలుగైదు పాటలు, హీరోహీరోయిన్స్ మధ్య రొమాన్స్, అలాగే యాక్షన్ అని భావించే చాలా మందికి కర్తవ్యం సినిమాతో దర్శకుడు ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు. మనం టీవీ ల్లో పేపర్స్ లో చూసే ఒక సంఘటనని కళ్ళకు కట్టినట్టుగా... ఎమోషనల్ గా చూపించాడు. తమిళ నేటివిటీకి దగ్గరగా ఉన్నాకూడా సినిమా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. కథనే ప్రధానంగా తీసుకొని సమాజంలో ఉన్న ఒక సమస్యను కళ్ళ ముందు ఆవిష్కరించి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ కథలో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటూనే రాజకీయాలపై ఒక గట్టి సెటైర్ ఉంటుంది. అసలు ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి, అలాగే అధికారులు ఎలా పని చేస్తున్నారు, అసలు ఎన్ని ఊర్లకి ప్రభుత్వం నుంచి అన్ని వసతులు అందుతున్నాయి. ఎన్ని ఊర్లు నీళ్ళు లేకుండా అలమటిస్తున్నాయి అనే విషయాలు చెప్పి చెప్పకనే చెప్పాడు దర్శకుడు. బీద, బడుగు వర్గాలకు చెందిన వారి జీవితాల్లో ఉండే సమస్యలను మాత్రమే కాకుండా వారి మధ్య ఉండే బంధాలు, ఆప్యాయతలను చూపిస్తూ తెరపై దర్శకుడు కథను నడిపించిన విధానం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. సినిమా చూసే ఏ ఒక్క ప్రేక్షకుడు కూడా కంటతడి పెట్టకుండా ఉండలేడు. అంతగా ప్రభావం చూపించింది. ఒక చోట జరిగే సంఘటనను తీసుకొని రెండు గంటల సేపు అదే విషయాన్ని ప్రేక్షకుల చూపు మరల్చకుండా నడిపించడమనేది మామూలు విషయం కాదు. అది దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఈ విషయంలో ఆయనను కచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే.
ఇక దర్శకుడు కథను ఎలా చూపించాలనుకున్నాడో సినిమాటోగ్రాఫర్ కూడా అలానే ప్రెజెంట్ చేసాడు. ఓం ప్రకాష్ కెమెరా వర్క్ సినిమాకు పెద్ద ప్లస్ అనే చెప్పాలి. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు తగ్గట్లుగా ఉన్నాయి.బ్యాగ్రౌండ్ స్కోర్ టోన్ సంగీతంతో ఎమోషన్ ను పండించాడు. సినిమా మొత్తం కూడా ఎమోషన్ క్యారీ చేయడంలో జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. ఎడిటింగ్ వర్క్, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్: నయనతార నటన, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్
మైనస్ పాయింట్స్: కమర్షియల్ ఎలెమెంట్స్ లేకపోవడం, కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవడం
రేటింగ్: 3.0 /5