Mon Nov 25 2024 16:36:01 GMT+0000 (Coordinated Universal Time)
కాటమరాయుడు: రివ్యూ 2
కాటమరాయుడు
నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్
నటీ నటులు: పవన్ కళ్యాణ్., శృతి హాసన్., నాజర్., అలీ., పృథ్వీరాజ్., ప్రదీప్ రావత్, అజయ్.,శివబాలాజీ., చైతన్య, రావు రమేష్ తదితరులు
దర్శకుడు: కిషోర్ కుమార్ పార్ధసాని
నిర్మాత: శరత్ మరార్
ఇదీ కథ
పవన్ కళ్యాణ్ శృతి హాసన్ జంటగా నటించిన కాటమరాయుడు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊళ్లో అందరికి పెద్ద దిక్కులా ఉండే కాటమరాయుడుకు నలుగురు తమ్ముళ్లు.... చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన రాయుడు టీ కొట్లో పనిచేస్తూ ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. తనలా అనాథలుగా ఉన్న వారిని చేరదీసి పెంచి పెద్దచేస్తాడు. వ్యవసాయం., వ్యాపారాలతో పాటు గ్రామంలో జరిగే అన్యాయాలను అడ్డుకుంటూ అందరికి చేరువవుతాడు. రాయుడి అనుమతి లేకుండా చుట్టుపక్కల ఎలాంటి అక్రమ వ్యాపారాలు చేయలేని పరిస్థితుల్లో ఎర్రచందనం అమ్మకాలకు సహకరించాలంటూ ప్రదీప్ రావత్ తన తమ్ముడితో కలిసి రాయుడిని బెదిరిస్తాడు. అడవులు., వ్యవసాయం., గ్రామాలను నాశనం చేసే వ్యాపారాలను తాను అడ్డుకుంటానంటూ రాయుడు వాళ్లకు దేహశుద్ధి చేస్తాడు.
రాయుడుతో పాటు ఉండే వకీల్ లింగం(అలీ)ను ప్రియురాలు పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతో రాయుడుకు పెళ్లి కాకుండా తాను పెళ్లి చేసుకోలేనని తేల్చి చెబుతాడు. చివరకు ఆమెతో లేచిపోయే ప్రయత్నాల్లో ఉండగా రాయుడి తమ్ముళ్లలో ఒకరు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒకరి నుంచి మరొకరు తప్పించుకునే క్రమంలో రాయుడి తమ్ముళ్లలో అజయ్ మినహా చైతన్య., శివబాలాజీ కూడా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు బయటపడుతుంది. అయితే ఆడవారిని ఆమడ దూరం ఉంచే రాయుడిని కాదని పెళ్లి చేసుకునే ధైర్యం లేక అతడిని కూడా ప్రేమలోకి దించాలని నిర్ణయిస్తారు. ఇందుకు చైతన్య ప్రియురాలి స్నేహితురాలు మహాలక్ష్మీ(శృతిహాసన్)ను ఎంపిక చేస్తారు. సంగీతం అంటే పడిచచ్చే రాయుడి దృష్టిలో శృతిహాసన్ పడేలా చేసి ఇద్దరిని దగ్గరయ్యేలా చేస్తారు. రాయుడు సాత్వికుడు., సున్నిత మనస్కుడు అని ఆమెను మభ్యపెడతారు. మొదట్లో ఆమె ప్రేమను నిరాకరించినా తర్వాత శృతిహాసన్ తల్లిదండ్రులతో పెళ్లి సంబంధం మాట్లాడేందుకు ఒప్పుకుంటాడు. అదే సమయంలో రాయుడి చేతిలో భంగపడ్డ రావు రమేష్., ప్రదీప్ రావత్‌తో చేతులు కలిపి రాయుడి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేస్తాడు. అయితే అది ముందే తెలుసుకున్న రాయుడు ప్రత్యర్ధుల పన్నాగాన్ని విఫలం చేస్తాడు. ప్రియురాలి కుటుంబాన్ని పెళ్లికి ఒప్పించే క్రమంలో మరోసారి రాయుడిపై అటాక్ జరుగుతుంది. రాయుడు ఒంటి చేత్తో విలన్లందర్ని ఇరగదీసినా., అతడి అసలు స్వరూపం తెలిసి ప్రియురాలు దూరమైపోతుంది.
ఆమెను పెళ్లికి ఎలాగైనా ఒప్పించాలనుకుని వాళ్ల ఊరు బయల్దేరి వెళ్లిన క్రమంలో శృతి తండ్రి నాజర్‌తో రాయుడుకు పరిచయం ఏర్పడుతుంది. రాయుడిపై సదాభిప్రాయం కలగడంతో అతడిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. కూతురు ప్రేమిస్తున్న వ్యక్తి అతనే అని తెలిసినా తెలియనట్లే నటిస్తాడు. శృతిహాసన్‌కు గొడవలు., పగలకు దూరంగా ఉంటానని మాట ఇవ్వడంతో ఆమె పెళ్లికి అంగీకరిస్తుంది. ఆ తర్వాత కూడా ప్రత్యర్ధుల దాడులు., రాయుడు వారి ఆటకట్టించడం సాగుతుంటాయి. చివరకు దాడులు చేస్తోంది రాయుడి కోసం కాదని., నాజర్ కుటుంబాన్ని అంతమొదించడానికి జైల్లో ఉన్న భాను పన్నిన కుట్రలని రాయుడికి తెలుస్తుంది. నాజర్ తీర్పుతో భాను తండ్రి కోర్టులోనే ఆత్మహత్య చేసుకోవడంతో నాజర్ కుటుంబంపై పగ తీర్చుకునేందుకు దాడులు చేయిస్తుంటాడు. అయితే రాయుడు పాత పద్ధతులు మార్చుకోలేదనుకున్న నాజర్ అతడితో పెళ్లికి నిరాకరిస్తాడు. చివరకు తన కుటుంబాన్ని కాపాడేందుకు రాయుడు కత్తి పట్టాడని తెలియడంతో కథ సుఖాంతం అవుతుంది.
అంచనాలు అందుకుందా ?
భారీ అంచనాల మధ్య విడుదలైన కాటమరాయుడు అభిమానులు ఆశించిన స్థాయిలో వినోదాన్ని పంచలేకపోయింది. వరుస ఫైట్లు., కథనంలో సాగతీత ధోరణి ప్రేక్షకుల్ని విసిగిస్తాయి. శృతి గ్లామర్., పవన్ న్లూ లుక్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. రీమేక్ సినిమా అయినా తెలుగుప్రేక్షకులకు తగ్గట్లుగా కథను మలిచి ఉంటే బాగుండేది. రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలు సినిమా మొత్తంలో ఒక్కటి కూడా కనిపించవు. పగ ప్రతీకారాల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఫ్యాక్షన్ గొడవల్ని అడ్డుకునే క్రమంలో హీరోని కట్టడి చేసే మిర్చి సినిమా కొన్ని సన్నివేశాల్లో గుర్తుకు వస్తుంది. ఇక శృతి హాసన్ గ్లామర్‌గా స్క్రీన్‌పై చూపడంలో దర్శకుడు సక్సెస్ సాధించాడు. ఫైట్లు ఎక్కువవడం కూడా కథకు లోపంగా మారింది. దానికంటే కథను మరింత బలంగా., ప్రేక్షకుల్ని హత్తుకునేలా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. అనూప్ రూబెన్స్ సంగీతం కథను బట్టి సాగిపోతుంది. అలీ., రావు రమేష్., పృథ్వీల పాత్రలు కాస్త హాస్యాన్ని పండిస్తాయి.
మొత్తంమీద ఉగాది వినోదాన్ని వారం ముందే తీసుకువచ్చిన కాటమరాయుడు కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా నిలిచిపోతుంది.
రేటింగ్ 3/5
Next Story