గాయత్రీ మూవీ రివ్యూ
బ్యానర్: లక్ష్మి ప్రసన్న పిక్చర్స్
నటీనటులు: మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, శ్రియా, నిఖిలా విమల్, అనసూయ, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సినిమాటోగ్రాఫర్: సర్వేశ్ మురారి
నిర్మాత: మోహన్ బాబు
దర్శకత్వం: మదన్ రామిగాని
విలక్షణ నటుడు మోహన్ బాబు హీరోగా విలన్ గా నటించి కొన్నేళ్లు దాటిపోయింది. ఒకప్పుడు మంచు మోహన్ బాబు విలనిజాన్ని, హీరోయిజాన్ని, డైలాగ్ చెప్పే విధానాన్ని చూసిన అభిమానులు ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో ఆయన నటనకు మొహం వాచిపోయి ఉన్నారు. ఏదో రౌడీ, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాల్లో మోహన్ బాబు నటించినా అందులో మోహన్ బాబు నట విశ్వరూపాన్ని చూడలేకపోయారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు తానే హీరో, తానే విలన్ గా గాయత్రీ అనే సినిమాని తన నిర్మాణంలోనే మదన్ రామిగాని అనే దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కించాడు. మొదటినుండి హీరో, విలన్ మోహన్ బాబు అని ప్రచారం జరగడం, మంచు విష్ణు, శ్రియ శరన్ లు ఈ సినిమాలో మెరవడం వంటి విషయాలతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రోమోస్ తోనూ ట్రైలర్ తోనూ సినిమాపై ఆసక్తిని పెంచేసిన గాయత్రీ సినిమాతో మోహన్ బాబు హీరోగా, విలన్ గా నిర్మాతగా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకున్నాడో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
దాసరి శివాజీ (మోహన్ బాబు) చిన్నప్పుడు తప్పిపోయిన తన కూతురు గాయత్రీ(నిఖిలా విమల్) కోసం 25 ఏళ్లుగా వెతుకుతూనే ఉంటాడు. కేవలం కూతురు కోసమే జీవిస్తున్న శివాజీ స్టేజ్ ఆర్టిస్ట్ గా మోసాలు చేస్తూ, చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడో తప్పిపోయిన గాయత్రీ గురించిన సమాచారం శివాజీకి తెలుస్తుంది. కూతురుని కలుసుకోవడానికి ఎంతో ఆతృతగా బయలు దేరిన దాసరి శివాజీని, గాయత్రీ పటేల్ కిడ్నాప్ చేస్తాడు. అసలు ఈ గాయత్రి పటేల్ ఎవరు? ఫ్లాష్ బ్యాక్ లో తన భార్య శారద (శ్రీయ )కు శివాజీ (మంచు విష్ణు) ఎందుకు దూరమయ్యాడు? శివాజీ కూతురు ఎలా తప్పిపోయింది? గాయత్రీ పటేల్ కి శివాజీకి ఉన్న శత్రుత్వం ఏమిటి? అలాగే గాయత్రీ పటేల్ చెర నుండి శివాజీ తప్పించుకుని కూతురిని కలుస్తాడా? అనేది మిగతా కథ.
నటీనటులు
ఈ సినిమాతో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా రోజుల తరువాత తన నట విశ్వరూపాన్ని చూపించాడు. మోహన్ బాబు రెండు రోల్స్ లో అదరగొట్టాడు. సినిమాని మొత్తం మోహన్ బాబు ఒంటి చేత్తో మోసాడనే ఫీలింగ్ ప్రతి సీన్ లోను వస్తుంది. ఒక వైపు దాసరి శివాజీ అంటూ మంచి గా నటిస్తూనే, మరో వైపు గాయత్రీ పటేల్ గా క్రూరత్వాన్ని తెర మీద భయం కలిగించాడు. మోహన్ బాబు తన వయసుకు, ఇమేజ్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథను ఎంచుకొని రెండు పాత్రలతో పలు రకాల షేడ్స్‌తో మోహన్‌బాబు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఇకపోతే మోహన్ బాబు ఒక పాత్ర అయినా దాసరి శివాజీ యవ్వనములో ఉన్న పాత్రని మంచు విష్ణు నటించాడు. విష్ణు ఏదో ఒక గెస్ట్ రోల్ లోనే కనబడ్డాడు. ఇక మంచి విష్ణు భార్య పాత్రలో శ్రియ శరన్ మెప్పించింది. ఉన్నకాసేపు బాగానే ఆకట్టుకుంది. అసలు విష్ణు పాత్రని శ్రియ డ్యామినేట్ చేసిందా అనిపిస్తుంది. అసలు ఆమె పాత్ర పరిధి చాలా తక్కువైనప్పటికీ కళ్లతో భావాలను అద్బుతంగా పలికించింది. ఇక హాట్ యాంకర్ అనసూయ శ్రేష్ణ అనే జర్నలిస్టు పాత్రలో బాగానే మెప్పించింది. బ్రహ్మానందం, సత్యం రాజేష్, నాగినీడు,పోసాని కృష్ణ మురళి తమపరిధిమేర ఆకట్టుకున్నాడు.
సాంకేతిక వర్గం పనితీరు:
గాయత్రీ సినిమాకి డైలాగ్స్ అందించిన డైమండ్ రత్నం బాబు అద్భుతమైన పవర్ ఫుల్ డైలాగ్స్ ని అందించాడు. మోహన్ బాబు నోటివెంట ఆ డైలాగ్స్ పేలుతుంటే ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ ని దంచేసే ఎస్ ఎస్ థమన్ ఈసినిమా కోసం ఎప్పటిలాగే సో సో మ్యూజిక్ ని ఇచ్చేసి ఆకట్టుకోలేకపోయాడు. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బావుంది. మోహన్ బాబు గాయత్రీ పటేల్ పాత్రలో పవర్ ఫుల్ డైలాగ్స్ చేప్పేటప్పుడు థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్స్ ని బాగా హైలెట్ చేశాయి. పాటలు సో సోగానే ఉన్నాయి. ఇక సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చింది. మోహన్ బాబు నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.
విశ్లేషణ: మోహన్ బాబు నుండి సినిమా వస్తుంది అనగానే... ఆయన నటన విశ్వరూపాన్ని, డైలాగ్ కింగ్ అనే పేరుకు తగ్గట్టుగా పలికే డైలాగ్స్ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ప్రేక్షకుల అంచనాలకు దర్శకుడు మదన్ రీచ్ కాలేకపోయాడనే చెప్పాలి. కథ బావున్నా దాన్ని కథనంగా మలచడంలో మదన్ పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. ప్రస్తుత జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాని మలచలేక చేతులెత్తేశాడు. కథ బావున్నా స్క్రీన్ ప్లే విషయంలోనూ దర్శకుడు మదన్ ఫెయిల్ అయ్యాడు. కూతురు కోసం ఒక తండ్రి పడే ఆవేదన ఎలా ఉంటుందో మోహన్ బాబు ఫెస్ ఎక్సప్రెషన్స్ తోనూ, ఎమోషన్స్ తోనూ అదరగొట్టాడు. అలాగే మోహన్ బాబు విలన్ పాత్రని బలంగా చూపెట్టడంలో మాత్రం దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని అవసరం లేని సీన్స్ ని తీసేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇక డైమండ్ రత్న బాబు నుంచి కూడా మంచి మంచి డైలాగ్స్ ని రాబట్టుకున్నాడు మదన్. ఇక కామెడీ కూడా ఈ జెనరేషన్ కి తగ్గట్టుగా లేదు. అంతా అవుట్ డేటెడ్ గా ఉంది. పాతవాసన కొడుతున్న బ్రహ్మనందం, అలీ ల కామెడీ చిరాకు తెప్పించడమేకాదు.... విసుగు పుట్టించింది.
పాజిటివ్ పాయింట్స్: మోహన్ బాబు ద్విపాత్రాభినయం, ప్రీ క్లైమాక్స్, శ్రియ శరన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
నెగటివ్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్, ఐటెం సాంగ్, రొటీన్ సీన్స్, కథ, పాటలు
రేటింగ్: 2.5/5