గృహం మూవీ రివ్యూ
ప్రొడక్షన్ సంస్థ: వాయోకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఇటాకి ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: సిద్ధార్థ్, ఆండ్రియా, అతుల్ కులకర్ణి, అనీష్ తదితరులు.
సంగీత దర్శకుడు: గిరీష్
నిర్మాత: సిద్దార్ధ్
దర్శకత్వం: మిలింద్
నువ్వొస్తానంటే నేనొద్దంటానా లో సంథింగ్ సంథింగ్ అంటూ హీరోయిన్ త్రిషని ఆటపట్టిస్తూ... ఆమె ప్రేమకోసం వ్యవసాయం చేసే కుర్రాడి పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సిద్దార్థ... బొమ్మరిల్లు సినిమాలో తండ్రి కనుసన్నల్లో పెరిగిన కొడుకుగా... వీలయితే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ... అంటూ జెనీలియాతో.. ప్రేమ కబుర్లు చెబుతూ.. తన ప్రేమను దక్కించుకోవడానికి.. ఆ అమ్మాయిని తన ఇంట్లోనే తనకుటుంబ సభ్యుల మధ్యన పెట్టడం.. ఆ తర్వాత ఆ అమ్మాయితో పెళ్లి కోసం ఎన్ని అగచాట్లు పడాలో అన్ని అగచాట్లు పడే కుర్రాడి పాత్రలో సిద్దు నటన సూపర్. ఆచిత్రాల తర్వాత కి విపరీతమై ఫాలోయింగ్ వచ్చేసింది. కాకపోతే ఆ సినిమాల తర్వాత సిద్దార్ధ్ కి మళ్ళీ అలాంటి ఓ.. అనుకునేంత చిత్రం పడలేదు. అప్పటినుండి మధ్య మధ్యలో కొన్ని యావరేజ్ చిత్రాలు చేసుకుంటూ.. కొన్నాళ్లపాటు తెలుగుకు దూరమై తమిళంలో కాలం గడిపిన సిద్ధార్థ్ మళ్లీ ఇన్నాళ్లకు తానే నిర్మతగా.. తానే హీరోగా గృహం అనే హర్రర్ చిత్రాన్ని తమిళంలో మిలింద్ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఈ చిత్రం మొత్తం సిద్దార్ధ్ మీదే నడుస్తుంది. బ్రెయిన్ సర్జన్ గా సిద్దు గృహంలో సినిమాలో కనిపించాడు. అయితే తమిళంలో ఎప్పుడో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాని నేడు శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు సిద్దార్ధ్. నటి ఆండ్రియాతో కలిసి అక్కడ హిట్ అందుకున్న సిద్ధుకి ఇక్కడి తెలుగు రెక్షకులు ఎలాంటి విజయాన్ని సొంతం చేశారో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
క్రిష్(సిద్దార్థ్) అనే ఒక బ్రెయిన్ సర్జెరీ స్పెషలిస్ట్ తన భార్య (లక్ష్మి) తో కలిసి హిమాలయాస్ దగ్గర ఉన్న ఒక ఊళ్లో నివసిస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఇంట్లోకి పాల్ (అతుల్ కులకర్ణి) అనే ఒక వ్యాపారవేత్త యొక్క కుటుంబం వచ్చి ఉంటారు. వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇంట్లో అన్ని వింతగా జరగడం మొదలవుతుంది. ఆ తరువాత పాల్ మొదటి భార్య కూతురు అయిన జెన్ని (అనిశా విక్టర్) వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే జెన్ని అలా వింతగా చేయడం కేవలం ఒక జబ్బు అని భావించిన క్రిష్ తన చీఫ్ డాక్టర్ (సురేష్) తో కలిసి జెన్ని కి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకుంటారు. కాని అది జబ్బు ఎఫెక్ట్ కాదు ఆ ఇంట్లోనే ఏదో ఉంది. జెన్ని ఒంట్లో కూడా ఏదో ఉంది అని గ్రహించిన క్రిష్ ఆ సమస్యకు పరిష్కారం కనుకుంటానికి ట్రై చేస్తాడు. అందులో భాగంగానే క్రిష్ కి తన భార్య కు అనేక సమస్యలు ఎదురవుతాయి. అసలు పౌల్ కుటుంబం వలన కృష్ణ, లక్ష్మిలకు ఎలాంటి సమస్యలు వస్తాయి? అసలు పౌల్ కుటుంబ కథ ఏమిటి? వారు పక్కింట్లోకి దిగినాకే ఇలాంటి సంఘటనలు ఎందుకు ఎదురవుతాయి? ఈ సంఘటనల నుండి కృష్ణ, లక్ష్మిలు ఎలా సేవ్ అయ్యారు? అనేదే గృహం కథ. ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమాని వెండితెర మీద వీక్షించాల్సిందే.
నటీనటుల నటన:
ఇప్పటి వరకు ప్రేమ కథలు, క్రైమ్ కామెడీ కథలు చేసిన సిద్దార్థ్ కి ఇది ఒక మంచి కథ అని చెప్పొచ్చు. ఎందుకంటే సిద్దార్థ్ కి ఇటువంటి కంప్లీట్ హారర్ ఫిలిం ఎప్పుడు రాలేదు. కృష్ణ పాత్రలో సిద్దార్ద్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. పాత్రకు తగ్గట్టు నటించి మెప్పించాడు. కృష్ణ పాత్రతో సిద్దు సినిమాకే హైలెట్ అయ్యాడు. డాక్టర్ పాత్రకు తగ్గట్లే బాడీ లాంగ్వేజ్ ను చూపించి మెప్పించాడు. ఆకట్టుకునే డైలాగ్స్ తో అదరగొట్టాడు. మంచి డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ కోసం అయితే సిద్దార్థ్ ఎక్కువగా కష్టపడ్డాడు అనే చెప్పొచ్చు. ఇక హీరోయిన్ ఆండ్రియా విషయానికొస్తే ఆమెకు నటనలో పెద్దగా స్కోప్ లేని పాత్ర దక్కింది. అయినా ఉన్నంతలో అందంగా. గ్లామర్ గా ఆకట్టుకుంది. గ్లామర్ విషయంలో ఆండ్రియాకి నూటికి నూరు శాతం మార్కులు పడతాయి. జెన్ని పాత్రలో అనిశా మాత్రం సిద్దు కి పోటి గా తన నట విశ్వరూపాన్ని చూపించింది. కూతురిని ఫ్యామిలీ ని కాపాడుకోవాలి అనే పాత్రలో అతుల్ కులకర్ణి చక్కగా ఒదిగిపోయాడు. అనీష్ తదితరులు ఉన్నంతలో మెప్పించారు. మిగతావారు కూడా తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
దర్శకత్వం:
ఒక విభిన్నమైన హర్రర్ కథను ఎంచుకుని దర్శకుడు మిలింద్ సగం సక్సెస్ అయ్యాడు. ఆ కథను చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. సినిమాలోని కొన్ని హర్రర్ సన్నివేశాలు కెమెరా యాంగిల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోనే అదరగొట్టేశాయి. సినిమా మొత్తం అదిరిపోయే గ్రిప్పింగ్ తో స్క్రీన్ ప్లే ని దర్శకుడు మలిచాడు. ఈ స్క్రీన్ ప్లే కూడా హాలీవుడ్ సినిమాలను తలపించేసింది. దర్శకుడు ఈ సినిమాని హాలీవుడ్ హర్రర్ రేంజ్ లో తెరకెక్కించాడు . సినిమా చూస్తున్నంత సేపు హాలీవుడ్ హర్రర్ సినిమాని చూస్తున్నామా అనే ఫీలింగ్ తెప్పించాడు. అంతేకాకూండా హీరో, హీరోయిన్స్ మధ్యన రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక హర్రర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుడికి మాత్రం ఈ సినిమా భీభత్సంగా నచ్చుతుంది. కృష్ణ పాత్రని దర్శకుడు మలిచిన తీరు అద్భుతం. అలాగే సిద్దర్ద్ కి కూడా చాలాకాలానికి మిలింద్ ఒక హిట్ సినిమాని అందించాడు.
సాంకేతికంగా:
గృహం సినిమాకి ఆయువుపట్టు బ్యాగ్రౌండ్ స్కోర్. గిరీష్ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. పలు సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోరు సినిమా స్థాయిని పెంచేదిగా వుంది. హాలీవుడ్ హారర్ సినిమాలను తలపించేస్తుంది గృహం బ్యాగ్రౌండ్ స్కోర్ అనేలా వుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా గృహం సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. పలు హర్రర్ సన్నివేశాల్లో సినిమాటోగ్రఫీ పని అద్భుతం. హాలీవుడ్ రేంజ్లో సినిమాటోగ్రఫీ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎడిటింగ్ పర్లేదుగాని... సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని ఎడిట్ చేస్తే మరింతగా బావుండేది. అలాగే దర్శకుడు ఇంకాస్త కమర్షియల్ ఎలెమెంట్స్ మీద దృష్టి పెట్టినట్లయితే ఒక బ్లాక్ బస్టర్ ని అందుకునేవారు. ఇక సిద్దార్థ్ పెట్టిన పెట్టుబడికి రెండింతలు లాభం రావడం ఖాయం. నిర్మాణ విలువలకు వంక పెట్టడానికి లేదు.
ప్లస్ పాయింట్స్: సిద్దార్ధ్, ఆండ్రియాల రొమాన్స్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, హర్రర్ సీన్స్.
మైనస్ పాయింట్స్: స్లో నేరేషన్, రొటీన్ హర్రర్ స్టోరీ, కమర్షియల్ ఎలెమెంట్స్ లేకపోవడం.
రేటింగ్: 3 .0 /5
- Tags
- గృహం