గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ - 2
నటీనటులు : నందమూరి బాల కృష్ణ, శ్రియ శరన్, హేమ మాలిని, కబీర్ బేడీ, శివ రాజ్ కుమార్ తదితరులు.
నిర్మాణ సంస్థ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం : చిరంతన్ భట్
ఛాయాగ్రహణం : జ్ఞాన శేఖర్
కూర్పు : సూరజ్ జగ్తాప్, రామ కృష్ణ ఎర్రం
రచన : సాయి మాధవ్ బొర్రా
సాహిత్యం : సిరివెన్నెల సీత రామ శాస్త్రి
నిర్మాతలు : రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి, సుహాసిని పంగులూరి
కథ, కథనం, దర్శకత్వం : జాగర్లమూడి రాధ కృష్ణ(క్రిష్)
గౌతమీపుత్ర శాతకర్ణి : తెలుగు చిత్ర పరిశ్రమ లో నేటి తరం కథానాయకులలో పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం అని తేడా లేకుండా ఎటువంటి పాత్రలైనా పోషించగల అతి అరుదైన నటులలో మేటి నటుడిగా పేరు ప్రఖ్యాతలు వున్నసీనియర్ కథానాయకుడు నందమూరి బాల కృష్ణ. చేసిన నాలుగు తెలుగు చిత్రాలతో మానవీయ సంబంధాలను తట్టిలేపే కథలతో ప్రతి చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తో పాటు గొప్ప గౌరవాన్ని మూటకట్టుకుంటున్న దర్శకుడు క్రిష్. వీరి కలయిక లో బాలయ్య 100 వ చిత్రంగా క్రిష్ తన బాల్యంలో చూచాయగా విన్న ఒక యోధుడు కథని క్షుణంగా పరిశీలించి మనవాళ్లకు తెలియని చరిత్రను వెండితెర పై ఆవిష్కరించిన చిత్రమే గౌతమీ పుత్ర శాతకర్ణి. బాల కృష్ణ తన 99 చిత్రాల అనుభవాన్ని, శక్తిని కూడగట్టుకుని చేసిన శతాబ్దాల నాటి చారిత్రామిక పాత్ర శాతకర్ణి. బాలయ్య 100 వ చిత్రం కావటం, జాతి గర్వించదగ్గ కథ అయినప్పటికీ ఎవరికీ తెలియని కథ కావటం, బాలయ్య ట్రాక్ రికార్డు వసూళ్లకి మించి ఖర్చు చేయటానికి నిర్మాతలు తెగించటం ఈ చిత్రం పై భారీగా అంచనాలను పెంచేశాయి. మరి నేటి వరకు గొప్ప చిత్రాలను తప్ప కమర్షియల్ సక్సెస్ లను ఖాతాలో వేసుకొని క్రిష్ ఇప్పుడు బాలయ్య చిత్రంతో ఆ రికార్డు సాధించగలరా? పూర్తి సమీక్షలోకి వెళ్లి పరిశీలిద్దాం పదండి.
కథ : శాతకర్ణి(నందమూరి బాల కృష్ణ) తండ్రి ని శాతకర్ణి పసి వయసులోనే యుద్ధం బలి తీసుకుంటుంది. నాటి నుంచి గౌతమీ మాత(హేమా మాలిని) పెంపకంలో ఏక రాజ్యంగా భారత నేల పాలితం కావాలని తల్లి ఒడిలో ఎదుగుతున్ననాటి నుంచే కళలు కనేవాడు శాతకర్ణి. ఆ పసివాడి కలలని సాకారం చేసుకునే విధంగానే పెంచి పెద్ద చేస్తుంది గౌతమీ మాత. ఆలా దక్షిణ భారత దేశంలో ఒక్క కళ్యాణ దుర్గం తప్ప మిగిలిన రాజ్యాల రాజులు శాతకర్ణి వీరత్వానికి తల దించి శాతకర్ణి మహా రాజు పాలనలో ప్రతినిధులుగా సుపరిపాలన అందిస్తుంటారు. దక్షిణ భారతం లో శాతకర్ణి తిరుగులేని విజయ పతాకం ఎగురవేయటానికి నాంది పలుకుతూ కళ్యాణ దుర్గం రాజా కుటుంబీకులు, శాతకర్ణి సమ్మతి పత్రాన్ని ఆమోదించక రణము నకు సిద్దపడి, తలపడి ఓడిపోతారు. ఆ గెలుపుతో యావత్ దక్షిణ భారతంలో శాతకర్ణి తప్ప మరే ఇతర రాజు ఉండడు. శాతకర్ణి శ్రీమతి వసిష్ఠ(శ్రియా శరన్) తమ వివాహ దినం నాడు తన ఇద్దరు సంతానాన్ని తీసుకుని అమరావతి నుంచి కళ్యాణ దుర్గం చేరుకున్నప్పుడు, వసిష్ఠ కి తెలియవచ్చే వాస్తవం తన బిడ్డను శత్రు సైన్యాన్ని జయించటానికి ఇచ్చిన మాట ప్రకారం ఉత్తర దేశ రాజ్య కాంక్ష తో శాతకర్ణి యుద్ధ బరిలో అర్పించనున్నారని. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని వసిష్ఠ తన బిడ్డను పంపకుండా రాజాజ్ఞ ను ఉల్లంఘించిందా? సొంత బిడ్డను పణంగా పెట్టి యుద్ధం కి బయల్దేరిన శాతకర్ణి వ్యూహం ఏమిటి? ఉత్తర దేశాన గ్రీకు దేశస్థుల ఆధిపత్యాన్ని అంతిమంగా జయించి విజయ పతాకం ఎగురవేసిన శాతకర్ణి ప్రస్తానం ఎలా మలుపు తిరిగింది? అనేది ఎవరైనా వినటం, చదవటం కన్నా చూస్తేనే బావుంటుంది.
పని తీరు : నందమూరి బాల కృష్ణ అన్ని రకాల పాత్రలని పోషించిన దిట్ట. ఆయన చారిత్రక వీరుడు, తెలుగు జాతికి గర్వకారణమైన యోధుడు శాతకర్ణి మహా రాజు పాత్ర పోషిస్తున్నాడు అన్నప్పటి నుంచి అంచనాలు తార స్థాయికి చేరిపోయాయి. బాలయ్య ఆ అంచనాలన్నీ దాటుకుని చరిత్రలో నూతన అధ్యయనానికి తెర లేపారు. ఆయన 99 చిత్రాల అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి అభినయ ప్రదర్శన చేసిన బాలయ్యకు ప్రశంసల తో పెట్టుబడికి పదింతలు రాబడి ఖాయం గా కనిపిస్తుంది. బాల కృష్ణ కు అర్ధాంగిగా నటించిన శ్రియా శరన్ అతి హుందా ఐన పాత్రలో చాలా ఉన్నతమైన నటనతో తన పాత్రని ఒక భావోద్వేగంతో ముడిపెడుతూ అందరిని ఆకట్టుకుంది. గౌతమీ పాత్రలో వీరుడికి జన్మనిచ్చి ఆ బిడ్డ ని దేశం లోని అన్ని ప్రాంతాలను ఒకే రాజ్యంగా ఏర్పరచగల మనోబలాన్ని, సంకల్పాన్ని నింపి పెంచి, శాతకర్ణి చేత అగ్ర తాంబూలం అందుకున్న పాత్రలో అత్యద్భుతంగా నటించింది హేమ మాలిని. ఇక తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్ వంటి పలువురు నటులు వారి వారి పాత్రల పరిధిని దాటకుండా కథ కి సహకరిస్తూ నటించారు. శివ రాజా కుమార్ ఒక అతిధి పాత్రలో శాతకర్ణి మహారాజు ప్రస్థానాన్ని హరి కథలా చెప్పే పాత్రలో కనిపించారు.
సాంకేతిక నిపుణులతో మొదటగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు చిరంతన్ భట్ గురించే. కంచె చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమై అదే చిత్రంతో శాస్త్రీయ సంగీతంలోని మెలకువలతో అత్యద్భుతమైన మెలోడీ పాటలు అందించిన చిరంతన్ భట్, గౌతమీపుత్ర శాతకర్ణి పాటలతో పాటు నేపధ్య సంగీతాన్ని అత్యద్భుతంగా అందించి ప్రతి యుద్ధ సన్నివేశాన్ని ప్రేక్షకుల మనసులలోకి చొచ్చుకెళ్లేందుకు సహకరించాడు. కథ చారిత్రక గాధ అయినప్పటికీ చరిత్రలో శాతకర్ణి రాజు గురించిన వివరాలు చాలా తక్కువ అందుబాటులో ఉండటంతో, కథకి కావలసినన్ని అంశాలను ఊహాగానంతో కూడిన నాటకీయతను జోడించడం వలన కథ, కథనం కూడా క్రిష్ పేరు వేసుకోవటం సమంజసమే. అయితే కథ లో నాటకీయత పెరిగినప్పటికీ అన్ని సమపాళ్లలో వడ్డించటం వలన చారిత్రక కథ అనే అనుభూతి నుంచి ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా బైటకి రాలేదు. కథనం పరంగా ప్రథమార్ధం అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా చిత్రం తీర్చిదిద్దిన క్రిష్, ద్వితీయార్ధాన్ని ఒక వర్గం ప్రేక్షకులనుంచి కొద్దిగా దూరంగా చిత్రాన్ని జరిపాడేమో అని అనిపిస్తుంది. బాహుశా కథ అతన్ని ఆ విధంగా నిర్దేశించి వుండొచ్చు కానీ బి,సి సెంటర్ల ప్రేక్షకులకు ద్వితీయార్ధం లో కొన్ని సన్నివేశాలు అంతగా రుచించవు.
సిరివెన్నెల సీత రామ శాస్త్రి తన సాహిత్యంతో కథని, కథ తో ప్రయాణం చేస్తున్న ప్రేక్షకులని, 13 వ శతాబ్దం లోకి తీసుకువెళ్లారు. సంభాషణలు రచించిన సాయి మాధవ్ బొర్రా, పెన్ను పదును శాతకర్ణి కత్తి పదును తో పోటా పోటీగా తలపడింది. పోరాట దృశ్యాల చిత్రీకరణ ను చూస్తే 79 పని దినాలలో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేశారు అని నమ్మటం కష్టం. ఛాయాగ్రహణం, కూర్పు కి వంక పెట్టె అవసరం ఉండదు కానీ కొన్ని సన్నివేశాలలో లైటింగ్ ఎఫెక్ట్స్ తాలూకా నిర్లక్ష్యత ఛాయాగ్రాహకుడు పెట్టిన ఫ్రేమ్స్ పై ప్రభావం చూపింది. అత్యంత తక్కువ ఖర్చుతో ఇంత పెద్ద స్టార్ తో ప్రతిష్టాత్మక చిత్రాన్ని అతి తక్కువ షెడ్యూల్ లో ఇంత అద్భుతంగా తీసిన నిర్మాతలు సాయి బాబు, రాజీవ్ రెడ్డి ఎక్కడా ప్రొడక్షన్ వాల్యూస్ ని నాసిరకంగ కన పడకుండా నాణ్యమైన చిత్రాన్ని అందించారు.
ప్లస్ పాయింట్స్ : నటీనటులు, సంగీతం, కథ, ఛాయాగ్రహణం, పోరాట దృశ్యాలు, నిర్మాణ విలువలు, దర్శకత్వం
మైనస్ పాయింట్స్ : ద్వితీయార్ధంలో సాగే కథనం, లైటింగ్ ఎఫెక్ట్స్
రేటింగ్ : 3.5/5