గౌతమ్ నంద మూవీ రివ్యూ
నటీనటులు: గోపీచంద్, హన్సిక, కేథరిన్, సచిన్ ఖేడ్కర్, ముఖేష్ రుషి
సంగీతం: ఎస్.ఎస్.థమన్
నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు
దర్శకత్వం: సంపత్ నంది
వరుస ప్లాపులతో డీలా పడిన గోపీచంద్ అనుకోకుండా మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ సంపత్ నంది చేతిలో పడ్డాడు. ఇక సంపత్ నంది కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా తెరకెక్కించాలనే పట్టుదలతో స్టోరీలు రాసుకుంటూ ..... పవన్ తో తెరకెక్కించే ఛాన్స్ లేక ఆ కథలనే ఇతర హీరోలకు వాడుతూ సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాడు. సంపత్ నంది గత చిత్రం రవితేజ హీరోగా చేసిన బెంగాల్ టైగర్ కూడా పవన్ కోసం రాసుకున్నదే. అయితే పవన్ తో సినిమా చెయ్యడం కుదరకపోయేసరికి ఆ వీరాభిమాని పవన్ అత్తారింటికి దారేది చిత్రంలోని పేరును వాడుకుంటూ గోపీచంద్ తో గౌతమ్ నందా ని తెరకెక్కించాడు. సంపత్ నంది రమణమహర్షి పుస్తకంలోని ఓ లైన్ ఆధారంగా ఈ కథను తయారుచేసుకున్నాడు. ధనం మూలం ఇదత్ జగత్ అనే సామెత అందరం వినే ఉంటాం. ఈ ప్రపంచం డబ్బు చుట్టూనే తిరుగుతుంది అనే ప్రధానాంశంతో రూపొందిన చిత్రం 'గౌతమ్‌నంద'. అయితే ఇప్పటి వరకు యాక్షన్ హీరోగా ఇమేజ్ సంపాదించుకున్న గోపీచంద్ తొలిసారి స్టైలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్లో నటించాడు. భారీ బడ్జెట్‌తో రూపొందిన గౌతమ్ నందలో గోపీచంద్ డబుల్ షేడ్‌లో నటించాడు. చాలా రోజుల తర్వాత తెలుగులో సినిమా చేస్తున్న హన్సిక ఈ చిత్రంలో ట్రెడిషనల్ గా నటించినా.... పాటల్లో అందాల ఆరబోతతో మాత్రం మైమరపించేలానే వుంది. ఇక మరో హీరోయిన్ కేథరిన్ మాత్రం మోడరన్ లుక్ లో అదరగొట్టేస్తుంది. ఒక్క ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కెరీర్ లో డల్ అయిన గోపీచంద్ కి ఈ గౌతమ్ నందా చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: ప్రపంచంలోనే ప్రముఖ బిలియనీర్ విష్ణు ప్రసాద్ ఘట్టమనేని(సచిన్ ఖేడ్‌ఖర్)కి ఒకే ఒక కొడుకు ఘట్టమనేని గౌతమ్(గోపీచంద్). గౌతమ్ ఎటువంటి బాధ్యతలు నెత్తిన వేసుకోకుండా లైఫ్ ని ఎంజాయ్ చేసే టైం లో ఒక సంఘటన జరుగుతుంది. అదే టైం లో.... విష్ణు ప్రసాద్ స్నేహితుడి(ముకేష్ రుషి) కూతురు ముగ్ధ(కేథరిన్) గౌతమ్‌ను ప్రేమిస్తుంటుంది. అయితే అనుకోని ఆ సంఘటన వల్ల గౌతమ్ నిజమైన జీవితాన్ని అన్వేషించాలని బయలుదేరుతాడు. అలా బయలుదేరిన గౌతమ్‌కు తన పోలికలతో ఉన్న నంద(గోపీచంద్) కనపడతాడు. కానీ నంద ఎమో పక్క మాస్ గా ఒక మురికి వాడాలో జీవిస్తుంటాడు. అలాగే నంద బాగా డబ్బు సంపాదించాలని కళలు కంటాడు. కానీ అనుకోని సంఘటనల వల్ల గౌతమ్, నంద జీవితాలు అనూహ్య మలుపు తిరుగుతాయి. మరి గౌతమ్, నంద లు ఒకరికొకరు పరిచయం ఉంటుందా..? గౌతమ్ జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏమిటి? ముగ్ధ ప్రేమించిన గౌతమ్ ఆమెకి దక్కుతాడా..? అసలు ఈ కథలో స్ఫూర్తి(హన్సిక) ఎవరో తెలుసు కోవాలంటే సినిమాని వెండితెర మీద చూడాల్సిందే.
నటీనటుల పనితీరు: గోపీచంద్ ఇప్పటివరకు తన మాస్ పెరఫార్మెన్సు తో మాత్రమే అలరించాడు. కానీ ఇప్పుడు గౌతమ్ నంద లో మాత్రం గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనబడ్డాడు. లుక్స్ పరంగా గోపీచంద్ గత చిత్రాలతో పోలిస్తే మాత్రం ఈ సినిమాలో చాలా అందంగా కనబడ్డాడు. గోపీచంద్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. బిలియనీర్ తనయుడు గౌతమ్, దిగువ మధ్య తరగతి యువకుడు నంద గా చక్కటి పెర్ఫార్మెన్స్ చేశాడు. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలను గోపిచంద్ చాలా ఈజిగా చేసేసాడు. ఇక హీరోయిన్స్ తో రొమాన్స్ విషయంలోనూ గోపీచంద్ నటన అద్భుతంగా అనిపించింది. యాక్షన్ సీన్స్ అనే కాదు ఎమోషన్ సీన్స్ లోను గోపీచంద్ బాగా నటించాడు.హన్సిక నటనతో ఆకట్టుకోగా కేథరిన్ గ్లామరస్ భామగా ఆకట్టుకుంది. కానీ కేథరిన్ నటనలో మాత్రం అంతంత మాత్రంగానే అనిపించింది. బికినీ అందాలతో మాత్రం కుర్రకారు మనసుని దోచేసింది. వెన్నెల కిషోర్, తీన్మార్ సత్తి కామెడి ఓకే. అనుకున్న రేంజ్లో కామెడి వర్కవుట్ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు: దర్శకుడు సంపత్ నంది తెరపై చూపించాలనుక్ను పాయింట్ చిన్నదే. కానీ ప్రతి సీన్‌ను ఎంతో రిచ్‌గా చూపించాడు. పక్క మాస్ మసాలా చిత్రంతో ఒక కమర్షియల్ ఎలెమెంట్స్ ని తెరకెక్కించాలని ఉద్దేశ్యంతో దర్శకుడు ఈ చిత్రాన్ని హీరో గోపీచంద్ తో తెరకెక్కించాడు. గోపీచంద్ ని కొత్తగా చూపించడంలో మాత్రం సంపత్ నంది సక్సెస్ అయ్యాడు. అలాగే గోపీచంద్ లోని మరో యాంగిల్ ని ప్రేక్షకులకి పరిచయం చేసాడు. కానీ విలన్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే పవర్ ఫుల్ విలన్స్ ఉంటె హీరోకి ధీటుగా కనిపిస్తుంది. కానీ కామెడీ విలన్స్ తో మాస్ చిత్రాన్ని గట్టెక్కించాలంటే కష్టమే. ఇక మిగతా టెక్నిషియన్స్ విషయానికి వస్తే సౌందర్‌రాజన్ సినిమాటోగ్రఫీ సినిమాలో మెయిన్ హైలైట్. సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ఎంతో రిచ్‌గా చూపించారు. విదేశాల్లోని సీన్స్ ని, విలాసవంతమైన సీన్స్ ని చిత్రీకరించడంలో సినిమాటోగ్రఫీ పనితనం హైలెట్ గా నిలిచింది. ఇక ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలున్నాయి. ఇక మెయిన్ గా మ్యూజిక్ విషయానికి వస్తే థమన్ మ్యూజిక్ మాత్రం ఎప్పటిలాగే రొటీన్ గా అనిపించింది కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇరగదీసేసింది. సినిమాలోని కొన్ని సీన్స్ ని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎలివేట్ చేసేలా ఉంది. నిర్మాణ విలువలు మాత్రం సినిమా స్థాయిని పెంచేసాయి.
ప్లస్ పాయింట్స్: గోపీచంద్, సినిమాటోగ్రఫీ, మేకింగ్ వేల్యూస్, హీరోయిన్స్ గ్లామర్, కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్: పాటలు, రొటీన్ స్టోరీ, కామెడీ, స్లో నేరేషన్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే
రేటింగ్: 2 .75 /5