Mon Nov 25 2024 23:33:23 GMT+0000 (Coordinated Universal Time)
ధ్రువ మూవీ రివ్యూ
నటీనటులు : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి
సంగీతం : హిపాప్ తమిజా
నిర్మాత : అల్లు అరవింద్, ఎన్.వీ.ప్రసాద్
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
తమిళం లో సూపర్ హిట్ అయిన ‘తనీ ఒరువన్’ కు రీమేక్ గా ఈ 'ధ్రువ' చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. గీత ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ రీమేక్ కి పూనుకోవడం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరో ఈ రీమేక్ లో నటించడానికి ముందుకు రావడంతో పాటు... ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ట్రైలర్ యూట్యూబ్ లో సంచలం సృష్టించడం.... ఈ ట్రైలర్ తో పాటు వచ్చిన టీజర్స్, మేకింగ్ వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకోవడం.. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ అందచందాలు వంటివన్నీ ధ్రువ చిత్రంపై విపరీతమైన హైప్ ని క్రియేట్ చేశాయి. 'మగధీర' చిత్రం తర్వాత చెప్పుకోదగిన హిట్ లేని రామ్ చరణ్ 'రేసుగుర్రం' తర్వాత కిక్ 2 వంటి భారీ ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం ఇవ్వడం కూడా ఒకింత ఆసక్తిని కలిగించాయి. దీనితోపాటు ఈ చిత్రంలో అందాల నటుడు అరవింద్ స్వామి హీరోని మించిన పాత్రని చేస్తున్నాడనే టాక్ రావడం కూడా ఈ సినిమా టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచింది . మరి ఇన్ని భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం విడుదలైన ఈ 'ధ్రువ' చిత్రం ప్రేక్షకులుఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: ధ్రువ (రామ్ చరణ్) తనతోపాటు పోలీస్ ఆఫీసర్స్ గా ట్రైనింగ్ పొందే కొంతమందితో కలిసి ట్రైనింగ్లో ఉండగానే సిటీలో తిరిగే కొంతమంది క్రిమినల్స్ ని పట్టుకుని వారిని పోలీసులకు పట్టుబడేలా ప్లాన్ చేస్తూ తమ పోలీస్ ట్రైనింగ్ ని పూర్తి చేస్తారు. ఒక పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా రామ్ చరణ్ చుట్టూనే ఈ ధ్రువ కథ తిరుగుతూ ఉంటుంది. ఇక ఐపీస్ అధికారిగా బాధ్యతలు తీసుకున్నాక ధ్రువ తన టీమ్ తో కలిసి 100 మంది చిన్న క్రిమినల్స్ ని పట్టుకోవాలంటే ముందుగా ఒక పెద్ద క్రిమినల్ ని పట్టుకోవాలని భావించిన ధృవకి సిద్ధార్ద్ అభిమన్యు (అరవింద్ స్వామి) అనే బడా బిజినెస్ మాన్ గురించి తెలుస్తుంది. ఒక్క సిద్ధార్ద్ ని పట్టుకుంటే చాలామంది చిన్న క్రిమినల్స్ అంతమవుతారని భావించిన ధ్రువ అండ్ టీమ్ సిద్ధార్ధ్ అభిమన్యుతో మైండ్ గేమ్ మొదలు పెడతారు. ఈ క్రమంలో ధ్రువ టీమ్ లో కొంతమందిని, ధ్రువ లవర్ రకుల్ ని చంపడానికి సిద్ధార్థ్ ప్లాన్ చేస్తాడు. వీటిన్నింటికి చెక్ పెడుతూ సిద్ధార్ధ్ అభిమన్యు బండారం బయట పెట్టి అతన్నేవిధంగా మట్టుపెట్టాడు? అసలు సిద్ధార్ధ్ ని పట్టుకుంటే 100 మంది క్రిమినల్స్ ఎలా అంతమవుతారు? ధ్రువ తన లవర్ రకుల్ ని అభిమన్యు నుండి ఎలా కాపాడతాడు? అసలు సిద్ధార్ధ్ ని ధ్రువ ఎదుర్కోగలడా? అనేవి విషయాల్ని తెర మీద చూడాల్సిందే.
నటీనటులు: ముందుగా రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో 6 ప్యాక్ బాడీతో అందరిని అలరించాడు. ఈ పోలీస్ పాత్రని చరణ్ చెయ్యడానికి ఎంతగా కష్టపడ్డాడో అతని బాడీ బిల్డింగ్ ని చూస్తే అర్ధమవుతుంది. చరణ్ పెర్ఫార్మన్స్ తో , డైలాగ్స్ తో, సిక్స్ ప్యాక్ తో ప్రతి ఒక్కరిని అలరించాడు.. స్టైలిష్ పోలీస్ ఆఫీసరుగాగా కనిపించడానికి బాగా ట్రై చేసాడు. ఇక విలన్ గా చేసిన అరవింద్ స్వామి గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాలి. అసలు అరవింద్ సిద్దార్థ అభిమన్యు పాత్రలో జీవించేసాడు. సిద్దార్థ అభిమన్యు పాత్రకి అరవింద్ స్వామిని తప్ప మరొకరిని ఊహించలేం అన్నట్టు అతని నటన అబ్బురపరిచింది. అంత స్టయిల్ గా కూడా విలన్స్ వుంటారా అనే రీతిలో అరవింద్ ని చూపించాడు డైరెక్టర్. ఇక రకుల్ ప్రీత్ తన పరిధిమేర నటించింది. అందాల ఆరబోతలో ఔరా అనిపించిన రకుల్ తన పాత్రకి న్యాయం చేసింది. ఇక నవదీప్ ఒక కీలక పాత్రలో కనిపించాడు. మిగతా నటీనటులు పోసాని, నాజర్ వంటివారు తమ పరిధిమేర నటించారు.
సాంకేతిక వర్గం: ముందుగా మనమిక్కడ దర్శకుడి గురించి మాట్లాడుకోవాలి. దర్శకుడు సురేందర్ రెడ్డి తమిళ మాతృకం తని ఒరువన్ ని కొంచెం మార్పులు చేర్పులతో తెలుగు నేటివిటీకి దగ్గరగా తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఒక సినిమాని మళ్ళీ రీమేక్ చెయ్యడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. కానీ సురేందర్ రెడ్డి తని ఒరువన్ ని రీమేక్ చెయ్యడం లో విజయవంతంమయ్యాడు,.మెగా ఫ్యామిలీ అతనిపై పెట్టుకున్న ఆశలను వమ్ము చెయ్యకుండా... తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాని తెరకెక్కించించి మరోసారి తన స్టైలిష్ ని నిరూపించుకున్నాడు. అయితే సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆయువుపట్టు లాంటిది. ఇక సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. ఇదే ఈ సినిమాకి మైనస్ గా చెప్పుకోదగ్గ అంశం. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి జీవం పోసింది. మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ బ్యాగ్రౌండ్ ని ఇరగ్గొట్టేసాడు. కానీ పాటలు పర్వాలేదనిపించాయి.సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది.. ఎడిటింగ్ లో కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుండేది.. రన్ టైం ఎక్కువ ఉంది.. గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్: రాంచరణ్, అరవింద్ స్వామి, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ,మ్యూజిక్, ఇంటర్వెల్ బాంగ్, కథ, కథనం
మైనస్ పాయింట్స్: కామెడీ, పాటలు, సెకండ్ హాఫ్
రేటింగ్: 3 .0 /5
Next Story