నక్షత్రం మూవీ రివ్యూ
బ్యానర్: బుట్టబొమ్మ క్రియేషన్స్, విన్ విన్ విన్ క్రియేషన్స్
తారాగణం: సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాష్‌రాజ్, తనీష్, శివాజీరాజా, జెడి చక్రవర్తి, తులసి తదితరులు
ఎడిటింగ్: శివ వై ప్రసాద్
సంగీతం: భీమ్స్, భరత్ మధుసూదన్, హరిగౌర
కెమెరా: శ్రీకాంత్ నారోజ్
నిర్మాతలు: కె. శ్రీనివాసులు, ఎస్. వేణుగోపాల్, సజ్జు
రచన, దర్శకత్వం: కృష్ణవంశీ
విడుదల తేదీ: ఆగస్ట్ 4, 2017
కృష్ణవంశీ సినిమాలంటే ఒకప్పుడు చాలా విలువుండేది. ఆ విలువతోనే కృష్ణవంశీ కి క్రియేటివ్ దర్శకుడు అని టాగ్ కూడా ఇచ్చేశారు. అయితే ప్రెజంట్ కృష్ణవంశీ పరిస్థితి మాత్రం చాలా అంటే చాలా దారుణంగా వుంది. కృష్ణవంశీ కి సరైన హిట్ పడి 10 సంవత్సరాలు అవుతుంది అంటే ఎవరైనా నమ్ముతారా!. కానీ నమ్మాలి..2007 లో వచ్చిన చందమామ మూవీ తర్వాత కృష్ణవంశీ కి సరైన హిట్ లేదు. మధ్యలో 5 సినిమాలు చేసిన కృష్ణవంశీ తన మార్క్ ని అస్సలు చూపించలేకపోయాడు. అయితే కృష్ణవంశీ క్రెయేటివిటి మీద మాత్రం ప్రేక్షకులకు నమ్మకం పోలేదు. ఏదో ఒక రూపంలో హిట్ కొడతాడని ఆయన సినిమా వస్తుందంటే చాలు వేచి చూడటం అలవాటు అయిపోయింది. అలా వేచి చూసిన సినిమానే 'నక్షత్రం'. సందీప్ కిషన్, రెజినా, ప్రగ్య ల తో పాటు మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఓ కీలక పాత్ర చేయడం తో ఈ సినిమాపై నిజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కృష్ణవంశీ సినిమాలకి పెట్టింది పేరు అన్నట్లుగా హీరోయిన్స్ అదిరిపోయే అందాలు కూడా ఈ సినిమా కోసం వేచి చూసేలా చేశాయి. వీటన్నికంటే కృష్ణవంశీ సినిమాల్లో పోలీస్ కి వుండే పవర్ హై రేంజ్ లో ఉంటుంది. ట్రైలర్ చూశాక ఈ సినిమా కూడా పవర్ ఫుల్ పోలీస్ కథ అనేది అందరికి తెలిసింది. దీంతో ఈ సారి కృష్ణవంశీ గ్యారంటీ గా కొడతాడని అందరికి ఓ ఐడియా వచ్చింది. మరి ప్రేక్షకుల ఐడియా ని కృష్ణవంశీ అందుకున్నాడా...? నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా?బాక్సాఫీస్ వద్ద నక్షత్రం టాక్ ఏంటి అనేది మన రివ్యూ లో తెలుసుకుందాం.
కథ:
రామారావు (సందీప్ కిషన్) ఫ్యామిలీ అంతా పోలీస్ బ్యాగ్రౌండ్ వున్న ఫ్యామిలీయే. వాళ్ళ తాత, తండ్రి..ఇలా తమ వంశంలో ఎవరో ఒకరు పోలీస్ వృత్తి లో వున్నవారే. వంశపార పర్యంగా తను కూడా పోలీస్ కావాలని ధృడ నిశ్చయం తో ఉంటాడు. అందుకు అవసరమైన వన్నీ పూర్తి చేస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల పోలీస్ జాబ్ పోతుంది. ఆ కారణాలేంటి? పోలీస్ డ్రెస్ వేసుకుంటేనే పోలీస్ అవుతాడని అనుకుంటే తప్పే. భాద్యత గల ప్రతి పౌరుడు పోలీసే అని తన తండ్రి చెప్పిన మాటని రామారావు...బాగా ఎక్కించుకుని.. తనని తానే ఓ పోలీస్ గా ఊహించుకుని పోలీస్ డ్యూటీ చేస్తుంటాడు. ఆ డ్యూటీ లోనే ఓ సమస్య లో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి? ఆ సమస్య నుండి రామారావు ఎలా బయట పడ్డాడు? రామారావు పాత్రకి, అలెగ్జాండర్ (సాయిధరమ్ తేజ్) పాత్రకి లింక్ ఏంటి? వంటి కొన్ని తలా తోక లేని ప్రశ్నల సమాహారమే నక్షత్రం.
ఆర్టిస్ట్స్ ల పనితీరు:
ఆర్టిస్ట్ లలో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజంగా పోలీస్ లా పాత్రలో లీనమై.. నక్షత్రం గురించి కాస్త చెప్పుకునేలా చేశాడు. సందీప్ కిషన్ పాత్రకి న్యాయం చేయడమే కాదు, తన నటన తో అందరిని ఆకట్టుకుంటాడు కూడా. సాయిధరమ్ తేజ్ కు పవర్ఫుల్ పాత్ర ఇచ్చి కూడా యూజ్ చేసుకోలేక పోయారు. సాయి ధరమ్ చేయాల్సిన పాత్ర కానప్పటికీ, తనకు ఇచ్చిన పాత్రని పండించాడు. అబ్బో హీరోయిన్స్ గురించి చెప్పాలంటే రెజినా అంటే రెజీనాని మించి పోయింది ప్రగ్య. ఏంటి నటనలో అనుకుంటున్నారా? కాదండీ బాబూ..ఎక్సపోజింగ్ లో. ఇక ప్రకాష్ రాజ్ అతి చాలా ఎక్కువైంది. అలాగే శివాజీ రాజా కూడా. విలన్ గా చేసిన తనీష్ మాత్రం బోర్ కొట్టించడు. మిగతావారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
టెక్నిషియన్స్ పనితీరు:
ఈ సినిమాని ఫొటోగ్రఫీ కూడా కాపాడలేదు. బి గ్రేడ్ సినిమాలు కూడా ఫోటోగ్రఫీ పరంగా క్వాలిటీగా వుంటున్న ఈరోజుల్లో క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకుంటున్న కృష్ణవంశీ నుంచి ఇలాంటి ఫోటోగ్రఫీతో సినిమా రావడం మన దరిద్రం అనుకోవాలి. అలాగే ఒకరు కాదు, ఇద్దరు కాదు ఈ సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. కానీ, ఏ ఒక్కరూ వినదగ్గ పాటల్ని చెయ్యలేకపోయారు. పాటల్లో హీరోయిన్ అందాలను చూస్తూ ఉండటమే తప్ప ఒక్క పాట కూడా అర్ధం కాదు. ఇక భీమ్స్ తన ఆర్ ఆర్ తో సినిమా అంతా రణగొణ ధ్వనులతో నింపేసి సినిమాని మరింత బ్యాడ్ చేశాడు. ఎడిటింగ్ కూడా అస్తవ్యస్తంగా అనిపిస్తుంది. ఇవన్నీ సరిగా ఉండాలంటే ముందు డైరెక్టర్ కరెక్ట్ గా, గ్రిప్పింగ్ గా ఉండాలి. అదే లేదు ఈ సినిమాకి. అన్ని అతి అనిపించడం ఈ సినిమా చేసుకున్న అదృష్టమో..లేక చూస్తున్న మన దురదృష్టమో ఆ కృష్ణవంశీ కే తెలియాలి.
ప్లస్ పాయింట్స్ : సందీప్ కిషన్,హీరోయిన్ల ఎక్సపోజింగ్ (సినిమాకి కొంచెం ఆకర్షించే శక్తి అదే కాబట్టి)
మైనస్ పాయింట్స్ :పలానా అని చెప్పడం కష్టం..ఎందుకంటే అన్నీ అవే కాబట్టి.
వివరణ:
సంపూర్ణంగా లేని కథలన్నిటిని కలిపి కలగాపులగంగా మారిపోయి సినిమా చూస్తున్న ప్రేక్షకుల్ని డిస్టర్బ్ చేయడమే కృష్ణ వంశీ ముఖ్య ఉద్దేశ్యమా అనిపిస్తుంది. అనవసరంగా వచ్చే హడావిడి సన్నివేశాలు. అర్థాంతరంగా వచ్చిపడే పాటలు, సమయం సందర్భం లేకుండా నవ్వించే ప్రయత్నం చేసే కమెడియన్స్, ఓవర్ యాక్షన్ చేసే ఇతర క్యారెక్టర్లు. అబ్బో తలనొప్పి కి తలనొప్పి లా వుంది సినిమా చూస్తుంటే.. అర్థంపర్థంలేని, తలా తోక లేని కథతో అన్నిరకాలుగా ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా అర్థంకాని పరిస్థితుల్లోకి నెట్టేశాడు కృష్ణవంశీ. కొత్తదనం లేని ఔట్ డేటెడ్ కథ, చూసి చూసి విసిగిపోయిన క్యారెక్టరైజేషన్లతో కథ ఎటు వెళ్తుందో అర్థంకాని అయోమయంలో ప్రేక్షకుల్ని పడేయడంలో కృష్ణవంశీ 100 శాతం సక్సెస్ అయ్యాడు. మంచి పాయింట్ ఉండి కూడా..క్రెయేటివిటీ పేరుతో కృష్ణవంశీ సినిమాలని ఇలా నాశనం చేస్తున్నాడా..! అని కృష్ణవంశీ ని ఇష్టపడే వారు కూడా అనుకుంటున్నారంటే, కృష్ణవంశీ ఇక ఎందుకు సినిమాలు తీస్తున్నాడా ఒకసారి తెలుసుకోవాలి. సందీప్ కిషన్ కోసం అయితే ఒకసారి సినిమా చూడొచ్చు. కృష్ణవంశీ అని ఊహించుకుని వెళితే మాత్రం..ఇంట్లో చెప్పి వెళ్ళండి.
ఫైనల్ గా: చుక్కలు చూపించారు నాయనో..!
రేటింగ్: 1.75/5