Tue Nov 26 2024 01:55:11 GMT+0000 (Coordinated Universal Time)
నరుడా.. డోనరుడా రివ్యూ
నటీనటులు : సుమంత్, తనికెళ్ళ భరణి. పల్లవి సుభాష్
సంగీతం : శ్రీచరణ్ పాకల
నిర్మాత : వై. సుప్రియ, జాన్ సుధీర్
దర్శకత్వం : మల్లిక్ రామ్
అక్కినేని మనవడిగా, నాగార్జున కి మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ సత్యం వంటి సినిమాతో హీరో గా మంచి పేరు తెచ్చుకున్నాడు. . ఇక సత్యం సినిమాకి ముందు, వెనుక సినిమాలేవీ సుమంత్ ని హీరోగా నిలబెట్టలేకపోయాయి. అప్పుడప్పుడు ఏదో ఒక సినిమాతో ప్రేక్షకులని పలకరించే సుమంత్, అక్కినేని నాగేశ్వర రావు బ్రతికున్నపుడు ఏమో గుర్రం ఎగరా వచ్చు సినిమాతో వచ్చాడు. ఇక ఆ సినిమా రిజల్ట్ అందరికి తెలుసు. ఇక ఏమో గుర్రం... సినిమాతో బాగా గ్యాప్ తీసుకుని... బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన విక్కీ డోనర్ ని తెలుగులో నరుడా డో నరుడా గా రీమేక్ చేసాడు. ఈ చిత్రం లో సుమంత్ స్పెర్మ్ డోనర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో మల్లిక్ రామ్ అనే అతను దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తనికెళ్ళ భరణి పిల్లల డాక్టర్ గా ముఖ్యపాత్రని పోషిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ అమ్మాయి పల్లవి సుభాష్ సుమంత్ కి జోడిగా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై సుమంత్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితేనే సుమంత్ కి టాలీవుడ్ లో భవిష్యత్తు ఉంటుంది లేకపోతె ఇక హీరోగా సుమంత్ పని ఖాళీ. అయితే ట్రైలర్స్ తో, పోస్టర్స్ తో ఆకట్టుకున్న ఈ నరుడా డో నరుడా చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుంది, సుమంత్ రీ ఎంట్రీ కి ఎంత ఉపయోగ పడింది తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లసిందే.
కథ: విక్కీ (సుమంత్) అనే కుర్రాడు ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. మరోపక్క పిల్లలు లేరని తమ వద్దకు వచ్చే భార్యాభర్తలకు సాయం చేసేందుకు ఓ స్పెర్మ్ డోనర్ కోసం వెతుకుతున్న డాక్టర్ ఆంజనేయులు(తనికెళ్ళ భరణి) కి అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండే విక్కీ దొరుకుతాడు. విక్కీ ఫ్యామిలిలో పిల్లలు పూటడం ద్వారా వారి వీర్యకణాల పవర్ ఫుల్ గురించి తెలుసుకుని విక్కీని ఎలాగైనా స్పెర్మ్ డోనర్‌గా ఒప్పించాలని ప్రయత్నిస్తాడు. దాని కోసం డబ్బు ఆశ చూపిస్తాడు డాక్టర్ ఆంజనేయులు. ఇక ఉద్యోగం ఎలాగూ లేదుగనక విక్కీ డబ్బుకి ఆశపడి స్పెర్మ్ డోనర్ గా మారిపోతాడు. స్పెర్మ్ డోనర్ గా విక్కీ రెండు చేతులా డబ్బు సంపాదిస్తుంటాడు. ఇలా స్పెర్మ్స్ డొనేట్ చేసే విక్కీకి ఆషిమా రాయ్ (పల్లవి సుభాష్) పరిచయమవుతుంది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. పెళ్లి తర్వాత విక్కీ చేసే పని గురించి తెలుసుకుని విక్కీకి దూరమవుతుంది ఆషిమా రాయ్. మరి స్పెర్మ్ డొనేట్ చేస్తూ రెండు చేతులా సంపాదించే విక్కీ ఆషిమా రాయ్ చెప్పింది విని ఆ పని మానేస్తాడా? ఆమెను కన్విన్స్ చేసి తిరిగి తీసుకు వస్తాడా? అసలు విక్కీ స్పెర్మ్ డోనర్ ఉద్యోగానికి స్వస్తి చెబుతాడా? అసలు ఆంజనేయులు కి విక్కీ తప్ప స్పెర్మ్ డోనర్ గా ఎవరు దొరకలేదా? ఇవన్నీ తెలియాలంటే వెండితెర మీద సినిమా చూడాల్సిందే.
పనితీరు: హీరో సుమంత్ ఈ సినిమాలో మొదటి నుండి నటన పరంగా కాస్త మెరుగయ్యాడనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో కాస్త ఇబ్బంది పెట్టినా బోల్డ్ సీన్స్ లో మెప్పించాడు. ఉద్యోగం లేకుండా తిరిగే యువకుడి నుండి స్పెర్మ్ డోనర్‌గా, ప్రేమికుడిగా, తల్లిన సంతోష పెట్టే యువకుడిగా మెప్పించాడు. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్, సెంటిమెంట్ సీన్స్‌లో గత సినిమాల్లోలాగే కానించేశాడు. సినిమాలో వచ్చే అతి కీలకమైన ఫెర్టిలిటీ డాక్టర్‌గా తనికెళ్ళ భరణి విత్తనం అనే తన ఊతపదంతో బాగా నవ్వించారు. తనికెళ్ళ భరణి తనదైన సహజ నటనతో అలరించారు.. హీరోయిన్ పర్వాలేదనిపించే నటన ప్రదర్శించింది.. మిగితా నటీనటులు తమ పాత్రల మేరకు న్యాయం చేసారు. ఇక దర్శకుడి విషయానికి వస్తే బాలీవుడ్ లో సక్సెస్ అయినా విక్కీ డోనర్ ని యస్టీస్ గా తెలుగులో దించేసాడు డైరెక్టర్ మల్లిక్ రామ్. ఇక ఎమోషన్స్ ని పండించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. మేకింగ్ విషయంలో మంచి ప్రదర్శన కనపరిచాడు..స్క్రీన్ ప్లే చక్కగా కుదిరింది.. డైలాగ్స్ పర్వాలేదనిపించాయి. శ్రీ చరణ్ మ్యూజిక్, పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది.. సినిమాటోగ్రఫీ పనితనం మెచ్చుకోవచ్చు. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.
ఫైనల్ గా విక్కీ గా సుమంత్ ఆకట్టుకున్నప్పటికీ ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయిందనే చెప్పాలి. పాపం చాలా రోజులుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సుమంత్ కి ఈ సినిమా మరోసారి నిరాశపరిచిందనే చెప్పాలి. మరోసారి హీరోగా అనిపించుకోవడానికి సుమంత్ మళ్ళీ యుద్దానికి సిద్ధమవ్వాలని ఈ సినిమా చూసిన వాళ్లకి అర్ధమవుతుంది.
రేటింగ్ 2/5
Next Story