నీది నాది ఒకే కథ మూవీ రివ్యూ
నటీనటుల: శ్రీ విష్ణు, సట్న టైటస్, దేవీప్రసాద్, నారా రోహిత్, పోసాని కృష్ణమురళి తదితరులు
స్క్రీన్ ప్లే : ఉడుగుల వేణు
మ్యూజిక్ డైరెక్టర్: సురేష్ బొబ్బిలి
నిర్మాతలు: కృష్ణ విజయ్, ప్రశాంతి
దర్శకత్వం: ఉడుగుల వేణు
చాల సింపుల్ గా నారా రోహిత్ ఫ్రెండ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా మారి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన శ్రీవిష్ణు 'లో' బడ్జెట్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. నారా రోహిత్ తో కలిసి ఒకటి రెండు సినిమాల్లో నటించిన శ్రీ విష్ణు హీరోగా బాగానే ఆకట్టుకుంటున్నాడు. 'ఉన్నది ఒకటే జిందగి'లో హీరో రామ్ కి ఫ్రెండ్ గా నటించి ఆ సినిమాలో కీలకపాత్ర పోషించిన శ్రీ విష్ణు వెంటనే 'మెంటల్ మదిలో' అంటూ రొమాంటిక్ హిట్ కొట్టాడు. 'మెంటల్ మదిలో' హిట్ తో శ్రీ విష్ణు మార్కెట్ కూడా పెరిగింది. శ్రీ విష్ణు ని చూడగానే పక్కటి అబ్బాయిగా అందరిలోకలిసిపోతాడు అన్నట్టుగా ఉంటాడు. ప్రస్తుతం కెరీర్ ని చిన్నగా సెట్ చేసుకుంటున్న శ్రీ విష్ణు దర్శకుడు వేణు ఉడుగుల లతో కలిసి 'నీది నాది ఒకే కథ' అనే సినిమా చేసాడు. ఈ సినిమా మొత్తం మధ్యతరగతి కుటుంబం లోని వ్యక్తుల వ్యక్తిత్వాలను ఆవిష్కరించే విధంగా ఉంటుంది అనేది 'నీది నాది ఒకే కథ' ట్రైలర్ లో చూస్తుంటే తెలుస్తుంది. మరి ఈ సినిమా మధ్యతరగతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని తెరెకెక్కించిన సినిమా అయినా ఈ సినిమాలో సమాజానికి ఉపయోగపడే ఒక మెస్సేజ్ కూడా ఉంటుందని పలు ఇంటర్వూస్ లో శ్రీ విష్ణు చెప్పాడు. మరి చిన్న హీరోగా అందరి చూపును తనవైపుకు తిప్పుకున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో ఎలాంటి హిట్ కొట్టాడో అనేది సమీక్షలో తెలుసుకుందాం.
ఈ సినిమా మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబందించిన కథ. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆ ఇంటి పెద్ద కష్టపడుతూ తన పిల్లలని ఉన్నత చదువులు చదివించాలని కలలు కంటుంటాడు. కానీ తండ్రి అనుకున్నదానికి పూర్తి ఆపోజిట్ గా పిల్లలు చదువు మీద శ్రద్ధ లేకుండా తనకి ఎలా కావాలంటే ఆలా ఉంటూ తనకు నచ్చినట్టు బతికేస్తూ కన్న తండ్రిని బాధపెడుతూ... చివరికి తన తండ్రి బాధను అర్ధం చేసుకున్న పిల్లలు మారాలంటే.. పరిస్థితులు అనుకూలిస్తాయా అనే కథాంశంతో ఈ సినిమా కథ ముడిపడి ఉంది.
కథ:
చదువంటే ఇష్టం లేని రుద్రరాజు సాగర్ (శ్రీ విష్ణు) పాతికేళ్ళు వచ్చిన గాని ఇంకా డిగ్రీ పాస్ అవ్వకుండా.. సప్లమెంటరీలో పరిక్షలు రాస్తూనే ఉంటాడు. చదువు ఎక్కని సాగర్.. పరీక్షల గురించి పట్టించుకోకుండా ఎప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఆడుతూ పడుతూ... సినిమాలకు చెక్కేస్తూ జులాయి లా తిరుగుతూ ఉంటాడు. మధ్య మధ్యలో వచ్చే పరిక్షలకు మాత్రం బంక్ కొట్టకుండా అటెండ్ అవుతూ ఉంటాడు. కానీ ఎన్ని సార్లు పరిక్షలు రాసిన గాని సాగర పరీక్షల్లో మళ్ళి మళ్ళి ఫెయిల్ అవుతూనే ఉంటాడు. ఇక సాగర్ తండ్రి అయిన దేవి ప్రసాద్ (దేవి ప్రసాద్) రెక్కల కష్టంతో కుటుంబాన్ని సాకుతు పరీక్షల్లో పాస్ కానీ కొడుకుని తిట్టి తిట్టి అలసిపోయి.... కొంతకాలానికి అసలు కొడుకుని పట్టించుకోవడమే మానేసి సర్దుకుపోవడం చేస్తుంటాడు. ఎప్పుడూ తిట్టే తన తండ్రి తన మీద కోప్పడకపోయేసరికి రియలైజ్ అయిన సాగర్ ఈసారి కష్టపడి చదివి పరీక్షలు పాస్ అవ్వాలనుకుంటాడు. పరీక్షల కోసం కష్టపడుతున్నప్పుడు సాగర్ కి ధార్మిక (సట్న టైటస్) అనే అమ్మాయి పరిచయం అవడం.... ధార్మిక దగ్గర సలహాలు తీసుకొని ఎలాగైనా పరిక్షల్లో పాస్ అవ్వాలి అనుకుంటాడు సాగర్. ఇక ఆ అమ్మాయి చెప్పినట్టుగానే ఫ్రెండ్స్ ని, సినిమాల్ని పక్కన పెట్టి చదువు మీద శ్రద్ధ పెడతాడు సాగర్... మరీ సాగర్ అనుకున్నట్టుగా పరీక్షల్లో పాస్ అయ్యాడా? తన తండ్రి కోరికను సాగర్ తీరుస్తాడా ? అసలు ధార్మిక చెప్పినట్టుగా సాగర్ మారిపోయాడా? ఎప్పుడు ఫ్రెండ్స్, ఆటలు, సినిమాలనే సాగర్ ఒక్కసారిగా మారగలిగాడా?అనేది మిగతా సినిమా.
నటీనటులు నటన:
మధ్యతరగతి యువకుడిగా శ్రీ విష్ణు, సాగర్ పాత్రలో జీవించాడు అనడమే 100 శాతం కరెక్ట్ అనేలా ఉంది నీది నాది ఒకే కథ సినిమాలో శ్రీ విష్ణు నటన. సగటు మధ్యతరగతి కుటుంబంలోని ఒక కుర్రోడి మనస్తత్వం ఎలా ఉంటుందో.. అలాంటి వ్యక్తిత్వం ఉన్న కుర్రాడిగా విష్ణు నటన సూపర్బ్ అనేలా వుంది. తండ్రి మాటకు ఎదురు చెప్పడం, తండ్రి ఫీలింగ్స్ ని అర్ధం చేసుకోకుండా ఫ్రెండ్స్ తో తిరగడం, లైఫ్ మీద ఎటువంటి భయాలు పెట్టుకోకుండా జీవితాన్ని ఈజీగా తీసుకోవడం వంటి లక్షణాలతో శ్రీ విష్ణు కేక పుట్టించాడు. ఇక శ్రీ విష్ణు యాస కూడా ఈ సినిమాకి ప్లస్ అనేలా ఉంది. ఎమోషనల్ సీన్స్ లోను, కామెడీ విషయంలోనూ శ్రీ విష్ణు నటన చక్కగా వుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో అయితే శ్రీ విష్ణు చాలా బాగా నటించాడు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ లో శ్రీ విష్ణు నటన అద్భుతమని చెప్పాలి. ఇక హీరోయిన్ సట్న టైటస్ ధార్మిక పాత్రలో ఒదిగిపోయింది. ఆడపిల్ల అంటే అంతే క్రమశిక్షణతో ఉండాలి అనేట్టుగా ధార్మిక పాత్రను దర్శకుడు డిజైన్ చేసాడు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు పాత్రతో సమానమైన పాత్ర చేసిన దేవి ప్రసాద్ కూడా సాగర్ తండ్రిగా దేవీప్రసాద్ పాత్రలో జీవించాడు. ఆయన నటన సినిమాకి మరో హైలెట్. అసలు కొన్ని ఎమోషనల్ సీన్స్ లో శ్రీ విష్ణు ను డామినేట్ చేసాడు దేవీప్రసాద్. కొడుకుని ఎప్పుడు చదువు చదువు అని విసిగించి అలాగే కొడుకు పట్ల అసహ్య భావంతో ఉండే ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు దేవి ప్రసాద్. ఇక శ్రీ విష్ణు బెస్ట్ ఫ్రెండ్ నారా రోహిత్ గెస్ట్ రోల్ లో ఇమిడిపోయాడు. నారా రోహిత్ ఉన్న కొద్ది సేపు కూడా ఆకట్టుకునేలా వుంది. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించి మెప్పించారు.
విశ్లేషణ:
తమ పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగం చేస్తూ జీవితంలో సెటిల్ అయితే బావుంటుందని ఒక మిడిల్ క్లాస్ తల్లితండ్రులు కలలు కంటారు. తాముపడే కష్టాలు తమ పిల్లలు పడకూడదని... తన కష్టాన్ని పిల్లలకి తెలియనివ్వకుండా వారిని చదువుల కోసం కాలేజ్ ల కోసం పంపిస్తారు. మరి తల్లి తండ్రులు చెప్పినట్టుగా పిల్లలు కూడా తమ బాధ్యతలను ఎరిగి చదువుకుని స్థిరపడితే బావుంటుంది. కానీ తండ్రి కష్టాన్ని గుర్తించకుండా జీవితాన్ని సీరియస్ గా తీసుకోకుండా... సినిమాలు షికార్లు చేస్తుంటే.. ఆ మధ్యతరగతి పడే బాధ ని దర్శకుడు వేణు ఉడుగుల కళ్ళకు కట్టినట్టుగా నీది నాది ఒకే కథలో చూపించాడు. ఇక ఈ సినిమాలో హీరో తన కోసం తాను బతకాలనుకుంటాడు. చదువు రాకపోయినంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్టు కాదు.. తనకు వచ్చిన పని చేసుకొని కూడా బతకొచ్చు అని గ్రహిస్తాడు. ఎప్పుడు పరువు ప్రతిష్టలకు పెద్ద పీట వేసే తన తండ్రి మాత్రం కొడుకు కంటే పరువే ముఖ్యమని అనుకుంటాడు. తనను ఎంతో ప్రేమించే తండ్రి తనకంటే పరువుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటే కొడుకు దాన్ని జీర్ణించుకోలేకపోతాడు. తండ్రి, కొడుకుల మధ్య జరిగే భావోద్వేగ సన్నివేశాల కలయికే ఈ సినిమా. దర్శకుడు రాసుకున్న కథ, కథనం ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకుంటుంది. సినిమా నేటి తరం యువత కి కనెక్ట్ అయ్యేలాగ బాగా రాసుకున్నాడు వేణు ఉడుగుల. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటాయి. ఇక వేణు ఉడుగుల తన కథ ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నాడో.. దాన్ని అలానే ప్రెజెంట్ చేసి సక్సెస్ అయ్యాడు. ఇక సినిమా మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా ఆనిపించినా.. సెకండ హాఫ్ కాస్త నెమ్మదించిందని అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం పనితీరు:
నీది నాది ఒకే కథ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. పాటలు బాగున్నా కూడా సినిమా కి ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకి బాగా హెల్ప్ అయ్యింది. పాటలు కూడా బాగున్నాయి. తోటరాజు సినిమాటోగ్రఫీ చూడచక్కగా ఉంది. అర్జున్‌రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న తోట రాజు మరోసారి కెమెరాతో తన ప్రతిభను రుజువు చేసుకున్నారు. ఎడిటింగ్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాను మరీ ఎక్కువసేపు సాగదీయకుండా రెండు గంటల్లో ముగించేశారు. నిర్మాణ విలువలు కథానుసారంగా వున్నాయి.
ప్లస్ పాయింట్స్: మిడిల్ క్లాస్ కథ, శ్రీ విష్ణు, దేవి ప్రసాద్, తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్
రేటింగ్: 3.0/5