ఫిదా మూవీ రివ్యూ
నటీనటులు : వరుణ్ తేజ్, సాయి పల్లవి, సాయి చంద్
మ్యూజిక్ డైరెక్టర్ : శక్తి కాంత్
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
డైరెక్టర్: శేఖర్ కమ్ముల
టాలీవుడ్ లో మాస్ క్లాస్ అనే తేడా లేకుండా చిత్రాలు తీసే దర్శకుడు ఎవరైనా వున్నారు అంటే అందులో ముందు వరసలో ఉండే పేరు మాత్రం డైరెక్టర్ శేఖర్ కమ్ములదే. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన చిత్రాలన్నీ ఫ్యామిలీ మొత్తం కూర్చుని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు అనే ఒపీనియన్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో కలుగుతుంది. శేఖర్ గత చిత్రాలు చూసిన వారికి ఆయన స్టైల్ ఈజీగా అర్ధమవుతుంది. ఒక ఆనంద్, హ్యాపీడేస్, గోదావరి, లీడర్ చిత్రాలు దేనికదే ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఎప్పుడూ కుటుంబ కథా చిత్రాలకే ఇంపార్టెన్స్ ఇచ్చే శేఖర్ కమ్ముల ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ తో ఫిదా చిత్రాన్ని తెరకెక్కించాడు. టాలీవుడ్ లోకి ముకుందా చిత్రంతో ఎంటర్ అయిన వరుణ్ తేజ్ నటించిన నాలుగు సినిమాలు విభిన్న కథలతో తెరకెక్కినవే, ముకుందా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కితే, కంచె చిత్రంలో సైనికుడిగా, మంచి ప్రేమికుడిగా కనిపించాడు. అలాగే లోఫర్ లో మాస్ యాంగిల్ ని టచ్ చేసిన వరుణ్ తేజ్ మిస్టర్ తో క్లాస్ హీరోగా మారాడు. ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో క్లాస్ లుక్ లోనే హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అలాగే హీరోయిన్ సాయి పల్లవి విషయానికొచ్చేసరికి ఆమె నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినప్పటికీ ఒక డాన్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఆమె ప్రముఖ ఛానల్ లో వచ్చిన డాన్స్ షో ఢీ లో ఒక పార్టిసిపేట్ గా వచ్చింది. ఆమె చేసే డాన్స్ చూస్తుంటే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఇక కమర్షియల్ విలువలను వదలకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి కూర్చుని చూసే విధంగా తన బ్యానర్ లో సినిమాలను తెరకెక్కిస్తున్న దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపు దిద్దుకోవడం ఈ చిత్రానికున్న ఇంకో స్పెషల్ అట్రాక్షన్. సినిమా సెట్స్ మీదకు వెళ్ళినప్పడినుండి అంతా పాజిటివ్ గా వినిపిస్తున్న ఈ చిత్రం విడుదల తర్వాత ఎటువంటి టాక్ ని, ఎటువంటి రిజల్ట్ ని సొంతం చేసుకుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: డాక్టర్ వరుణ్ (వరుణ్ తేజ్) తన అన్నయ్య (సీతారామ శాస్త్రి కొడుకు) పెళ్లి కోసం ఇండియాలోని తెలంగాణలోని బాన్సువాడకు వస్తాడు. అక్కడ తన అన్న పెళ్లి సమయంలో పెళ్లికూతురు చెల్లెలు భానుమతి (సాయి పల్లవి) అనే అమ్మాయి ప్రేమలో పడిపోతాడు. భానుమతి చేసే అల్లరి, ఆమె మాట్లాడే విధానం నచ్చి వరుణ్ ఆమెను ప్రేమిస్తాడు. అదే టైములో భానుమతి కూడా వరుణ్ ని ఇష్టపడుతుంది. వారు ప్రేమలో పడిన విషయం వరుణ్ భానుమతికి చెప్పడు, భానుమతి కూడా తన ప్రేమను వరుణ్ కి చెప్పకుండా గుండెల్లోనే దాచుకుంటుంది. అయితే అనుకోకుండా వరుణ్ భానుమతికి దూరమవుతాడు. వరుణ్ అమెరికా వెళ్లడం... అక్కడికి వెళ్లిన వరుణ్, భానుమతికి లవ్ ప్రపోజ్ చెయ్యడం జరుగుతుంది. కానీ ఆ ప్రపోజల్ ని భానుమతి రిజెక్ట్ చేస్తుంది. దీనితో ఇద్దరికీ మనస్పర్థలు వచ్చి ఒకరినొకరు ద్వేషించుకునే స్థాయికి వెళ్ళిపోతారు. వరుణ్ ని అంతగా ఇష్టపడిన భానుమతి వరుణ్ లవ్ ప్రపోజల్ ని ఎందుకు రిజక్ట్ చేస్తుంది? భానుమతి, వరుణ్ ని కాదనుకోవడానికి ఆమె కుటుంబం కారణమా? మనస్పర్ధలతో విడిపోయిన ఈ జంట మళ్ళీ కలుస్తుందా? వారిద్దరికీ పెళ్లి జరుగుతుందా? అనేది తెలియాలంటే ఖచ్చితంగా వెండితెర మీద ఫిదా ని వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు: ఈ చిత్రంలో ముఖ్యం గా మనం చెప్పుకోవాల్సింది హీరోయిన్ సాయి పల్లవి గురించే. భానుమతిగా సాయి పల్లవి తన పాత్రను ఎంతో అద్భుతంగా చేసి అందరి మనసులను దోచేసింది. తెలంగాణా అమ్మయిగా సాయి పల్లవి చేసిన అల్లరి పనులు, ఆమె చేసిన ఎమోషన్ సీన్స్ అందరిని కట్టిపడేసింది. తెలంగాణ యాసలో సాయి పల్లవి అచ్చం తెలంగాణ అమ్మయిలా ఆకట్టుకుంది. నటనలో ప్రావిణ్యం, డాన్స్ లతో మోతమోగించిన సాయి పల్లవికి ఈ సినిమాకే మెయిన్ పిల్లర్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కనిపించదు. ఇక హీరో వరుణ్ తేజ్ విషయానికి వస్తే వరుణ్ గత సినిమాల్లోని నటనకు ఈ ఫిదాలో నటనకు చాల వేరియేషన్ కనబడుతుంది. ఎంతో మెచ్యూర్డ్ పెరఫార్మెన్సు తో ఆకట్టుకున్నాడు. అమెరికా అబ్బాయిగా వరుణ్ క్లాస్ లుక్ తో బాగా నటించాడు. సాయి పల్లవికి తండ్రిగా నటించిన సీనియర్ నటుడు సాయిచంద్ కూడా అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ: డైరెక్టర్ శేఖర్ కమ్ముల గతచిత్రాలకు ఈ ఫిదాకి చాలా తేడా కనబడుతుంది. బాలీవుడ్ కహానీకి రీమేక్ అయినా అనామిక చిత్రాన్ని డైరెక్ట్ చేసిన శేఖర్ కమ్ముల ఆ తర్వాత మరే సినిమాని డైరక్ట్ చెయ్యలేదు. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తో మెగా హీరో వరుణ్ తేజ్ తో ఫిదా చిత్రాన్ని తెరకెక్కించాడు. గత మూడు సంవత్సరాల క్రితమే ఈ కథ ను రాసుకున్న శేఖర్ కమ్ముల కి ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ఇంత టైం పట్టింది. ఈ కథని శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్ రాజు ముందు పెట్టినప్పుడు దిల్ రాజు కూడా ఎవరో ఒక స్టార్ హీరోతో ఈ కథతో సినిమాని తెరకెక్కిచాలనే ఉద్దేశ్యంతో మహేష్ వంటి హీరోలను కలిసి కథ చెబితే వారు ఎవరైనా కొత్త హీరోతో ఈ కథని తెరకెక్కిస్తే సినిమా బావుంటుందని చెప్పడంతో ఈ కథ మెల్లగా మెగా హీరో వరుణ్ దగ్గరికి వచ్చింది. మరి ఒక చిన్న లైన్ తో కథని తయారు చేసి వరుణ్ తేజ్, సాయి పల్లవితో సినిమా అంతా బోర్ కొట్టకుండా నడిపించిన శేఖర్ డైరెక్షన్ కి ముచ్చటేస్తుంది. కథలో బలంలేకపోయినా కేరెక్టర్స్ తో సినిమాని నడిపించేసాడు డైరెక్టర్. శేఖర్ కమ్ముల తనదైన ట్రీట్మెంట్ తో ఈ సినిమాని చూసే ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్ర నాదే అనుకునే ఫీల్ తెప్పించగలిగాడు. శేఖర్ కమ్ముల ఇచ్చిన భానుమతి పాత్రలో సాయి పల్లవి పవర్ హౌస్ పెరఫార్మెన్స్ తో ఈ సినిమాని ఒక లెవల్ కి తీసుకెళ్లింది. ఫైనల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కుటుంబంతో కలిసి కూర్చుని చూడ దగ్గ చిత్రం ఫిదా..
ఇక ఫిదా మ్యూజిక్ విషయానికొస్తే శక్తి కాంత్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి మరో మెయిన్ ప్లస్ పాయింట్. చక్కని పాటలతో అలరించింది. శక్తి కాంత్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బావుంది. అమెరికా అందాలను హైలెట్ చేస్తూ... అదే టైం లో తెలంగాణ పల్లె అందాలను బ్రహ్మాండంగా చూపెట్టిన సినిమాటోగ్రఫీ పనితీరు కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ్ విలువలు ఆధ్యంతం అలరించాయి. ఈసారి కూడా దిల్ రాజు తన బ్యానర్ లో ఫిదాతో మంచి ఫ్యామిలీ హిట్ కొట్టేశాడనే చెప్పాలి.
ప్లస్ పాయింట్స్: వరుణ్ తేజ్, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల దర్శకత్వం, మ్యూజిక్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్
మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ డాక్యుమెంటరీ ఫీల్ రావడం, స్లో నేరేషన్, స్క్రీన్ ప్లే, ఎక్కువగా కొత్త నటీనటులు ఉండడం
పంచ్ లైన్: చూసిన వాళ్ళు 'ఫిదా'.... చూడని వాళ్ళు వెంటనే 'పదా'
రేటింగ్: 3.0 /5