మనసుకు నచ్చింది మూవీ రివ్యూ
బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
నటీనటులు: సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి, ప్రియదర్శి, ఆదిత్ అరుణ్, జాన్వీ స్వరూప్, సంజయ్ స్వరూప్, పునర్నవి భూపాలం
మ్యూజిక్ డైరెక్టర్: రాధన్
సినిమాటోగ్రఫీ: రవియాదవ్
నిర్మాత: సంజయ్ స్వరూప్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్: మంజుల ఘట్టమనేని
సూపర్ స్టార్ కుమార్తెగా కొన్ని సినిమాల్లో నటనతో తానేమిటో నిరూపించుకున్న మంజుల ఘట్టమనేని ఇప్పుడు దర్శకురాలిగా మారి మనసుకు నచ్చింది అనే సినిమాని తన ఓన్ బ్యానర్లోనే తెరకెక్కించింది. ఒక సూపర్ స్టార్ కి కూతురైనా, ఒక సూపర్ స్టార్ మహేష్ కి అక్క అయినా ఎప్పుడూ తన లిమిట్స్ దాటని మంజుల నటనతో పాటే డైరెక్షన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మీడియం బడ్జెట్ హీరో అయిన సందీప్ కిషన్ ని హీరోగా పెట్టి ఈ సినిమాని మొదలు పెట్టింది. గత రెండు నెలలుగా ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన మనసుకు నచ్చింది చిత్ర బృందం ఈ సినిమా ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. మరి స్టార్ హీరో అయిన మహేష్ బాబు తన అక్క కోసం ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ని అందించడం, అలాగే మనసుకు నచ్చింది సినిమా ప్రమోషన్స్ కి మహేష్ రావడం వంటి విషయాలు సినిమా మీద ఆసక్తిని అంచనాలు పెంచేసాయి. ఇప్పుడున్న కుర్ర హీరోలలో కాస్త డల్ అయిన సందీప్ కిషన్ కి ఈ సినిమా హిట్ ఎంతో అవసరం. మంచి బ్యానర్, అలాగే కొత్త దర్శకురాలు, తన స్టైలిష్ లుక్, అల్లరి తో ఆకట్టుకునే హీరో వెరసి ఈ మనసుకు నచ్చింది సినిమా కు ప్రేక్షకులు ఎలాంటి తీర్పు నిచ్చారో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
సూరజ్ (సందీప్ కిషన్), నిత్య (అమైరా దస్తూర్) ఒకే కుటుంబానికి చెందినవారు. అయితే కుటుంబ సభ్యులు వారిద్దరి స్నేహాన్ని చూసి ప్రేమగా భావించి వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని డిసైడ్ అవుతారు. అయితే సూరజ్, నిత్యా మేడలో తాళి కట్టేటప్పుడు..... తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే ప్రేమ కాదని ఆ పెళ్లి నుండి లేచిపోయి స్నేహితులతో కలిసి గోవా పారిపోతారు. ఇక అలా గోవా చేరిన ఆ స్నేహితులిద్దరు తమ మనసుకు నచ్చిన వారిని పెళ్లాడాలని డిసైడ్ అవుతారు. అయితే సూరజ్ అక్కడ గోవాలో నిఖిత (త్రిధా చౌదరి)ని చూసి మొదటి చూపులోనే మనసు పారేసుకొంటాడు. ఇక నిత్య కూడా అభయ్ (అరుణ్ ఆదిత్) మీద మనసు పడుతుంది. పెళ్లితో ఒక్కటవ్వాల్సిన వాళ్ళిద్దరూ వేరే వాళ్లమీద మనసుపడడంతో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. మరి ఈ కన్ఫ్యూషన్ లో సూరజ్ ప్రేమించిన నిఖితాని పెళ్ళాడతాడా? అలాగే నిత్యా కూడా తాను ప్రేమించిన అభయ్ తో కలిసి ఒక్కటవుతుందా? అసలు సూరజ్, నిత్యాలు పెళ్లి చేసుకుంటారా? అసలు సూరజ్, నిత్యాలు చివరికి కలిశారా లేదా? కలవడం కోసం వారు ఎదుర్కొన్న సవాళ్లేమిటి ? అనేది మనసుకు నచ్చింది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల నటన:
సందీప్ కిషన్ సూరజ్ పాత్రలో పర్వాలేదనిపించాడు. ఎప్పుడూ ఒకే ఎక్సప్రెషన్ తో ఉండే సందీప్ కిషన్ కామెడీ సన్నివేశాల్లో పర్వాలేదనిపించినా... ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తేలిపోయాడు. కొన్ని సీన్స్ లో సందీప్ అస్సలు ఆకట్టుకోలేకపోయాడు. ఇక హీరోయిన్ అమైరా దస్తూర్ అందంగా, గ్లామర్ తో కట్టిపడేసింది. నటనపరంగానూ పర్వాలేదనిపించుకోంది. మరో హీరోయిన్ త్రిధా చౌదరి ని ఈ సినిమాలో ఎందుకు తీసుకున్నారో అస్సలర్ధం కానీ పరిస్థితి. కేవలం త్రిదా ని బికినీ షాట్స్ కోసమే వాడుకున్నారు. ఇక నాజర్, ప్రియదర్శి, పునర్నవి భూపాలం, అభయ్, అరుణ్ ఆదిత్ లాంటి నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమా కి మ్యూజిక్ అందించిన రాధన్ అసలేవిధంగాను ఆకట్టుకోలేపోయాడు. పాటలు చాలా డల్ గా ఉన్నాయి. కాకపోతే నేపధ్య సంగీతంలో మాత్రం రాధన్ పర్వాలేదనిపించాడు. అసలు సినిమాలో పాటలొచ్చినప్పుడల్లా ప్రేక్షకుడు కుర్చీలోనుండి బయటికెళ్లే పరిస్థితి ఉంది. ఇకపోతే ఈ సినిమాకి ఉన్న ఒకే ఒక బలం సినిమాటోగ్రఫీ. రవియాదవ్ సినిమాటోగ్రఫీ చాలా సన్నివేశాల్లో హైలెట్ ఉంది. కొన్ని లొకేషన్స్ ని చాలా రిచ్ గా చూపెట్టాడు. కొన్ని అనవసర గ్రాఫిక్ షాట్స్ ను పక్కనపెట్టేస్తే ఈ సినిమాలో ఆయన కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే ఎడిటింగ్ పరమ చెండాలంగా అనిపిస్తుంది. చాలా సీన్స్ ని డ్రాగ్ చెయ్యాలి కానీ... వాటిని ఎడిటర్ అస్సలు పట్టించుకోలేదనట్లుగా తయారైంది పరిస్థితి. మంజుల భర్తే సంజయ్ ఈ సినిమాని నిర్మించాడు. మరి నిర్మాతగా సంజయ్ ఎక్కడా రాజి పడకుండా బాగానే ఖర్చు చేసాడు. అందుకే ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.
విశ్లేషణ:
సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల డైరెక్షన్ అంటే... ఏదో కొత్తగా లేకపోతె ఆమె ఎందుకు డైరెక్ట్ చేస్తుంది. ఆమె నుండి సినిమా వస్తుంది అంటే... ఏదో కొత్త తరహా ప్రేమ కథ అనుకున్నారు అందరూ. మంజుల రాసుకున్న కథ పూర్తిగా ఔడేటెడ్ కథ కావడం, డైరెక్షన్ లో మంజులకు అస్సులు పట్టు లేకపోవడం తో ఈసినిమా లెక్క తప్పింది. ఇప్పటికే చాలా సార్లు చూసేసిన ఒక ప్రేమకథ ని ఎంచుకున్న మంజుల కథ ఎంపికలో రొటీన్ గా వెళ్ళినా కథనం లో మాత్రం కొత్తదనం కోసం ప్రయత్నం ప్రకృతి ని ఆరాధించే హీరోయిన్, ఏదీ లెక్కచేయని హీరో ల మధ్య కెమిస్ట్రీ వర్క్ అయినా సినిమా ఆసాంతం బోరింగ్ గానే కథనం ఉంటుంది. మరింత శ్రద్ధ పెట్టుకుని డైలాగులు, స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటె బాగుండేది కదా అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ లొకేషన్ ల కోసమే సినిమాని తీశారా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకున్న మెయిన్ ప్లస్ పాయింట్ మాత్రం నేచురల్ గా వినిపించిన మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఈ సినిమాకి హై లైట్ గా నిలిచింది. మహేష్ మాట్లాడే ఆ కొద్దిసేపూ ఖచ్చితంగా మంచి ఫీల్ కలుగుతుంది. అలాగే అక్కడక్కడా ట్విస్ట్ లు పెట్టి ప్రేక్షకుడిని మెప్పించే ప్రయత్నం చేసారు. పెర్ఫార్మెన్స్ లే ప్రధానంగా సాగే ఈ చిత్రం కి హీరో హీరోయిన్ ల కెమిస్ట్రీ పెద్ద పాజిటివ్ పాయింట్. మరి కథ, కథనం, డైరెక్షన్ పరంగాను మంజుల ఈ సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయింది.
ప్లస్ పాయింట్స్: సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, మహేష్ వాయిస్
మైనస్ పాయింట్స్: కథ, కథనం, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, మ్యూజిక్, ట్విస్టులు, కామెడీ లేకపోవడం, క్లైమాక్స్
రేటింగ్: 2.0/5