రారండోయ్ వేడుక చూద్దాం మూవీ రివ్యూ
నటీనటులు: నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, అన్నపూర్ణ, వెన్నెల కిషోర్, పోసాని, సప్తగిరి, హైపర్ ఆది మరియు తాగుబోతు రమేష్
మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్
ప్రొడ్యూసర్: నాగార్జున
డైరెక్టర్: కళ్యాణ్ కృష్ణ
'జోష్' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున వారసుడు నాగ చైతన్య తన రెండో చిత్రం 'ఏమాయచేసావే' తో అందరిని ఆకట్టుకున్నాడు. కాకపోతే మధ్యలో 'ఆటోనగర్ సూర్య, బెజవాడ' అంటూ కత్తి పట్టి మాస్ సినిమాల వెంట పడ్డ చైతు కి ఆ చిత్రాలు మంచి గుణపాఠాన్ని నేర్పాయి. మళ్ళీ 'ప్రేమమ్' అంటూ రొమాంటిక్ మూవీ తో ప్రేక్షకులను కనివిందు చేసిన నాగ చైతన్య సమంత తో ప్రేమ, పెళ్లి వ్యవహారంలో బిజీగా ఉంటూనే చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇప్పుడు భ్రమరాంబ (రకుల్ ప్రీత్ సింగ్) తో కళ్యాణ్ కృష డైరెక్షన్ లో చేసిన కుటుంబకథా చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం' ప్రేక్షకులని పలకరించడానికి సిద్దమయ్యింది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణ నాగార్జునతో 'సోగ్గాడే చిన్ని నాయన' వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించి మరలా అక్కినేని ఫ్యామిలీ కుర్రాడితోనే ఈ చిత్రాన్ని చేసాడు. పల్లెటూరి వాతావరణంలో జరిగే పెళ్లి వేడుకలు హైలెట్ చేస్తూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో చాలా ట్రెడిషనల్ అమ్మాయిగా లంగావోణీలు, చుడీదార్స్ లో కనబడబోతుంది. 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రాన్ని స్వయంగా నాగ్ నిర్మించాడు. అన్నపూర్ణ స్టూడిస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు నాగార్జున. పల్లెటూరి వాతావరణంలో అమ్మాయితో ప్రేమ, అదేసమయంలో తండ్రితో ఉన్న ఎటాచ్మెంట్, అమ్మాయి తండ్రితో పగా ప్రతీకారాలు... అంటూనే 'అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం' వంటి డైలాగ్స్ తో ప్రేక్షకులను మెప్పించడానికి 'రారండోయ్ వేడుక చూద్దాం' రెడీ అయ్యింది. మరి నాగ చైతన్య, భ్రమరాంబ ప్రేమను గెలుచుకోవడానికి ఎటువంటి తంటాలు పడ్డాడో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: బంధువుల పెళ్ళిలో ఒకరినొకరు కలుసుకుని పరిచయాలు ఏర్పడతాయి భ్రమరాంభకి (రకుల్ ప్రీత్ సింగ్) శివ (నాగ చైతన్య)కి. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారేలోపు భ్రమరాంబ పై చదువులు కోసం శివ వుండే వైజాగ్ కి వెళుతుంది. అక్కడ కాలేజీలో వీరి ప్రేమాయణం పట్టాలెక్కుతోంది.ఆదికి (సంపత్)పదిమంది కొడుకుల తర్వాత పుట్టిన తన కూతురు భ్రమరాంబ అంటే పంచ ప్రాణాలు.ఆమె కోసం ఏమైనా చేస్తాడు. మరోపక్క శివకి తన తండ్రి కృష్ణ (జగపతిబాబు) అంటే గౌరవంతో పాటే చాలా ఇష్టం కూడా ఉంటుంది. తన తండ్రి కోసం తాను ప్రేమించిన అమ్మాయిని వదులుకునే లెవల్లో ఆ ప్రేమ ఉంటుంది. అయితే కృష్ణ, ఆది, వీర భద్ర లు ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. వీరి కుటుంబాలు ఒకప్పుడు ఎంతో కలిసిమెలిసి ఉండేవి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కుటుంబాలు పగతో విడిపోయి దూరమైపోతాయి. ఇక భ్రమరాంబ, శివని ప్రేమిస్తున్నాని చెప్పడంతో అతన్నే పెళ్లి చేసుకుంటానని తండ్రి ఆదితో చెబుతుంది. కానీ ఉన్నట్టుండి ఆది ఆ పెళ్ళికి ఒప్పుకోకుండా శివని చంపే ప్రయత్నం చేస్తాడు. అసలు శివ అంటే ఆదికి ఎందుకు నచ్చదు? అసలు ఆది కుటుంబానికి కృష్ణ కుటుంబానికి మధ్యన ఉన్న పగకు ఉన్న కారణం ఏమిటి?శివ భ్రమరాంభని ఏ విధంగా దక్కించుకుంటాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ మీద వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు: నాగ చైతన్య, శివ పాత్రకు చక్కగా సరిపోయాడు. ఈ చిత్రంలో మునుపటి చిత్రాలకన్నా నాగ చైతన్య కొత్తగా కనిపించాడు. మొదటిసారి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో నటించిన నాగ చైతన్య తన కేరెక్టర్ ని బాగానే పండించాడు. కాకపోతే కొన్ని చోట్ల నాగార్జున మేనరిజమ్స్‌ను ఇమిటేట్ చేసినట్లు స్పష్టంగా తెలిసిపోతుంది. అలాగే దర్శకుడు రకుల్ ప్రీత్ సింగ్ ని భ్రమరాంబగా చాలా బాగా డిజైన్ చేసాడు. ఇప్పటివరకు రకుల్ నటించిన మోడరన్ పాత్రలకు భిన్నంగా చాలా ట్రెడిషనల్ గా లంగాఓణీలతో మెస్మరైజ్ చేసింది. పల్లెటూరి అమ్మాయిగా భ్రమరాంబ పాత్రలో రకుల్ చక్కగా సూటయ్యిందనే చెప్పాలి. కాకపోతే రకుల్ కి ఎవరు డబ్బింగ్ చెప్పరోగాని... అంతగా ఆమెకు సూట్ అవ్వలేదు. అలాగే ఈ చిత్రానికి మరొక హైలెట్ నాగార్జున వాయిస్ ఓవర్. నాగార్జున నిర్మాతగానే కాకుండా ఈ చిత్రానికి తన వాయిస్ ని అందించారు. ఇక కూతురిని అమితంగా ఇష్టపడే పాత్రలో సంపత్, నాగచైతన్య తండ్రి పాత్రలో జగపతిబాబు చాల చక్కటి నటనను ప్రదర్శించారు. వెన్నెలకిషోర్ కామెడి పార్ట్ ఆకట్టుకునేలా వుంది. పోసాని కృష్ణమురళి, సప్తగిరి, తాగుబోతు రమేష్, రఘుబాబు కామెడీ ఆకట్టుకునేలా లేదు. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు: దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్ని నాయనా తరహాలో సినిమాను ఎంటర్టైనింగ్గా తెరక్కించే ప్రయత్నం చేశాడు. రొటీన్ కథని తీసుకుని కొత్తగా ప్రెజెంట్ చేద్దామనుకున్నాడు. ఇక రారండోయ్ చిత్రం ఆధ్యంతం మనకు రామ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'పండగ చేస్కో' చిత్రాన్ని తలపిస్తుంది. ఆ చిత్రంలో కూడా ఇలాగే ప్రేమ పెళ్లి వలన రెండు కుటుంబాలు విడిపోవడం వంటి సన్నివేశాలు ఉంటాయి. ఇంకా ఈ రారండోయ్ చిత్రంలో కూడా ఒక ప్రేమ పెళ్లి వలన ఇద్దరు ప్రాణ స్నేహితులు విపోతారు. కాకపోతే కళ్యాణ్ కృష్ణ నాగచైతన్యను సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు. అక్కినేని అభిమానులను ఆకట్టుకునేలా కబడ్డీ ఫైట్, క్లైమాక్స్ ఫైట్‌ను డిజైన్ చేశారు. దేవిశ్రీ సమకూర్చిన సంగీతం పర్వాలేదు. అన్ని పాటలూ బావున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. విశ్వేశ్వర్ కెమెరా పనితనం హైలైట్‌గా ఉంది. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. నిర్మాత నాగార్జున ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు.
ప్లస్పాయింట్స్: నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటన, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ, కామెడీ, దర్శకత్వం, స్లో నేరేషన్, రొటీన్ క్లైమాక్స్
రేటింగ్: 2.5 /5