Fri Nov 22 2024 08:31:44 GMT+0000 (Coordinated Universal Time)
కేరళలో మళ్లీ నిపా వైరస్
మరోసారి కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతుంది. వైరస్ సోకి ఇద్దరు మరణించడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది.
ఏదైనా వైరస్ తొలుత వచ్చేది కేరళ రాష్ట్రంలోనే. దీనికి ప్రత్యేకించి కారణాలు లేకపోయినా మరోసారి కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతుంది. వైరస్ సోకి ఇద్దరు మరణించడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. వెంటనే చర్యలు ప్రారంభించింది. నిపా వైరస్ సోకిందని కేరళ ఆరోగ్య వైద్య శాఖ ధృవీకరించింది. వైరస్ సోకిన వారి కుటుంబాలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిని ఐసీయూలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గతంలోనూ...
గతంలోనూ కేరళలో నిపా వైరస్ కలకలం రేపింది. ఎక్కువ మంది విదేశాల్లో ఉండటం, అంతర్జాతీయంగా రాకపోకలు ఎక్కువగా ఉండటం వల్ల వైరస్ సోకినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. తాజాగా కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. వైద్యాధికారులందరినీ అప్రమత్తం చేశారు. 2007లోనూ కేరళలో నిపా వైరస్ వ్యాప్తి చెంది పలువురు కన్నుమూశారు.
మాస్క్ ధరించాలంటూ...
జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు వంటివి ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొందరిలో మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణం కూడా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. నిపా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జంతువుల నుంచి ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ లు విధిగా ధరించాలని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే భయపడాల్సిన పనిలేదని కూడా వైద్యులు చెబుతున్నారు.
Next Story