Fri Nov 22 2024 10:10:10 GMT+0000 (Coordinated Universal Time)
డ్యామ్ వద్ద పేలిన ట్రాన్స్ ఫార్మర్ .. 15 మంది మృతి
ఒక పోలీసు సబ్-ఇన్స్పెక్టర్, ఐదుగురు హోంగార్డులతో సహా సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. అలకనంద నదికి పై ఉన్న చమోలి డ్యామ్ వద్ద ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో 15 మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఐదుగురు పోలీసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక పోలీస్ అధికారి, ఐదుగురు హోం గార్డులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయాలు పాలవ్వడంతో.. వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి మురుగేశన్ తెలిపిన వివరాల ప్రకారం..ఒక పోలీసు సబ్-ఇన్స్పెక్టర్, ఐదుగురు హోంగార్డులతో సహా సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
నమామీ గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనందా నదిపై ఉన్న వంతెనకు విద్యుత్ ప్రవాహం జరగడం వల్ల ఈ ఘోరం జరిగిందన్నారు. ట్రాన్స్ ఫార్మర్ పేలిపోవడంతో వంతెన రెయిలింగ్ కు విద్యుత్ పాస్ అయి ఉంటుందని తెలిపారు. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా ఎయిమ్స్ రిషికేశ్కు తరలిస్తున్నారు. ఈ ఘటనలో బద్రీనాథ్ హైవేపై ఉన్న పోలీస్ అవుట్పోస్టు ఇన్ఛార్జ్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు డీజీపీ అశోక్కుమార్ వెల్లడించారు. ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. వెంటనే మెజిస్టీరియల్ విచారణ చేయాలని ఆదేశించారు.
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ఐఎండీ రాష్ట్రానికి రెడ్, ఆరెంజ్ అలర్ట్ లు జారీ చేసింది. చమోలి, హరిద్వార్, రుద్రప్రయాగ్ ప్రాంతాలకు వరద హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షాలు, వరదల హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు అలర్ట్ గా ఉన్నాయి.
Next Story