Mon Dec 23 2024 07:05:46 GMT+0000 (Coordinated Universal Time)
చార్ ధామ్ యాత్ర.. 6 రోజుల్లో 16 మంది మృతి !
చెక్ పోస్టుల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో చాలామంది యాత్రికలు కరోనా, ఇతర ఆరోగ్యపరమైన టెస్టులు చేయించుకోకుండానే వెళ్తున్నారు.
ఉత్తరాఖండ్ : చార్ ధామ్ యాత్ర.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్ నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యుమునోత్రితో కూడినదే చార్ ధామ్ యాత్ర. ఈ ఏడాది మే 3న ప్రారంభమైన ఈ యాత్రకు భక్తులు పెద్దసంఖ్యలో వెళ్తున్నారు. చెక్ పోస్టుల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో చాలామంది యాత్రికలు కరోనా, ఇతర ఆరోగ్యపరమైన టెస్టులు చేయించుకోకుండానే వెళ్తున్నారు. ఫలితంగా చాలామంది గుండెపోటుకు గురై మరణిస్తున్నట్లు అక్కడి అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు.. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వారు చార్ ధామ్ యాత్రకు వెళ్లే ముందు వైద్యుల సూచనలు తీసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
ఎందుకంటే, మే 3న యాత్ర ఆరంభం కాగా, మొదటి ఆరు రోజుల్లోనే 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వారే ఉన్నారు. సముద్ర మట్టానికి 10,000 నుంచి 12,000 అడుగుల ఎత్తులోని మందిరాలను దర్శించే క్రమంలో వీరు ప్రాణాలకు ప్రమాదం కొనితెచ్చుకుంటున్నారు. కరోనాకు ముందు చార్ ధామ్ యాత్రకు వచ్చే యాత్రికులు ఫిట్ నెట్ సర్టిఫికేట్ ను తీసుకురావాల్సి ఉండేది. కానీ.. ఇప్పుడు అధికారులు దానిని పట్టించుకోవడమే లేదు. రోజుకు ఇంతమందినే అనుమతిస్తామని చెప్పినప్పటికీ.. భక్తుల సంఖ్యను నియంత్రించడంలో అలసత్వం వహిస్తున్నట్లు కొట్టొచ్చినట్లు తెలుస్తోంది.
భక్తుల సంఖ్యా పరంగా నియంత్రణలు అమలు కాకపోవడంతో.. చెక్ పోస్టుల వద్ద రద్దీ ఎక్కువవుతోంది. యాత్రకు వచ్చే భక్తులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం లేదు. పరీక్షలు చేయించుకున్న యాత్రికులు అన్ ఫిట్ అని తేలినా.. ఏం జరిగినా మాదే బాధ్యతన్న ధ్రువీకరణ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని ఉత్తరకాశి చీఫ్ మెడికల్ ఆఫీసర్, డాక్టర్ కేఎస్ చౌహాన్ తెలిపారు. చార్ ధామ్ యాత్రలో భక్తులు చనిపోవడంపై ఉత్తరాఖండ్ ఆరోగ్యమంత్రి ధన్ సింగ్ రావత్ స్పందించారు. నాలుగు ధామాల వద్ద యాత్రికుల కోసం ఆరోగ్య సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. హెల్త్ సర్టిఫికెట్ లు కూడా తీసుకురావాలని త్వరలో భక్తులను కోరనున్నట్లు ఆయన తెలిపారు.
Next Story