Thu Jan 02 2025 19:59:42 GMT+0000 (Coordinated Universal Time)
కర్ణాటకకు చేరిన లంపి డిసీజ్.. టెన్షన్
కర్ణాటక రాష్ట్రంలో లంపి స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్డి) కారణంగా 2,070 పశువులు చనిపోగా, సుమారు 19,000 మంది ప్రభావితమయ్యారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ వైరల్ వ్యాధితో బాధపడుతున్న పశువులకు చికిత్స, టీకాలు వేయడానికి, పశువులను కోల్పోయిన వారికి సహాయం చేయడానికి 13 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశించారు. ముఖ్యంగా హవేరి, కోలార్ జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. "ఈ వ్యాధి 28 జిల్లాల్లోని 160 తాలూకాలలోని 4,380 గ్రామాల్లో గుర్తించబడింది. ఈ వ్యాధి బారిన పడిన మొత్తం 45,645 పశువుల్లో 26,135 కోలుకోగా, 2,070 చనిపోయాయి. పశువులను కోల్పోయిన వారికి పరిహారంగా ఇప్పటికే రెండు కోట్ల రూపాయలను విడుదల చేశారు." అని ప్రకటన వచ్చింది.
కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పశువుల్లో సోకే ఈ చర్మ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఆయా ప్రాంతాల్లోని యంత్రాంగాన్ని సీఎం అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హవేరి, కోలార్ జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వ్యాధి సోకిన పశువుల చికిత్సకు అదనంగా 5 కోట్లు, వాటికి టీకాలు వేయడానికి 8 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఈ వ్యాధిని గుర్తించిన ఐదు కిలోమీటర్ల పరిధిలోని ఆరోగ్యవంతమైన పశువులకు కూడా తప్పనిసరిగా టీకాలు వేయించాలి. భారత ప్రభుత్వం ఆమోదించిన కంపెనీల నుండి వెంటనే 15 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అనారోగ్యంతో ఉన్న ఆవుల పాలు తాగడం వల్ల చర్మ వ్యాధి ప్రజలకు వ్యాపించదనీ, ఈ విషయంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని బసవరాజ్ బొమ్మై సూచించారు. ఇతర జిల్లాలకు వ్యాపించకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు.
Next Story