Mon Dec 23 2024 15:23:05 GMT+0000 (Coordinated Universal Time)
వజ్రాలు పొదిగిన 27 కోట్ల విలువైన వాచ్ దొరికింది
76 తెల్లని వజ్రాలతో 18 క్యారెట్ వైట్ గోల్డ్ తో ఈ వాచ్ ను తయారుచేశారు
దొరికింది.. అంటే ఎక్కడైనా పడిపోతే ఇతరులకు దొరికిందని అనుకోకండి.. ఎందుకంటే ఇది కస్టమ్స్ అధికారుల సోదాలలో దొరికిన వస్తువు. గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న వస్తువులలో 27 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు పొదిగిన తెల్లని బంగారు చేతి గడియారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి వజ్రాలు పొదిగిన బ్రాస్లెట్తో పాటు ఐఫోన్ 14 ప్రోను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.
కస్టమ్స్ సుంకాలను, ట్యాక్స్ లను ఎగ్గొట్టడానికి ఈ వస్తువులు అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిసింది. వాణిజ్య- విలాసవంతమైన వస్తువులకు సంబంధించి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతిపెద్ద అచీవ్మెంట్ ఇదని అధికారులు తెలిపారు. అమెరికన్ ఆభరణాల వ్యాపారి, వాచ్మేకర్ జాకబ్ & కో.చే తయారు చేయబడిన గడియారం దొరికిందని.. బంగారంతో తయారు చేసి, వజ్రాలు పొదిగిన వాచ్ ఇదని కస్టమ్స్ అధికారులు తెలిపారు. 76 తెల్లని వజ్రాలతో 18 క్యారెట్ వైట్ గోల్డ్ తో ఈ వాచ్ ను తయారుచేశారు. డయల్ ను కూడా వజ్రాలతో చేశారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రయాణీకుల సామానును పరిశీలించగా.. పియాజెట్ లైమ్లైట్ స్టెల్లా, ఐదు రోలెక్స్లతో సహా మరో ఆరు చేతి గడియారాలు రికవరీ చేశారు. పియాజెట్ వాచ్ ధర 31 లక్షలు అని, రోలెక్స్ వాచ్ లు 15 లక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. సీజ్ చేసిన వాచ్ ల ధర 28 కోట్ల రూపాయలని అధికారులు తెలిపారు.
"ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అప్రమత్తమైన కస్టమ్స్ అధికారులు.. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిని సీజ్ చేయగలిగారు. భారతీయ కస్టమ్స్ ప్రయాణీకులకు భంగం కలిగించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో అక్రమ రవాణాను అరికట్టడం కూడా చేస్తుంది" అని ఢిల్లీ కస్టమ్స్ చీఫ్ కమిషనర్ సుర్జిత్ భుజబల్ ఒక ప్రకటనలో తెలిపారు. వాణిజ్య లేదా విలాసవంతమైన వస్తువులలో, ఐజిఐ విమానాశ్రయంలో ఇది అతిపెద్ద సీజ్ ఇదని అధికారులు తెలిపారు. వీటి విలువ ప్రకారం చూస్తే సుమారు 60 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో సమానమని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Next Story