Fri Nov 22 2024 21:16:52 GMT+0000 (Coordinated Universal Time)
కుర్ కురే ప్యాకెట్లలో రూ.500 నోట్లు.. దెబ్బకు షాపులన్నీ ఖాళీ
వివిధ కంపెనీలకు చెందిన కుర్ కురే, తడ్కా ప్యాకెట్లలో రూ.500 నోట్లు కనిపించాయి. 5 రూపాయలు, 2 రూపాయలు..
ఈ రోజుల్లో పిల్లలు.. తమకు కావాల్సింది కొనిచ్చే వరకూ ఊరుకోరు. అవసరమైతే ఆ షాపుముందే గోలగోల చేసి మరీ తమకు కావాల్సింది కొనించుకుంటారు. పిల్లలు బాగా ఇష్టపడి తినేవాటిలో చాక్లెట్లు, బిస్కెట్లు.. ఇంకా లేస్, కుర్ కురే వంటి స్నాక్ ఐటమ్స్ ఉంటాయి. చాలామంది తల్లిదండ్రులు అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని కొనిచ్చేందుకు ఇష్టపడరు. కానీ కర్ణాటకలోని ఓ గ్రామంలో సీన్ రివర్స్ అయింది. కుర్ కురే ప్యాకెట్ల కోసం తల్లిదండ్రులే షాపులముందు బారులు తీరారు. ఎందుకంటే ప్యాకెట్లలో రూ.500 నోట్లు వస్తున్నాయట.
వివిధ కంపెనీలకు చెందిన కుర్ కురే, తడ్కా ప్యాకెట్లలో రూ.500 నోట్లు కనిపించాయి. 5 రూపాయలు, 2 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఒక్కో కుర్కురే ప్యాకెట్లో 5 నుంచి 6 వరకు కరెన్సీ నోట్లు దొరికాయి. కొందరికి 2, 3 నోట్లు కూడా వచ్చాయి. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పాకి గ్రామస్తులందరికీ తెలియడంతో అందరూ ఆ ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. ఫలితంగా రూ.35 వేల వరకూ డబ్బు దొరికిందట. అవి ఫేక్ కరెన్సీ కాదు. నిజమైన నోట్లే కావడం గమనార్హం. కర్నాటకలోని రాయచూర్ జిల్లా లింగసుగూర్ తాలూక హునూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
నాలుగైదు రోజులుగా హూనూరు గ్రామంలోని కొన్ని దుకాణాల్లో కొనుగోలు చేసిన కుర్ కుర్ ప్యాకెట్లలో డబ్బులు దొరుకుతున్నాయనే విషయం ఆ చుట్టు పక్కల గ్రామాలకు వ్యాపించింది. అంతే.. కుర్కురే కొనుగోళ్లకు అంతా క్యూ కట్టారు. దీంతో దుకాణాల్లోని కుర్ కురే ప్యాకెట్లు ఇట్టే అమ్ముడయ్యాయి. ఎక్కడా మచ్చుకైనా ఒక ప్యాకెట్ ఉండట్లేదు. ఒక్కరోజే బస్తాల కొద్దీ కుర్కురే ప్యాకెట్లు అయిపోవటంతో ఆ వెంటనే దుకాణదారులు కొత్త స్టాక్ తెచ్చారు. కానీ, వాటిలో మాత్రం ఎలాంటి కరెన్సీ నోట్లు కనిపించలేదట. ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
Next Story