5జీ స్పెక్ట్రమ్ సేల్.. వామ్మో అంతనా..?
5జీ స్పెక్ట్రమ్ సేల్.. వామ్మో అంతనా..?
భారత్ లో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. 72 గిగాహెర్జ్ 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం వేలం మొదలైంది. తొలిరోజే భారీ స్థాయిలో బిడ్డింగ్ వచ్చింది. మొదటి రోజున బిడ్డింగ్ రూ.1.45 లక్షల కోట్లు దాటింది. భారత్ లో టెలికాం స్పెక్ట్రమ్ కోసం ఇంత భారీ వేలం నిర్వహించడం ఇదే ప్రథమం జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ గ్రూప్ కు చెందిన యాక్టివ్ లీ వంటి సంస్థలు పాల్గొనడంతో తొలిరోజే అద్భుతమైన స్పందన కనిపించింది. తొలిరోజు వేలంలో నాలుగు రౌండ్లు నిర్వహించామని.. బిడ్డింగ్ మొత్తం రూ.1.45 లక్షల కోట్లు దాటిందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రేపు ఐదో రౌండ్ వేలం చేపడతామని తెలిపారు. ఆగస్టు 15 నాటికి స్పెక్ట్రమ్ కేటాయింపులు పూర్తవుతాయని.. ఈ ఏడాది చివరినాటికి దేశంలోని పలు నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం 600MHz,700MHz, 800MHz,900MHz,1800MHz, 2100MHz, 2300MHz, 3300MHz, 26GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో వేలం జరుగుతుంది.స్పెక్ట్రమ్ సిగ్నల్ పూర్తిగా అమ్ముడు పోయేవరకు వేలం నిర్వహించనున్నారు. కొన్ని రోజుల పాటు సాగే వేలంలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.