Mon Dec 23 2024 08:41:58 GMT+0000 (Coordinated Universal Time)
రైలు ప్రమాదం నుంచి తప్పించిన మహిళ.. సన్మానం చేసిన అధికారులు
ప్రమాదానికి గుర్తు అయిన ఎరుపు రంగు బట్ట పట్టుకుని ట్రాక్ వైపు పరుగులు పెట్టింది. చేతిలోని ఎరుపు రంగు క్లాత్ గాలిలో ఊపుతూ
మంగళూరు నుంచి ముంబైకి వెళ్లే మత్స్యగంధ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం జరగకుండా కాపాడిన మహిళను రైల్వే అధికారులు సన్మానించారు. చంద్రావతి అనే 70 ఏళ్ల మహిళ ఈదురుగాలులకు రైల్వే ట్రాక్ పై పడిన వృక్షాన్ని గుర్తించి రైలును ఆపి పెను ప్రమాదాన్ని తప్పించింది. ట్రాక్ పై వేగంగా దూసుకొస్తున్న రైలును సదరు మహిళ రైలును ఆపిన తీరుపై అధికారులు ప్రశంసలు కురిపించారు.
చంద్రావతి పాటిల్ అనే 70 ఏళ్ల మహిళ మంగళూరులో నివాసం ఉంటోంది. వారి ఇల్లు రైల్వేట్రాక్ సమీపంలోనే ఉంటుంది. మార్చి 21 మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో తన ఇంటిముందు కూర్చున్న చంద్రావతి పాటిల్ ఈదురు గాలులకు రైల్వే ట్రాక్ పై ఓ భారీ వృక్షం కూలిన విషయాన్ని గమనించింది. అదే సమయంలో అల్లంత దూరం నుంచి ట్రాక్ పై రైలు దూసుకురావడాన్ని గమనించింది. రైలు అలాగే వస్తే ప్రమాదం జరుగుతుందని గ్రహించిన ఆమె.. ఎలాగైనా ఆ రైలుని ఆపాలనుకుంది. అధికారులను అప్రమత్తం చేయటానికి ఇంటినుంచి పరుగు పరుగున బయల్దేరింది.
ప్రమాదానికి గుర్తు అయిన ఎరుపు రంగు బట్ట పట్టుకుని ట్రాక్ వైపు పరుగులు పెట్టింది. చేతిలోని ఎరుపు రంగు క్లాత్ గాలిలో ఊపుతూ ట్రాక్ వెంబడి పరిగెత్తింది. ఈ క్రమంలో తనకు ఏమన్నా అవుతుందోమోనని కూడా ఆలోచించలేదు. దూరంగా ఎరుపు రంగు క్లాత్ తో ఓ మహిళ పరుగులు పెట్టటాన్ని మత్స్యగంధ ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ గుర్తించి వెంటనే అప్రమత్తమై రైలుకి బ్రేకులు వేయడంతో రైలు వేగం తగ్గి.. సరిగ్గా చెట్టు కూలిన చోటుకి దగ్గరగా వచ్చి ఆగింది.
ట్రాక్ పై కూలిన చెట్టును గమనించిన లోకో పైలట్.. పెద్ద ప్రమాదం తప్పిందని..ఆమె కనుక అప్రమత్తం చేయకపోతే ఏం జరిగేదో అని ఊహించానికే దారుణంగా ఉందన్నాడు. అతిపెద్ద ప్రమాదం తప్పించిన ఆమెను అభినందించి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని లోకో పైలెట్ ఉన్నతాధికారులకు తెలుపగా.. ఎంతోమంది ప్రయాణీకుల ప్రాణాలు కాపాడిన చంద్రావతిని రైల్వే అధికారులు ప్రశంసించి ఘనంగా సన్మానించారు.
Next Story