దేశ రాజధానిని ఇంకా వెంటాడుతున్న మంకీపాక్స్ భయం
ఆమె గత నాలుగు నెలలుగా భారతదేశంలో ఉంటోంది.
మంకీపాక్స్ భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఢిల్లీలో ఆదివారం నాడు ఏడో మంకీపాక్స్ వ్యాధి కలకలం మొదలైంది. మంకీపాక్స్ కేసులకు సంబంధించి నోడల్ ఆఫీసర్, ఢిల్లీలోని లోక్ నాయక్ హాస్పిటల్లో డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వినీత్ రెల్హాన్ మాట్లాడుతూ.. తాజాగా మంకీపాక్స్ బారిన పడిన రోగి నైజీరియాకు చెందిన 24 ఏళ్ల యువతి అని తేలింది. ఆమె గత నాలుగు నెలలుగా భారతదేశంలో ఉంటోంది. ఆమె ఢిల్లీలోని శారదా విహార్ ప్రాంతంలో నివసిస్తోంది. జ్వరం, గొంతునొప్పి, చేతులు, ముఖంపై బొబ్బలు వంటి లక్షణాలతో ఆమె ఆసుపత్రికి వచ్చినట్లు డాక్టర్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె నమూనాలను ఎన్ఐవి పూణేకు పంపారు, అక్కడ సదరు రోగికి మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది. "రోగితో కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తించడానికి ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) బృందానికి సమాచారం అందించాము" అని డాక్టర్ వినీత్ రెల్హాన్ చెప్పారు.