ఊహించని విషాదం: అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా.. భారీ వరద
సెర్చింగ్, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. NDRF, SDRF, పోలీసు బృందాలు ప్రజలను రక్షించే పనిలో ఉన్నాయని చెప్పారు.
పశ్చిమ బెంగాల్లోని జల్పైగురిలో విజయదశమి సందర్భంగా అమ్మవారి విగ్రహ నిమజ్జనం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆకస్మిక వరదల కారణంగా మాల్ నదిలో ఎనిమిది మంది కొట్టుకుపోయారు. ఒక్కసారిగా వచ్చిన వరదకు పలువురు అదృశ్యమయ్యారని సీనియర్ అధికారి తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకు వందలాది మంది మాల్ నది ఒడ్డున గుమిగూడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. "అకస్మాత్తుగా, ఆకస్మిక వరదలు సంభవించాయి. ప్రజలు కొట్టుకుపోయారు. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటికి సుమారు 50 మందిని రక్షించాము" అని జల్పైగురి జిల్లా మేజిస్ట్రేట్ మౌమితా గోదారా PTI కి చెప్పారు. స్వల్ప గాయాలైన 13 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు. సెర్చింగ్, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. NDRF, SDRF, పోలీసు బృందాలు ప్రజలను రక్షించే పనిలో ఉన్నాయని ఆమె చెప్పారు.