Tue Nov 26 2024 11:27:24 GMT+0000 (Coordinated Universal Time)
ఇల్లు కూలుస్తుండగా లభ్యమైన బంగారు నిధి.. పంచేసుకున్న కూలీలు
యజమానికి ఈ విషయం తెలియకుండా.. గుట్టుచప్పుడు కాకుండా ఆ నిధిని 8 మంది కూలీలు పంచేసుకున్నారు. వారిలో ఓ కూలి ..
కొత్త భవనం కట్టేందుకు 2600 గజాల్లో ఉన్న ఓ ఇంటిని కూలుస్తుండగా.. ఓ బంగారు నిధి బయటపడింది. అది చూసిన కూలీలు గుట్టుచప్పుడు కాకుండా ఆ బంగారు నాణేలను, అరుదైన ఆభరణాలను పంచేసుకున్నారు. మధ్యప్రదేశ్ లోని ధార్ లో ఆగస్టు 21న జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెల్తే.. శిథిలావస్థలో ఉన్న ఓ ఇంటిని కూల్చివేసేందుకు 8 మంది కూలీలను పురమాయించారు. పనులు మొదలుపెట్టిన కూలీలు.. ఆ ఇంటిలో కొంతభాగాన్ని కూల్చివేశారు. శిథిలాలను తరలిస్తున్న క్రమంలో వారికి ఓ లోహపు పాత్ర కనిపించింది. అందులో ఏముందా అని తెరిచి చూడగా.. 84 పురాతన బంగారు నాణేలు, ఆభరణాలు, విలువైన వస్తువులు కనిపించాయి.
ఇంకేముంది.. యజమానికి ఈ విషయం తెలియకుండా.. గుట్టుచప్పుడు కాకుండా ఆ నిధిని 8 మంది కూలీలు పంచేసుకున్నారు. వారిలో ఓ కూలి తనకు వచ్చిన వాటాలో ఒక బంగారు నాణేన్ని విక్రయించి సరుకులతో పాటు ఓ మొబైల్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత మద్యం సేవించాడు. ఆ మత్తులో తమకు నిధి దొరికిన విషయాన్ని అపరిచితులతో చెప్పేశాడు. విషయం పోలీసుల చెవిన పడటంతో.. వారు రంగంలోకి దిగారు. కూలీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నిధిని తామే పంచుకున్నామని చెప్పడంతో దానిని రికవరీ చేసేపనిలో ఉన్నారు పోలీసులు. కూలీలకు దొరికిన లోహపు పాత్రలోని ఆభరణాలు, నాణేల విలువ రూ. 60 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అయితే, పురావస్తు శాఖ మాత్రం ఆ సొత్తు విలువ రూ. 1.25 కోట్ల వరకు ఉంటుందని చెప్తోంది. ఆ నాణేలు 200 ఏళ్ల క్రితానికి చెందినవని, జోధ్ పూర్ రాజ్యం ఉన్న సమయంలో వాటిని ముద్రించిఉంటారని పురావస్తుశాఖ అభిప్రాయపడుతోంది.
Next Story