Fri Dec 20 2024 10:46:15 GMT+0000 (Coordinated Universal Time)
Beggar : చేతిలో చిప్ప.. అయితే ఇతగాడి ఆస్తి తెలిస్తే షాకవుతారు అంతే
బీహార్ లోని పాట్నా నగరంలో పప్పు అనే బిక్షగాడు కోటీశ్వరుడిగా మారాడు
బిక్షగాళ్లని తేలిగ్గా తీసిపారేయకండి.. మనకంటే.. అందరికంటే.. ఆస్తిపరులు వారిలో ఉన్నారు. కష్టించి పనిచేయకుండా సులువుగా డబ్బులు సంపాదించడంలో ఉన్న కిక్కు మరిదేంట్లో ఉండదంటారు వాళ్లు. చేయి చాస్తే చాలు.. కాసులు వచ్చి పడతాయి. బిక్షగాళ్లు లక్షాధికారులని గతంలో అనేక సార్లు కథనాలు చూశాం. విన్నాం. ముంబయిలోని ఒక బిచ్చగాడు వాణిజ్య నగరంలో రెండు అతి పెద్ద అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లో షాపులతో పాటు భూములు కొనుగోలు చేశారని చదివాం. అతని నెలసరి అద్దెలే రెండున్నర లక్షల రూపాయల వరకూ వస్తాయి. పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నా, మనవళ్లు అంతర్జాతీయ స్థాయి స్కూళ్లలో చదువుతున్నా, కార్లున్నా.. కాలు కదపకుండా కోట్లు సంపాదించేవారు ఈదేశంలో కొదవలేదు.
చేయి చాచడం.
అటువంటి బిక్షగాడే బీహార్ లోనూ ఉన్నాడండోయ్. చేయి చాచడం సిగ్గుచేటని చాలా మంది ప్రవచనాలు చెబుతుంటారు. కానీ అలాంటి వారి చెవిలకు అవి ఎక్కవు. ఎందుకంటే సులభంగా ఆదాయం వస్తుండటంతో పాటు.. కాయాకష్టం లేకుండా కాసులు వచ్చి చేరుతుంటే ఎందుకు పట్టించుకుంటారు. బీహార్ లో పప్పు అనే బిక్షగాడి ఆస్తులు చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. సొంతిల్లు, భూములు, పిల్లలను ప్రయివేటు పాఠశాలలో ఇంగ్లీష్ చదువులు.. కార్లు ఇలా ఒకటేమిటి.. మనకంటే బెటర్ లైఫ్ ఈ బిక్షగాడి సొంతం. అయినా చేతిలో చిప్పను మాత్రం పప్పు వదలలేదు. తనకు ఈ వృత్తి బెటర్ అని భావించి ఇప్పటికీ దానిని కొనసాగిస్తున్నాడు.
చదువు అబ్బక...
బీహార్ లోని పాట్నా నగరంలో పప్పు చిన్న ప్పుడు సక్రమంగా చదివేవాడు కాదు. పోయి అడుక్కు తినుపోరా అంటూ తల్లిదండ్రులు అతగాడిని గట్టిగానే మందలించినట్లుంది. అయితే అందరి మాదిరి పప్పు దానిని తిట్టుగా భావించలేదు. ఆశీర్వాదంగానే భావించి యాచక వృత్తిని ప్రారంభించాడు. ఇంటినుంచి పారిపోయి ముంబయికి వచ్చాడు. ముంబయిలోని రైల్వే స్టేషన్ లో తొలి రోజు సంపాదన మూడువేల నాలుగు వందల రూపాయలు రావడంతో ఇక పప్పు వెనుదిరిగి చూడలేదు. తర్వాత పాట్నాకు వచ్చి ఇదే బెటర్ అని భావించి బిక్షమెత్తుతూ బతుకుతున్నాడు. పప్పుకు ఇద్దరు పిల్లలు. సొంతఇల్లు. భూములతో పాటు మంచి జీవితం.
అవసరమైన వాళ్లకే...
పప్పు బయటకే బిక్షగాడు. అది తన వృత్తి అంటాడు. అందులోనే తనకు సంతృప్తి అని చెబుతున్నాడు. మరేమీ పనిచేయలేక, చదువు అబ్బక తాను ఈ వృత్తిలోకి విధిలేక దిగినా.. తనను ఆదరించిన వారికి ధన్యవాదాలు కూడా పప్పు చెబుతుండటం విశేషం. అలాగే తన పిల్లలను మాత్రం ఈ వృత్తిలోకి రానివ్వనంటే రానివ్వనని చెబుతున్నాడు. కానీ అందరూ పప్పును మాత్రం ఆదర్శంగా తీసుకోకండి. పప్పులా బిక్షమెత్తితే జీవితం సంగతి అటుంచితే... సోమరులుగా మారి ఈ దేశానికి బరువుగా మారతారు. కానీ ఇలాంటోళ్లు బిక్షగాళ్లలో ఉంటారని మాత్రం తెలుసుకోండి. అవసరమైన వాళ్లకు మాత్రమే సాయం చేయడం అత్యుత్తమం.
Next Story