Sat Dec 21 2024 02:19:47 GMT+0000 (Coordinated Universal Time)
బోరుబావిలో పడిన బాలుడు సేఫ్
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అధికారులకు సమాచారమివ్వగా.. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని.. బాలుడు ఎంతలోతులో
బీహార్ నలంద జిల్లాలోని కుల్ గ్రామంలో ఆదివారం నాలుగేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. ఆ బాలుడి తల్లి పొలం పనులు చేసుకుంటూ ఉండగా.. బాలుడు ఆడుకుంటూ బోరుబావిలో పడ్డాడు. కాసేపటికి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అధికారులకు సమాచారమివ్వగా.. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని.. బాలుడు ఎంతలోతులో ఉన్నాడో పరిశీలించారు. 40 అడుగుల లోతులో బాలుడు సజీవంగా ఉన్నాడని గుర్తించి.. బాలుడి కదలికలను తెలుసుకునేందుకు ఒక కెమెరాను లోపలికి పంపారు. ఒక మైక్ ను కూడా పంపి.. బాలుడికి ధైర్యం చెబుతూ బయటి నుంచి సహాయక చర్యలు చేపట్టారు.
నాలుగేళ్ల శుభమ్ ను రెస్క్యూటీమ్ సాయంత్రానికి ప్రాణాలతో బయటకు తీసుకొచ్చింది. బయటకు వచ్చిన వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సుమారు 5 గంటలపాటు శ్రమించి బాలుడిని రక్షించింది. కాగా.. పొలానికి నీటి కోసమై రైతు ఆ ప్రాంతంలో బోరు వేయించేందుకై బోరుబావిని తవ్వించాడు. అక్కడ నీరు అందకపోవడంతో.. మరో ప్రాంతంలో బోరు వేశారు. కానీ అంతకుముందు తవ్విన బోరుబావిని మూసివేయకపోవడంతో బాలుడు ఆడుకుంటూ అందులో పడిపోయాడు. ఇకనైనా ఇలా నిరుపయోగంగా ఉన్న బోరుబావులను మూసివేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
Next Story