కొత్త పార్లమెంట్ భవనంపై వివాదం
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం.. దేశంలో రాజకీయ కాకరేపుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని తీవ్ర తరం చేసింది.
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం.. దేశంలో రాజకీయ కాకరేపుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని తీవ్ర తరం చేసింది. ప్రధాని మోదీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాల నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రధాని మోదీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్లమెంటు కొత్త భవనం సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవం అధికార, ప్రతిపక్షాల బలాబలాలకు వేదికగా మారింది. కొత్త భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో విపక్షాలన్నీ ప్రారంభోత్సవానికి వచ్చేది లేదని తేల్చి చెప్పాయి. రాష్ట్రపతికి మాత్రమే భవనాన్ని ప్రారంభించే అర్హత ఉందని స్పష్టం చేశాయి.
ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని కనీసం ఆహ్వానించకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. భవన నిర్మాణానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించడం సముచితమని అధికార పార్టీ, ప్రభుత్వ వర్గాలూ వాదిస్తున్నాయి. కానీ విపక్షాల వాదన మరోలా ఉంది. రాజ్యాంగానికీ, పార్లమెంటుకూ అవినాభావ సంబంధం ఉన్నందున, రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి చేత ప్రారంభింప చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ అధినాయకత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కాంగ్రెస్ సహా మరో 19 పార్టీలు గొంతు కలిపాయి. రాష్ట్రపతికి సముచిత గౌరవ ఇవ్వని కార్యక్రమంలో పాల్గొనే ఛాన్సే లేదని తెగేసి చెప్పాయి.
ప్రారంభోత్సవాన్ని ప్రధాని చేత జరిపిస్తే, తాము బహిష్కరిస్తామంటూ 19 పార్టీలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. 2014లో నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తరువాత తొలిసారి ఇన్ని ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చిన సందర్భం ఇదే.కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతాదళ్ (యునైటెడ్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన యూబీటీ , సీపీఐఎం, సమాజ్ వాదీ , రాష్ట్రీయ జనతాదళ్, సీపీఐ , ఎంఐఎం , జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్ , రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం , విడుతలై చిరుతైగల్ కట్చి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు.. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. మరోవైపు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కూడా తాము ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని స్పష్టం చేశారు.