Mon Nov 18 2024 07:47:43 GMT+0000 (Coordinated Universal Time)
ఈవ్ టీజర్ కు గుణపాఠం చెప్పిన అమ్మాయిలు
అలా ఓ ఇద్దరు అమ్మాయిలని వేధిస్తున్న ఆకతాయికి ఇద్దరు అమ్మాయిలు తగిన గుణపాఠం చెప్పారు.
ఈవ్ టీజింగ్.. ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయింది. కాలేజీల్లోనూ ర్యాగింగ్ తో పాటు ఈవ్ టీజింగ్ పెరిగిపోతుంది. ఇక రోడ్డుపై వెళ్లే అమ్మాయిలను ఆకతాయిలు ఎలా వేధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఓ ఇద్దరు అమ్మాయిలని వేధిస్తున్న ఆకతాయికి ఇద్దరు అమ్మాయిలు తగిన గుణపాఠం చెప్పారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన తాలూకా వివరాల్లోకి వెళ్తే.. కల్యాణ్ ప్రాంతం, అంబివల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని వడవాలి గ్రామంలో ఈ ఘటన మంగళవారం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న యువతుల పట్ల ఓ యువకుడు ఈవ్ టీజింగ్ కు పాల్పడ్డాడు.
వారి వెంట పడుతూ.. అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడాడు. దాంతో ఆ అమ్మాయిల కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే అతడిని పట్టుకుని చితక్కొట్టారు. సమీపంలోని ఓ బెంచీపై కూర్చోబెట్టి.. ఒకరి తర్వాత ఒకరు ఆ చెంప..ఈ చెంప వాయించేశారు. అతడు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా అమ్మాయిలు వదల్లేదు. అక్కడే ఉన్న ఒక మహిళ, అమ్మాయిలకు చీపురు తీసుకొచ్చి ఇచ్చింది. దీంతో అతడిని చీపురుతో కొట్టారు. ఈ దృశ్యాన్ని అక్కడి వాళ్లెవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఇందుకు సంబంధించి తమకెలాంటి ఫిర్యాదు అందలేదు కానీ.. వీడియో ఆధారంగా విచారణ జరుపుతామని తెలిపారు.
Next Story