Mon Dec 23 2024 19:36:32 GMT+0000 (Coordinated Universal Time)
మాట నిలబెట్టుకుంటున్న పంజాబ్ ముఖ్యమంత్రి
లిమిట్ దాటిన యూనిట్లకు మాత్రమే ఛార్జీ విధించబడుతుంది. ఇక రెండు నెలల్లో 600 యూనిట్లు దాటితే విద్యుత్ వినియోగానికి..
పంజాబ్ : జులై 1 నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన కులాలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, స్వాతంత్య్ర సమరయోధులు ప్రస్తుతం నెలకు 200 యూనిట్లు ఉచితంగా పొందుతున్నారని, వారి వినియోగం రెండు నెలల్లో 600 యూనిట్ల కంటే ఎక్కువగా ఉంటే, అప్పుడు వారు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను పొందుతారని భగవంత్ మాన్ చెప్పారు.
లిమిట్ దాటిన యూనిట్లకు మాత్రమే ఛార్జీ విధించబడుతుంది. ఇక రెండు నెలల్లో 600 యూనిట్లు దాటితే విద్యుత్ వినియోగానికి వినియోగదారుడే మొత్తం చెల్లించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదని, అయితే వ్యవసాయ వర్గాలకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని ఆయన అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చి నెల రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.
పంజాబ్ ప్రజలకు ఒక తీపి కబురు అందిస్తామంటూ ఈ నెల 12న సీఎం భగవంత్ ట్వీట్ చేశారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిసిన అనంతరం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ తమ అధినేత కేజ్రీవాల్ తో సమావేశం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు త్వరలోనే గుడ్ న్యూస్ చెపుతామని తెలిపారు. ఆయన చెప్పిన విధంగానే 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు ప్రకటన వెలువడింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో... ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామనే హామీని ఆప్ ఇచ్చింది. ఆప్ హామీని నిలబెట్టుకుంది. ఢిల్లీలో కూడా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను ఆప్ ప్రభుత్వం ఇస్తోంది.
Next Story