Sun Dec 22 2024 18:38:20 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిత్య-L1లో మరో కీలక ఘట్టం పూర్తి చేసిన ఇస్రో
సూర్యుని రహస్యాలను బట్టబయలు చేసేందుకు ఇస్రో ఈనెల 2వ తేదీన ఆదిత్య ఎల్-1ను ప్రయోగించిన విషయం తెలిసిందే...
సూర్యుని రహస్యాలను బట్టబయలు చేసేందుకు ఇస్రో ఈనెల 2వ తేదీన ఆదిత్య ఎల్-1ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ మిషన్ భూమికి - సూర్యునికి మధ్య ఉన్న లాంగ్రెస్ పాయింట్కు అంటే L1కు చేరుతుంది. ఇప్పటి వరకు భూమి చుట్టూ మూడు కక్ష్యలను పూర్తి చేసుకున్న ఆదిత్య సెప్టెంబర్ 10వ తేదీన భూమి మూడవ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. తాజాగా ఇస్రో చేపట్టిన నాలుగోసారి ఆదిత్య-L1 భూ కక్ష్య పెంపు ప్రక్రియ విజయవంతం అయ్యింది. ప్రస్తుతం ఆదిత్య-ఎల్1 శాటిలైట్ కొత్త కక్ష్య 256 కిమీ x 121973 కిమీ కక్ష్యలో తిరుగుతోంది. ఈ మేరకు ఇస్రో సోషల్ మీడియా ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించింది.
బెంగళూరులోని ఇస్రో డీప్ స్పేస్ స్టేషన్ ప్రధాన కేంద్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఆదిత్య-ఎల్1 నాలుగో భూ కక్ష్య పెంపు విజయవంతం చేసింది. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్- షార్, పోర్ట్బ్లెయిర్లోని ఇస్రో కేంద్రాల నుంచి ఈ ఆపరేషన్ను ట్రాక్ చేశామని. ప్రస్తుతం కొత్త కక్ష్య 256 కిమీ x 121973 కిమీ కిలో మీటర్ల కక్ష్యలో ఆదిత్య-L1 తిరుగుతున్నట్లు ఇస్రో తెలిపింది. తదుపరి భూ కక్ష్య పెంపు ప్రక్రియ ఈనెల 19వ తేదీన చేపట్టనున్నట్లు తెలిపింది.
భూమికి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న మొదటి సూర్య-భూమి లాగ్రాంజియన్ పాయింట్ (L1) చుట్టూ ఉన్న హాలో కక్ష్య నుంచి సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఇస్రో చేపట్టి తొలి ప్రయోగం. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ సి-57) సెప్టెంబర్ 2న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఆదిత్య-L1 అంతరిక్ష నౌకను ఇస్రో ప్రయోగించింది. ప్రయోగం చేపట్టిన రోజు 63 నిమిషాల 20 సెకన్ల విమాన వ్యవధి తర్వాత, ఆదిత్య-ఎల్1ను భూమి చుట్టూ 235x19500 కి.మీల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.
భూమి చుట్టూ నాలుగు భూ కక్ష్య పూర్తి చేయడం ద్వారా ఆదిత్య-L1 తదుపరి ట్రాన్స్-లాగ్రాంజియన్1 చొప్పించేందుకు సిద్ధమవుతుంది. పూణేలోని ఇంటర్-యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ స్వదేశీంగా అభివృద్ధి చేసిన ఏడు సైంటిఫిక్ పేలోడ్లను ఆదిత్య L1 తీసుకువెళ్లింది. ఈ పేలోడ్లు విద్యుదయస్కాంత కణం, అయస్కాంత క్షేత్ర డిటెక్టర్లను ఉపయోగించి సూర్యుడి బయటి పొరల నుంచి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ను సేకరిస్తాయి. ప్రత్యేక వాన్టేజ్ పాయింట్ L1ని ఉపయోగించి, నాలుగు పేలోడ్లు సూర్యుడిని నేరుగా వీక్షిస్తాయి.
Next Story