Mon Nov 18 2024 06:43:01 GMT+0000 (Coordinated Universal Time)
MS Swaminathan : ఆయనకు ఈ దేశం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేముగా
ఈరోజు భారత రత్న అవార్డులు పొందిన వారిలో వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాధన్ ఒకరు.
భారత రత్న అవార్డులు పొందిన వారిలో వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాధన్ ఒకరు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారతరత్న అవార్డు స్వామినాధన్ సొంతమయింది. ఆయన వ్యవసాయ రంగానికి చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు మాత్రమే కాదు.. మొత్తం దేశ ప్రజలు ఆకలితో అలమటించిపోకూడదన్న ఆయన తపనకు పడిన శ్రమకు దక్కిన ఫలితం అని చెప్పాలి. హరిత విప్లవ పితామహుడిగా ఆయనకు పేరు. వ్యవసాయ రంగంలో పెను మార్పులు తెచ్చిన ఘనత స్వామినాధన్ కే దక్కుతుంది.
పరిశోధనలతో...
మార్పులు అంటే మామూలువి కావు. ఆయనచేసిన పరిశోధనలతో వ్యవసాయరంగం కొంత పుంతలు తొక్కిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. రైతులకు అండగా నిలవడంతో పాటు పేదల ఆకలి తీర్చేలా ఆయన పరిశోధనలు సాగాయి. ఈరోజు దేశంలో పంట పొలాలు ఇలా వర్ధిల్లుతున్నాయంటే స్వామినాధన్ కృషి అనడంలో ఏ మాత్రం అతి శయోక్తి కాదు. స్వామినాధన్ ఎందుకు వ్యవసాయ రంగంపైనే దృష్టి పెట్టారు?ఆయన సమున్నతమైన కెరీర్ ను వదులుకుని మరీ ముందుకొచ్చిన అతిగొప్ప వ్యక్తి ఎంఎస్ స్వామినాధన్.
కుంభకోణంలో పుట్టి...
సాంబశివ స్వామినాధన్ తమిళనాడులోని కుంభకోణంలో 1925లో జన్మించారు. పదిహేనేళ్లవయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయంలో ఆయన వైద్య వృత్తిని ఎంచుకున్నారు. తొలుత వైద్య రంగంలో చేరదామని బెంగాల్‌కు వచ్చిన ఆయనకు అక్కడి క్షామం కదలించి వేసింది. మనసును గాయపర్చింది. దీంతో వైద్య వృత్తిని వదులుకుని అగ్రకల్చర్ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరారు. దేశంలో ఎవరూ ఆకలితో చనిపోకూడదని భావించిన ఆయన ఆ దిశగానే పరిశోధనలు సాగాయి.
ఎన్నో అవార్డులు...
పంటలకు చీడపీడలు పట్టకుండా, పంట దిగుబడులు పెరిగేందుకు వీలుగా ఆయన చేసిన పరిశోధనలు సాగాయి. ఆయన రూపొందించిన వంగడాలు అనేకమంది ఆకలిని తీర్చగలిగాయి. అన్నదాతకు నష్టం కలగని రీతిలో సాగు పద్ధతులను ఆయన కనిపెట్టడంతో పాటు నూతన వంగడాల ఆవిష్కరణలతో యావత్ రైతాంగం ముఖ చిత్రాన్నే మార్చివేశారు. ఆయన చేసిన కృషికి అత్యంత ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసేసే అవార్డు కూడా దక్కింది. ఇక పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్లకు తోడుగా ఇప్పుడు భారతరత్న జత అయింది. ఆయన గత ఏడాది సెప్టంబరు నెలలో చెన్నైలో మరణించారు. ఆయనకు అత్యున్నత పురస్కారం దక్కడం యావత్ భారతదేశానికి గర్వకారణం.
Next Story