Fri Nov 22 2024 20:19:02 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఇరుకున పెట్టేలా విపక్షాల ప్లాన్
నిజానికి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ మంగళవారమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కానీ.. చాలా పార్టీల నాయకులు..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి (జులై 20) నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతిసారి ఉభయసభల సమావేశాలకు ముందు అఖిలపక్షం సమావేశం కావడం ఆనవాయితీగా వస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి, కేంద్ర సీనియర్ మంత్రులు, వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు హాజరు కానున్నారు.
నిజానికి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ మంగళవారమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కానీ.. చాలా పార్టీల నాయకులు అందుబాటులో లేని నేపథ్యంలో సమావేశాన్ని నేటికి వాయిదా వేశారు. అఖిల పక్ష భేటీ గురించి చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన కేబినెట్ సహచరులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్తో నిన్న సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా.. ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రసవత్తరంగా సాగనున్నాయి.
ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ధరల పెరుగుదల, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి సమస్యలతో పాటు మణిపూర్ సంక్షోభంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. గత పార్లమెంట్ సెషన్ లోనూ విపక్షాలు తరచూ నిరసనలు చేసి పార్లమెంట్ ప్రాంగణాన్ని హోరెత్తించారు.
Next Story