Wed Nov 06 2024 01:37:46 GMT+0000 (Coordinated Universal Time)
ఆల్మట్టి గేట్లు తెరుచుకున్నాయ్..
జూరాలలో జలవిద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 40 వేల క్యూసెక్కులు ఉండగా 30 వేల..
ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో ఆల్మట్టి డ్యాం క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ కు 1,61,747 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా జలవిద్యుత్ కేంద్రాలు, గేట్ల ద్వారా 1.50 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. రాత్రి వరకు అవుట్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉంది. ఆల్మట్టి నుంచి శ్రీశైలానికి 455 కిలోమీటర్ల దూరం. అంటే మరో మూడు రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్ కు భారీ వరద వచ్చి చేరుతుంది. ఆల్మట్టి దిగువన ఉన్న 31 టీఎంసీల నారాయణపుర (బసవ సాగర) జలాశయం గేట్లను కూడా ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు జూరాలకు విడుదల చేస్తున్నారు.
జూరాలలో జలవిద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 40 వేల క్యూసెక్కులు ఉండగా 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 101 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న తుంగభద్ర డ్యామ్ లో నిల్వ 60 టీఎంసీలకు చేరింది. ప్రస్తుత ఇన్ ఫ్లో 1,11,566 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ నుంచి వరద నీరు ఇదే విధంగా వస్తే నాలుగు రోజుల్లో తుంగభద్ర పూర్తిగా నిండుతుంది.
మరో పక్క నిజామాబాద్ లో గోదావరిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో మళ్లీ పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 90 టీఎంసీలు ఉండగా.. ఈ రిజర్వాయర్ లో నీటి నిల్వ 76 టీఎంసీలకు చేరింది. మరో 48 గంటల్లో శ్రీరాంసాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాల్సి ఉండొచ్చని అధికారులు తెలిపారు. కర్ణాటకలో భారీ వర్షాలు కొనసాగుతున్నందున ఆగస్టు నెలాఖరు నాటికి నాగార్జున సాగర్ కూడా వరద నీటితో నిండే అవకాశం ఉంది. రాజమండ్రి వద్ద ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి ఇప్పటికే 12.24లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దిగువన అనేక లంక గ్రామాలు గోదావరి వరద నీటితో చిత్తడిగా మారాయి. రహదారులపై రాకపోకలకు ఆటంకం కలుగుతోంది.
Next Story