Mon Dec 23 2024 06:06:45 GMT+0000 (Coordinated Universal Time)
టీవీ నటిని చంపిన తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం
ఎల్ఈటీ కమాండర్ లతీఫ్ ఆదేశాలతోనే వీళ్లిద్దరూ టీవీ నటిని పొట్టనబెట్టుకున్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
కశ్మీరీ టీవీ నటి అమ్రీన్ భట్‌ను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే..! ఆమెను హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆమె హత్య జరిగిన 24 గంటల్లోనే భద్రతా దళాలు వారిని ఎన్కౌంటర్ చేశాయి. అవంతిపొరాలోని అగన్‌హజిపొరాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు మృతి చెందారు. వీరిద్దరు స్థానిక ఉగ్రవాదులే అని భద్రతా దళాలు తెలిపాయి. వీరిలో షాహిద్ ముస్తాక్ భట్ బుద్గాం వాసి కాగా..మరో ఉగ్రవాది ఫర్హాన్ హబీబ్ పుల్వామాలో హికీంపొరా వాసిగా గుర్తించారు. వీరిద్దరు టీవీ నటి అమ్రీన్ హత్యలో నిందితులని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ వెల్లడించారు. వీరి వద్ద నుంచి ఒక ఏకే 56 రైఫిల్, నాలుగు మ్యాగ్జైన్లు, ఒక పిస్తోల్‌ను స్వాధీనం చేసుకొన్నారు.
వీరిద్దరు ఇటీవలే టెర్రరిస్ట్ క్యాంప్‌లో చేరినట్లు గుర్తించారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు లష్కర్ ఈ తాయిబా గ్రూప్ సభ్యులుగా నిర్ధారించారు. ఎల్ఈటీ కమాండర్ లతీఫ్ ఆదేశాలతోనే వీళ్లిద్దరూ టీవీ నటిని పొట్టనబెట్టుకున్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. బుద్గామ్‌లోని చదూరా ప్రాంతంలో కశ్మీరి టీవీ నటి అమ్రీన్ భట్‌ను తీవ్రవాదులు బుధవారం రాత్రి కాల్చి చంపారు. ఇదే ఘటనలో ఆమె మేనల్లుడు ఫర్హాన్ జుబైర్ గాయపడ్డాడు. పదేళ్ల బాలుడి చేతికి బుల్లెట్ గాయమైందని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ బంధువు జుబైర్ అహ్మద్ మాట్లాడుతూ.. బుధవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు షూటింగ్ ఉందంటూ పిలిచేందుకు ఇంటికి వచ్చారని తెలిపారు. అమ్రీన్ బయటకు షూటింగ్‌కు రానని చెప్పడంతో కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనగర్‌లోని సౌర ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు. గత మూడు రోజుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 10 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇందులో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు కాగా.. మిగతా ఏడుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు.
Next Story