Sun Dec 22 2024 05:30:01 GMT+0000 (Coordinated Universal Time)
స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలర్ట్.. వెంటనే ఈ యాప్స్ డిలీట్ చేయండి
ఈ స్పైవేర్ మన వ్యక్తిగత సమాచారం, ఈ-మెయిల్స్ డేటాతోపాటు ఫోన్ కెమెరా సాయంతో రికార్డు చేసి తమకు అవసరమైన వారికి చేరవేస్తుంది.
పిల్లల నుంచీ పెద్దల వరకూ.. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్లకు బానిసలు. ఉపయోగం ఉన్నా లేకున్నా.. చాలా సమయం స్మార్ట్ ఫోన్ కే కేటాయిస్తున్నారు. కాల్స్ మాట్లాడటం, చాటింగ్ వరకే కాదు.. గంటల తరబడి రీల్స్ చూడటం, రీల్స్ చేయడం, ఫోన్స్ లోనే సినిమాలు చూడటం, వీడియో గేమ్స్ ఇలా రకరకాలుగా ఫోన్లకు అలవాటుపడిపోయారు. వాటికోసం వివధ రకాల యాప్స్ ను కూడా డౌన్లోడ్ చేసుకుంటాం. అయితే.. తాజాగా.. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం CERT-In చెప్పిన ఓ విషయం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా 105 యాప్ ల ద్వారా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్లలోకి స్పైవేర్ చొచ్చుకొచ్చిందని దాని సారాంశం.
ఈ స్పైవేర్ మన వ్యక్తిగత సమాచారం, ఈ-మెయిల్స్ డేటాతోపాటు ఫోన్ కెమెరా సాయంతో రికార్డు చేసి తమకు అవసరమైన వారికి చేరవేస్తుంది. ఈ వైరస్ పేరు స్పిన్ ఓకే. మనం ఇండ్లలో ఫోన్ పెట్టేసి పనులు చేసుకుంటున్నప్పుడు ఏం జరుగుతున్నది. మనం ఏం మాట్లాడుకుంటున్నది మొత్తం ఫోన్ రికార్డు చేసేస్తుంది. అంతటి సామర్థ్యం గల ఈ స్పైవేర్ దేశంలోని 42 కోట్ల స్మార్ట్ ఫోన్లలోకి చొచ్చుకొచ్చిందని సెర్ట్-ఇన్ నివేదిక వెల్లడించింది. గూగుల్ ప్లే స్టోర్స్లోని 105 యాప్స్ ద్వారా సదరు స్పైవేర్ మన ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడిందని కూడా సెర్ట్-ఇన్ తేల్చింది.
ఈ యాప్స్ లోనే స్పిన్ ఓకే స్పైవేర్
ఆన్ లైన్ క్యాష్ రివార్డ్స్, గేమ్స్, ఫిట్ నెస్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్, ఇన్వెస్ట్మెంట్, నాయిస్ వీడియో ఎడిటర్, జాప్యా, బైగో ఎంవీ బిట్, క్రేజీ డ్రాప్స్, టిక్, వుయ్ ఫ్లై, క్యాష్ జాయిన్, క్యాష్ ఈఎం, ఫిజ్జో నావెల్ వంటి యాప్స్లో ‘స్పిన్ ఓకే’ చొరబడింది. భారత్ లో జాప్యా, నాయిస్ వీడియో ఎడిటర్ 10 కోట్లు, బైగో, ఎంవీ బిట్, వీ ఫ్లయ్ యాప్స్ ఐదు కోట్లకు పైగా యూజర్లను కలిగి ఉన్నాయి. దేశ భద్రతకు, జాతి ప్రయోజనాలకు సంబంధించిన రహస్య సమాచారం లీక్ కాకుండా అనుమానాస్పద యాప్స్ అన్నీ మొబైల్ ఫోన్ల నుంచి డిలీట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖలు, మంత్రుల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఈ స్పైవేర్ ను అడ్డుకోవాలంటే.. యాంటీ వైరస్, యాంటీ స్పైవేర్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్, వెబ్ సైట్లో వచ్చే అడ్వర్టైజ్ మెంట్లను ఇగ్నోర్ చేయాలి.
Next Story