Wed Dec 25 2024 13:51:00 GMT+0000 (Coordinated Universal Time)
Tamilnadu : తమిళనాడులో నేడు మహానాడు.. విజయ్ కీలక ప్రకటన
నేడు తమిళనాడులో మరో కీలక పరిణామం జరగనుంది. హీరో విజయ్ కు చెందిన టీవీకే మహానాడు నేడు జరగనుంది
నేడు తమిళనాడులో మరో కీలక పరిణామం జరగనుంది. రాజకీయంగా ఒక మహా అడుగు పడగనుంది. తమిళనాడు రాష్ట్రంలో జాతీయ పార్టీలకు స్థానం లేదు. అక్కడ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు ఇతర పార్టీలకు అనుబంధంగానో లేక తోక పార్టీల్లాగా ఉంటాయి. ఆధిపత్యం అంతా ప్రాంతీయ పార్టీలదే. ఇప్పటి వరకూ కొన్ని దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు మాత్రమే తమిళనాడు రాష్ట్రాన్ని ఏలుతూ వస్తున్నాయి. ఎంజీర్ నుంచి జయలలిత వరకూ, ఇటు డీఎంకేలో కరుణానిధి నుంచి స్టాలిన్ వరకూ వారే ముఖ్యమంత్రులు అయ్యారు. అంతే తప్ప వేరే పార్టీకి అవకాశం లేదు. ప్రజలు కూడా ఆ రెండు పార్టీల్లో ఏదో ఒక్క దాని వైపు మొగ్గు చూపుతారు.
రెండు పార్టీలే...
అయితే జయలలిత మరణంతో అన్నా డీఎంకే చీలిపోయింది. శశికళ ఒక కుంపటి పెట్టుకోగా, పళనిస్వామి పార్టీని చేజిక్కించుకున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా సొంతంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అన్నాడీఎంకే దాదాపుగా మూడుగా చీలిపోవడంతో ఆ ఓట్లు కూడా చీలిపోయినట్లయింది. డీఎంకేకు గట్టి పోటీ ఇచ్చే పార్టీ లేదు. సినీనటుడు కమల్ హాసన్ ఏర్పాటు చేసిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీ ఇప్పటి వరకూ ఏ ఎన్నిక్లోనూ ప్రజలు ఆదరించలేదు. అయితే అది బీజేపీకి దూరంగా, కాంగ్రెస్ కు చేరువగా ఉండే అవకాశాలున్నాయని అనిపిస్తుంది. ఈ సమయంలో తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది.
హీరో విజయ్...
తమిళ హీరో విజయ్ టీవీకే పార్టీని ఇప్పటికే ప్రకటించారు. విజయ్ కు తమిళనాడు అంతా విస్తృతమైన అభిమాన గణం ఉంది. ఆయన పార్టీ ఏర్పాటు చేయడమే కాకుండా టీవీకే మహానాడును నేడు తమిళనాడులో తొలి సారి నిర్ణయించనున్నారు. ఈ మహానాడులో తాను పార్టీ పెట్టిన కారణాలు, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నదీ ప్రజలకు విజయ్ వివరించే అవకాశముంది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రంవాడీలో టీవీకే మహానాడుకు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి మహానాడు ప్రారంభం కానుంది. తిరుచ్చి జాతీయ రహదారిలో మూడు కిలోమీటర్ల జెండాలు, విద్యుత్తు దీపాలంకరణలతో అలంకరించారు. రానున్న అసెంబ్ల ీఎన్నికల బరిలోకి విజయ్ దిగే అవకాశముందని చెబుతున్నారు. దీంతో తమిళనాడు రాజకీయాలు హాట్ హాట్ గా మారనున్నాయి.
Next Story